Share News

Bandi Sanjay: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంటుందో.. ఊడుతుందో?

ABN , Publish Date - Feb 18 , 2025 | 04:13 AM

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంటుందో.. ఊడుతుందో.. అర్థం కాని పరిస్థితి ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. సోమవారం కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలోని బీజేపీ మండల అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు.

Bandi Sanjay: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంటుందో.. ఊడుతుందో?

  • మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య ఆ పార్టీలో చీలిక

  • ప్రతీ పనికి కమీషన్‌ దండుకుంటున్న కొందరు మంత్రులు

  • బీసీల్లో ముస్లింలను చేర్చి బిల్లు పంపితే ఆమోదించం: సంజయ్‌

కరీంనగర్‌, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంటుందో.. ఊడుతుందో.. అర్థం కాని పరిస్థితి ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. సోమవారం కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలోని బీజేపీ మండల అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల మధ్య చీలిక వచ్చిందని, ప్రభుత్వం ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితి ఉందన్నారు. కొందరు మంత్రులు ప్రతీ పనికి 15 శాతం కమీషన్‌ దండుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కులగణన చేపట్టి కొరివితో తలగోక్కుంటోందని వ్యాఖ్యానించారు. బీసీ జాబితాలో ముస్లింలను చేర్చి కేంద్రానికి బిల్లు పంపుతామంటే ఆమోదించే ప్రసక్తే లేదన్నారు. ముస్లింలను తొలగించి బీసీ జాబితా పంపితే కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత తమదేనని చెప్పారు. కాంగ్రెస్‌ అంటేనే బాకీల సర్కార్‌ అని విమర్శించారు.


నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా, యువతులకు స్కూటీ, ఉద్యోగ, ఉపాధ్యాయులకు నాలుగు డీఏలు, రెండో పీఆర్సీ, విద్యార్థి, కళాశాల యజమానులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఓల్డ్‌ పెన్షన్‌ స్కీం, జీపీఎఫ్‌ డబ్బులు ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్ర ప్రజలందరికీ కాంగ్రెస్‌ ప్రభుత్వం బాకీ ఉందన్నారు. బీఆర్‌ఎస్‌ పని అయిపోయిందని, అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను కూడా నిలబెట్టలేక పోయిందని ఎద్దేవా చేశారు. ఇక రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం పాత్ర పోషించేది బీజేపీయే అన్నారు. క్రైస్తవుల్లో చాలా మంది ఎస్సీ సర్టిఫికెట్లు తీసుకుంటూ ఎస్సీలను మోసం చేస్తున్నారని, బీసీల్లో ముస్లింలను చేర్చి బీసీలను మోసం చేస్తున్నారన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆపార్టీకి కొమ్ము కాయడమే కుల సంఘాల పనా? అని ప్రశ్నించారు. మేధావులు ఆలోచించి బీజేపీని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని ఆయన కోరారు.

Updated Date - Feb 18 , 2025 | 04:13 AM