Share News

తెలంగాణలో 22కోట్ల ఏళ్ల నాటి రాక్షసబల్లి అవశేషాలు

ABN , Publish Date - May 16 , 2025 | 04:54 AM

మంచు యుగం.. రాతి యుగం నాటి చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు లభ్యమైన తెలంగాణ ఇప్పుడు మరో ప్రాచీన యుగానికి నిలయమని తేలింది. అంటే.. 26 లక్షల సంవత్సరాల క్రితం నాటి మంచు యుగానికంటే ముందే..

తెలంగాణలో 22కోట్ల ఏళ్ల నాటి రాక్షసబల్లి అవశేషాలు

  • ప్రాణహిత-గోదావరి లోయలో గుర్తింపు

  • అన్నారం వద్ద 1980లలోనే అవశేషాల సేకరణ

  • అప్పటి నుంచి కొనసాగిన పరిశోధనలు

  • తాజాగా ఆ డైనోసార్‌ వయసు నిర్ధారణ

  • రాక్షసబల్లికి ‘మలేరీరాపర్ట్‌ కుట్టీ’ అని నామకరణ

న్యూఢిల్లీ, మే 15: మంచు యుగం.. రాతి యుగం నాటి చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు లభ్యమైన తెలంగాణ ఇప్పుడు మరో ప్రాచీన యుగానికి నిలయమని తేలింది. అంటే.. 26 లక్షల సంవత్సరాల క్రితం నాటి మంచు యుగానికంటే ముందే.. ట్రయాసిక్‌ యుగంలోని తొలి భాగం(జురాసిక్‌ యుగం-- 20-25 కోట్ల సంవత్సరాల క్రితం)లోనూ తెలంగాణ చరిత్రకు సంబంధించిన ఆధారాలు నిర్ధారణ అయ్యాయి. 1980లలో జయశంకర్‌-భూపాలపల్లి జిల్లాలో.. ప్రాణహిత-గోదావరి లోయలోని అన్నారం అనే గ్రామానికి దక్షిణాన కిలోమీటరు దూరంలో శాస్త్రవేత్తలు ఓ రాక్షసబల్లి(డైనోసార్‌) అవశేషాలను గుర్తించారు. అప్పటి నుంచి కొనసాగిన పరిశోధనలు తాజాగా పూర్తయ్యాయి. ఈ పరిశోధనల్లో ఆ రాక్షసబల్లి వయసు 22.9-23.3 కోట్ల సంవత్సరాల మధ్య ఉంటుందని నిర్ధారణ అయ్యింది.


ఆ అవశేషాలు ట్రయాసిక్‌ యుగంలో జీవించిన హరేరాసారియా వర్గానికి చెందినది శాస్త్రవేత్తలు తేల్చారు. ఇది మాంసాహార డైనోసార్‌. దక్షిణ అమెరికా వెలుపల ఈ జాతి రాక్షస బల్లిని కనుక్కోవడం ఇదే మొదటిసారి. ఈ డైనోసార్‌కు శాస్త్రవేత్తలు ‘మలేరీరాప్టర్‌ కుట్టీ’ అని పేరు పెట్టారు. ప్రాణహిత-గోదావరి లోయల్లోని మలేరీ ఘాట్ల వద్ద ఈ డైనోసార్‌ అవశేషాలు లభించడంతో ఆ ప్రాంతం పేరును.. తొలిసారి దీన్ని కనుగొన్న శాస్త్రవేత్త తారావత్‌ కుట్టీ పేరును కలిపి.. దీనికి ‘మలేరిరాప్టర్‌ కుట్టీ’ అని నామకరణం చేశారు. రాతి యుగానికి ముందు మంచు యుగం.. అంతకు ముందు ఉష్ణయుగం ఉన్నట్లు చరిత్రకారులు చెబుతుంటారు. ట్రయాసిక్‌ యుగంలోనూ వేడి ఎక్కువగా ఉండేదని చెబుతారు. అప్పటి వాతావరణ మార్పులకు అనుగుణంగా డైనోసార్లు ఎలా అభివృద్ధి చెందాయనే పరిశోధనలు ఇంకా సాగుతున్నాయి. తెలంగాణలో లభించిన డైనోసార్‌ అవశేషాలతో.. ఈ పరిశోధనల్లో మరింత వేగం పుంజుకోనున్నట్లు తెలుస్తోంది.

Updated Date - May 16 , 2025 | 04:54 AM