Heartbreaking Footage: బోండి బీచ్ ఉదంతం.. ఈ కుక్క వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు..
ABN , Publish Date - Dec 17 , 2025 | 12:46 PM
ఆస్ట్రేలియాలోని బోండి బీచ్‌లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉగ్రదాడిలో చనిపోయిన ఓ వ్యక్తి పెంపుడు కుక్కకు సంబంధించిన ఆ వీడియో నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తోంది.
ఆస్ట్రేలియాలోని బోండి బీచ్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే. ‘హనూకా’ వేడుకల్లో పాల్గొన్న వందలాది మంది యూదులపై సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్‌లు తుపాకులతో దాడులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో 16 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పులకు పాల్పడ్డ ఇద్దరు తండ్రీకొడుకులుగా తేలింది. సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ మూలాలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. పాతబస్తీకి చెందిన అక్రమ్ 1998లో ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడే యూరోపియన్ మూలాలున్న వెనెరా గ్రాసో అనే మహిళను వివాహం చేసుకుని స్థిరపడ్డాడు.
కన్నీళ్లు పెట్టిస్తున్న కుక్క వీడియో..
ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కతో కలిసి బీచ్‌కు వచ్చాడు. ఈ సమయంలోనే అక్రమ్, నవీద్‌లు కాల్పులకు తెగబడ్డారు. అక్రమ్ కుక్కతో బీచ్‌కు వచ్చిన వ్యక్తిని కాల్చి చంపేశాడు. అతడు నేలపై కుప్పకూలిపోయాడు. సాధారణంగా అయితే, తుపాకుల శబ్ధానికి కుక్క భయపడి అక్కడినుంచి పారిపోవాలి. ఆ కుక్క మాత్రం పారిపోలేదు సరికదా భయపడును కూడా లేదు. నేలపై చలనం లేకుండా పడిపోయిన యజమాని వైపు చూస్తూ ఉండిపోయింది. శవాన్ని అక్కడినుంచి తీసుకెళ్లే వరకు అది అక్కడినుంచి పక్కకు కదల్లేదు. ఉగ్రవాది అక్రమ్ కుక్కను ఏమీ చేయలేదు. అక్కడినుంచి పక్కకు వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వీడియో ఆధారంగా ఆ కుక్కను ‘మౌసీ’గా గుర్తించారు. యజమాని శవాన్ని పోలీసులు తీసుకుని పోయిన తర్వాత అది కనిపించకుండా పోయింది. జంతు ప్రేమికులు, పెట్ డిటెక్టివ్స్ కుక్క కోసం అన్వేషిస్తున్నారు. ఇక, వైరల్‌గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘అందుకే కుక్కలను విశ్వాసానికి ప్రతీకగా చెబుతారు. తమ ప్రాణాలను అడ్డుగా పెట్టి మన ప్రాణాలను రక్షిస్తాయి’..‘ఈ వీడియో చూస్తుంటే నాకు కన్నీళ్లు ఆగటం లేదు. ఆ ఉగ్రవాది చచ్చిపోయి బతికిపోయాడు’.. ‘ఇలాంటి వీడియోలు చూస్తుంటే మనుషులకంటే జంతువులే నయం అనిపిస్తుంది’.. ‘ప్రతీ మనిషికి ఇలాంటి ఓ తోడు కావాలి’ అని అంటున్నారు.
ఇవి కూడా చదవండి
పీఎం మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం
ఇకపై ఆ సర్టిఫికేట్ ఉంటేనే పెట్రోల్, డీజిల్.. తప్పనిసరి చేసిన ప్రభుత్వం!