అలరించిన అన్నమయ్య సంకీర్తనా గానం
ABN , Publish Date - May 13 , 2025 | 04:57 AM
ప్రముఖ సాహితీవేత్త విశారద వెంకట్ గరికపాటి 108 మంది గాయకులతో కలిసి నిర్వహించిన అన్నమయ్య సంకీర్తనా గానం ప్రేక్షకుల్ని మైమరిపించింది.
రవీంద్రభారతిలో ఘనంగా పదకవితా పితామహుడి జయంత్యుత్సవం
వెంకట్ గరికపాటి రాసిన గ్రంథాల ఆవిష్కరణ
హైదరాబాద్ సిటీ/రవీంద్రభారతి, మే 12 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ సాహితీవేత్త విశారద వెంకట్ గరికపాటి 108 మంది గాయకులతో కలిసి నిర్వహించిన అన్నమయ్య సంకీర్తనా గానం ప్రేక్షకుల్ని మైమరిపించింది. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో శ్రీరామ సాంస్కృతిక సేవా సంస్థ సోమవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో పదకవితా పితామహుడు అన్నమయ్య 617వ జయంత్యుత్సవం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా వెంకట్ గరికపాటి రాసిన శ్రీరామాభిరామం, రాజీవనేత్రాయ రాఘవాయ వ్యాఖ్యాన గ్రంఽథాలను ఆవిష్కరించారు.
ముఖ్య అతిథిగా హాజరైన శాంతా బయోటెక్ వ్యవస్థాపకుడు కె.ఐ.వరప్రసాదరెడ్డి వెంకట్ గరికపాటి, కళాకారులను సత్కరించి అభినందించారు. అన్నమయ్య సంకీర్తనల సాహితీ విలువలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి వెంకట్ గరికపాటి చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. ఎస్‌బీఐ డిప్యూటీ మేనేజర్ కిశోర్ కుమార్ మాట్లాడుతూ.. నలభై ఏళ్లుగా అన్నమయ్య సేవలో వెంకట్ నిమగ్నమయ్యారని.. 24 పుస్తకాలు రచించడం గొప్ప విషయమని ప్రశంసించారు. కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షుడు ఎల్లూరి శివారెడ్డి, చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్, రామాచారి తదితరులు వెంకట్ గరికపాటిని సన్మానించారు.