Hyderabad: చైతన్యపురిలో 1,600 ఏళ్లనాటి చతుర్ముఖ నందీశ్వర లింగం వెలుగులోకి
ABN , Publish Date - Aug 27 , 2025 | 05:58 AM
హైదరాబాద్ చైతన్యపురిలోని కొసగుండ్ల నరసింహ స్వామి దేవాలయంలో ఒక పురాతన చతుర్ముఖ నందీశ్వర లింగం వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి) : హైదరాబాద్ చైతన్యపురిలోని కొసగుండ్ల నరసింహ స్వామి దేవాలయంలో ఒక పురాతన చతుర్ముఖ నందీశ్వర లింగం వెలుగులోకి వచ్చింది. చరిత్రకారుడు డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ ఆదివారం దీన్ని గుర్తించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. చైతన్యపురి ప్రాంతం సుమారు 1,600 ఏళ్ల క్రితం నిర్మించిన గోవిందరాజు విహార అనే హీనయాన బౌద్ధ విహారాన్ని సూచించే శాసనంతో ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం ఆ విహార స్థలాన్ని ఫణిగిరి కొసగుండ్ల నరసింహ స్వామి దేవాలయంగా పిలుస్తున్నారు.
ఆ దేవాలయం వెనుక శిథిలాల్లో నందీశ్వర లింగం లభించింది. దాదాపు 2 అడుగుల చదరపు రాతి స్లాబ్‌పై, 4 దిక్కుల్లో ఒక్కోటి 8 అంగుళాల పరిమాణంలో నందులు, వాటి మఽధ్యలో శివలింగం, దాని చుట్టూ అభిషేక జలాన్ని బయటకు పంపే పానవట్టం చెక్కారు. ఇది దేశంలోనే అతి ప్రాచీన, అరుదైన లింగం అని సత్యనారాయణ తెలిపారు.