Amit Shah: తెలంగాణకు కేంద్ర సహాయం
ABN , Publish Date - Aug 14 , 2025 | 04:39 AM
తెలంగాణలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రాష్ట్రానికి అవసరమైన అన్నిరకాల సహాయక చర్యలు అందిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.
భారీ వర్షాల నేపథ్యంలో అమిత్ షా భరోసా
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రాష్ట్రానికి అవసరమైన అన్నిరకాల సహాయక చర్యలు అందిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణలో వరద పరిస్థితి, వాగులు, నదుల ఉధృతి వంటి అంశాలను కిషన్ రెడ్డి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై అమిత్ షా స్పందిస్తూ, రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను ఉపయోగించుకోవాలని సూచించారు.
అదనపు బలగాలు అవసరమైతే పంపడానికి కేంద్రం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కిషన్ రెడ్డి సూచించారు. అలాగే, బీజేపీ కార్యకర్తలు వరద బాధితులకు ఆహారం, తాగునీరు, పాలు, మందుల వంటి అత్యవసర వస్తువులను అందించాలని కోరారు.