Bathini family: చేప ప్రసాదం కోసం పోటెత్తిన రోగులు
ABN , Publish Date - Jun 09 , 2025 | 05:01 AM
ఆదివారం జరిగిన చేప మందు పంపిణీలో అపశృతి చోటు చేసుకుంది. క్యూలో నిలుచున్న మెదక్ జిల్లాకు చెందిన రిటైర్డు ఉద్యోగి సత్యనారాయణ (75) అనే వృద్ధుడు గుండెపోటు రావడంతో కుప్పకూలాడు.
అరకొర ఏర్పాట్లతో ప్రజలకు ఇక్కట్లు
గోషామహల్, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): ప్రతియేటా మృగశిర కార్తి ప్రారంభం సందర్భంగా బత్తిని కుటుంబం పంపిణీ చేసే చేప మందు ప్రసాదం కోసం ప్రజలు పోటెత్తారు. కానీ, ప్రభుత్వ యంత్రాంగం అరకొర ఏర్పాట్లతో రోగులు ఇబ్బందుల పాలయ్యారు. ఆదివారం జరిగిన చేప మందు పంపిణీలో అపశృతి చోటు చేసుకుంది. క్యూలో నిలుచున్న మెదక్ జిల్లాకు చెందిన రిటైర్డు ఉద్యోగి సత్యనారాయణ (75) అనే వృద్ధుడు గుండెపోటు రావడంతో కుప్పకూలాడు. నిర్వాహకులు వెంటనే అక్కడి వైద్య శిబిరానికి తరలించి సపర్యలు చేసినా, అప్పటికే మరణించాడని వైద్యులు తెలిపారు. రాష్ట్ర మత్స్యశాఖ అధికారులు 35 కౌంటర్లలో 1.50 లక్షల చేప పిల్లలు పంపిణీ చేశారు. బత్తిని అమర్నాథ్ గౌడ్ కుటుంబ సభ్యులు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు వి.హన్మంతరావు, మధుయాష్కీలతో కలిసి రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యక్రమాన్ని ప్రారంభించి తొలుత చేప ప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ 170 ఏళ్ల క్రితం దూద్‌బౌలిలో ప్రారంభమైన చేప ప్రసాదం పంపిణీ ఎంతో ప్రాధాన్యం సంతరించుకుని నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు చేరుకుందన్నారు. చేప మందు పంపిణీతో ప్రజలకు బత్తిని కుటుంబం నిస్వార్థ సేవ చేస్తున్నదని కొనియాడారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు భోజన వసతి, ఇతర ఏర్పాట్లు చేసిన స్వచ్ఛంద సంస్థలను మంత్రి పొన్నం అభినందించారు. రాష్ట్ర మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్లు సుజాత, శ్రీనివాసులు మాట్లాడుతూ ఒక్కో చేపపిల్లకు రూ.40 టోకెన్ జారీ చేశామని చెప్పారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు చేప ప్రసాదం కోసం వచ్చిన ఇతర రాష్ట్రాల ప్రజలకు స్వచ్ఛంద సంస్థలు అల్పాహారం, భోజన వసతి కల్పించి మానవత్వం చాటుకున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
పట్టణ పేదరిక నిర్మూలనకు కృషి.. ఏపీ మెప్మాకు అవార్డుల పంట
For Telangana News And Telugu News