Local Body Election: సర్పంచులు, వార్డు సభ్యుల బాధ్యతల స్వీకరణ తేదీ వాయిదా
ABN , Publish Date - Dec 17 , 2025 | 01:03 PM
డిసెంబర్ 20వ తేదీన సరైన ముహూర్తాలు లేవని.. 22కు వాయిదా వేయాలని ప్రజా ప్రతినిధుల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. వారి విజ్ఞప్తులపై పంచాయతీరాజ్ శాఖ సానుకూలంగా స్పందించింది.
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యుల బాధ్యతల స్వీకరణ వాయిదా పడింది. కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు ఈ నెల 20వ తేదీన బాధ్యతలు స్వీకరించాల్సి ఉండింది. అయితే, ముహూర్తాల కారణంగా బాధ్యతల స్వీకరణ రెండు రోజులు ముందుకు జరిగింది. డిసెంబర్ 20వ తేదీన సరైన ముహూర్తాలు లేవని.. 22కు వాయిదా వేయాలని ప్రజా ప్రతినిధుల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. వారి విజ్ఞప్తులపై పంచాయతీరాజ్ శాఖ సానుకూలంగా స్పందించింది. సర్పంచులు, వార్డు సభ్యుల బాధ్యతల స్వీకరణ తేదీని 20 నుంచి 22వ తేదీకి మార్పు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇదే రోజున నూతన సర్పంచులు, వార్డు సభ్యులు పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు.
ముగిసిన పంచాయతీ ఎన్నికలు..
నేటి(బుధవారం)తో మూడు విడతల పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. బుధవారం మూడవ విడతలో భాగంగా 3,752 గ్రామ పంచాయతీలకు, 28,410 వార్డులకు పోలింగ్ జరిగింది. ఈ విడతలో సుమారు 53 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో పోలింగ్ ముగిసింది. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉండనుంది. సాయంత్రానికి ఫలితాలు రానున్నాయి. డిసెంబర్ 22వ తేదీన జరిగే మొదటి సమావేశంలో కొత్త పాలకవర్గాలు ప్రమాణస్వీకారం చేయనున్నాయి. 'గ్రామ పంచాయతీ సర్పంచినైన/సభ్యుడినైన ---- (విజేత పేరు)----అను నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత కలిగి ఉంటానని, నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని పేర/సత్యనిష్ఠతో ప్రమాణం చేస్తున్నాను' అని ప్రతిజ్ఞ చేయనున్నారు.
ఇవి కూడా చదవండి
బోండి బీచ్ ఉదంతం.. ఈ కుక్క వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు..
పీఎం మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం