Share News

Water Allocation: సాగర్‌ నుంచి మరో 4 టీఎంసీలు కేటాయించాలి

ABN , Publish Date - May 27 , 2025 | 04:37 AM

తాగునీటి అవసరాల కోసం మరో 4 టీఎంసీలను నాగార్జున సాగర్‌ నుంచి కేటాయించాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కు ఆంధ్రప్రదేశ్‌ విజ్ఞప్తి చేసింది.

Water Allocation: సాగర్‌ నుంచి మరో 4 టీఎంసీలు కేటాయించాలి

  • కృష్ణా బోర్డుకు ఏపీ లేఖ

హైదరాబాద్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): తాగునీటి అవసరాల కోసం మరో 4 టీఎంసీలను నాగార్జున సాగర్‌ నుంచి కేటాయించాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కు ఆంధ్రప్రదేశ్‌ విజ్ఞప్తి చేసింది. ఈమేరకు ఆ రాష్ట్ర ఈఎన్‌సీ (ఇరిగేషన్‌) కె.నర్సింహామూర్తి ఈ నెల 22న బోర్డుకు లేఖ రాశారు. ఇప్పటికే ఏపీకి 4 టీఎంసీలు, తెలంగాణకు 10.26 టీఎంసీలు కేటాయిస్తూ ఈ నెల 20న కృష్ణాబోర్డు నీటి విడుదలకు ఆదేశం ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ.. బోర్డుకు లేఖ రాసింది. ఏపీ కేటాయింపులకు మించి నీటిని తరలించిందని, రెండు జలాశయాల్లో ఆ రాష్ట్రానికి నీటిని కేటాయించవద్దని బోర్డును కోరింది.


ఏపీ ఇప్పటిదాకా నీటిని వాడుకోగా.. తెలంగాణకు 9.662 టీఎంసీల నీరు మిగిలి ఉంది. తాము 4 టీఎంసీలు వాడుకున్న తర్వాత మరో 5.662 టీఎంసీలు ఉంటాయని, ఈ నేపథ్యంలో అదనంగా నాగార్జున సాగర్‌ కుడి ప్రధాన కాలువ నుంచి 4 టీఎంసీలు కేటాయించాలని ఏపీ కోరింది. ఈనెల 19 నుంచి 21వతేదీ దాకా శ్రీశైలం జలాశయానికి 2.32 టీఎంసీల వరద వచ్చి చేరినట్టు తెలిపింది. ఎగువ ప్రాంతాల్లో వానలు కురుస్తున్నందున శ్రీశైలంలో నీటి లభ్యత పెరుగుతుందని, తక్షణమే తమకు 4 టీఎంసీలు కేటాయించాలని ఏపీ కోరింది. దీనిపై బోర్డు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Updated Date - May 27 , 2025 | 04:37 AM