Share News

Drug Bust: తండ్రికి కిడ్నీ సమస్యలు అప్పు తీర్చేందుకు కానిస్టేబుల్‌ డ్రగ్స్‌ దందా

ABN , Publish Date - Jun 09 , 2025 | 04:41 AM

తండ్రికి కిడ్నీ సమస్యలు ఉండడంతో.. చికిత్స కోసం రూ.10 లక్షల మేర అప్పు చేసిన గుణశేఖర్‌.. రుణాన్ని తీర్చేందుకు డ్రగ్స్‌ ముఠాతో జతకట్టినట్లు దర్యాప్తు అధికారులు నిర్ధారించారు.

Drug Bust: తండ్రికి కిడ్నీ సమస్యలు అప్పు తీర్చేందుకు కానిస్టేబుల్‌ డ్రగ్స్‌ దందా

ఏఆర్‌ కానిస్టేబుల్‌ గుణశేఖర్‌ తీరు

ఉద్యోగం తీసేసిన ఏపీ పోలీసులు

గుర్తించలేకపోయిన డీఎస్పీపై బదిలీ వేటు

కూకట్‌పల్లి డ్రగ్స్‌ కేసులో ట్విస్టులు

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): కూకట్‌పల్లి పోలీసులు సీజ్‌ చేసిన రూ.కోటి విలువైన కొకైన్‌, ఎపిడ్రిన్‌ డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ను ఏపీ పోలీసు విభాగం సర్వీసు నుంచి తొలగించింది. తండ్రికి కిడ్నీ సమస్యలు ఉండడంతో.. చికిత్స కోసం రూ.10 లక్షల మేర అప్పు చేసిన గుణశేఖర్‌.. రుణాన్ని తీర్చేందుకు డ్రగ్స్‌ ముఠాతో జతకట్టినట్లు దర్యాప్తు అధికారులు నిర్ధారించారు. గుణశేఖర్‌ ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో పనిచేస్తుండగా.. తాను గురువుగా భావించే ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ రాంచందర్‌తో అన్ని సమస్యలు చెప్పుకొనేవాడు. ఈ క్రమంలో తండ్రి చికిత్స కోసం సుదీర్ఘంగా సిక్‌లీవ్‌ పెట్టిన గుణశేఖర్‌.. సురేందర్‌ అనే వ్యక్తి వద్ద చేసిన రూ.10 లక్షల అప్పును తీర్చేందుకు మార్గం చూపాలని వేడుకున్నాడు. ఈ క్రమంలో ఈశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి తన వద్ద రూ. కోటి విలువైన డ్రగ్స్‌ ఉన్నాయని, డ్రగ్స్‌ పెడ్లర్లు ఎవరైనా తెలిస్తే.. వారికి అప్పగించి, కమీషన్‌ ఇస్తానని రాంచందర్‌ను కోరాడు. దాంతో రాంచందర్‌ ఈ విషయాన్ని గుణశేఖర్‌కు చెప్పి, ఈశ్వర్‌రెడ్డిని పరిచయం చేశాడు. అప్పుతీర్చే మార్గం దొరికిందని భావించిన గుణశేఖర్‌.. ఇదే విషయాన్ని సురేందర్‌కు చెప్పి, డ్రగ్స్‌ని అమ్మిపెడితే కమీషన్‌ వస్తుందని చెప్పాడు. దాంతో సురేందర్‌ తన స్నేహితులైన హరిబాబురెడ్డి, మెర్రీ మార్గరేట్‌, షేక్‌ మస్తాన్‌ వలీ, దేవరాజు ఏసుబాబుతో కలిసి ముఠాను తయారు చేశాడు. ఈ క్రమంలో గత నెల 29న కూకట్‌పల్లిలో డ్రగ్స్‌ విక్రయానికి సిద్ధమవ్వగా.. ఉప్పందుకున్న పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.కోటి విలువ చేసే డ్రగ్స్‌ను సీజ్‌ చేశారు. నిందితులను విచారించగా.. గుణశేఖర్‌, రాంచందర్‌ పాత్రలు వెలుగులోకి వచ్చాయి. సమాచారం అందుకున్న ఏపీ పోలీసులు, గుణశేఖర్‌ను సర్వీసు నుంచి తొలగించారు. గుణశేఖర్‌, రాంచందర్‌ డ్రగ్స్‌ దందాలో ఉన్న గుర్తించనుందుకు.. వారి డీఎస్పీని బదిలీ చేశారు. కాగా, కేసు మూలాలు కర్ణాటకలో ఉన్నట్లు కూకట్‌పల్లి పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. దీంతో టీజీ న్యాబ్‌ రంగంలోకి దిగింది. ముగ్గురు ప్రధాన స్మగ్లర్లను అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. వీరు అరెస్టయితే.. బెంగళూరులో ఉండే కింగ్‌పిన్‌, నైజీరియన్‌ స్మగ్లర్లతో లింకులను గుర్తించే అవకాశాలున్నాయని టీజీ న్యాబ్‌ అధికారులు భావిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పట్టణ పేదరిక నిర్మూలనకు కృషి.. ఏపీ మెప్మాకు అవార్డుల పంట

ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల

For Telangana News And Telugu News

Updated Date - Jun 09 , 2025 | 04:41 AM