Share News

farmer protests: పుట్టినరోజున బహుమతిగా యూరియా బస్తా

ABN , Publish Date - Aug 18 , 2025 | 05:13 AM

యూరియా దొరకక రైతులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఓ వ్యక్తి తన మిత్రుని పుట్టిన రోజు సందర్భంగా యూరియా బస్తాను బహుమతిగా ఇచ్చి సంతోషాన్ని నింపాడు.

farmer protests: పుట్టినరోజున బహుమతిగా యూరియా బస్తా

  • అన్నదాతకు మిత్రుని చేయూత

ఇనుగుర్తి/కేసముద్రం, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): యూరియా దొరకక రైతులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఓ వ్యక్తి తన మిత్రుని పుట్టిన రోజు సందర్భంగా యూరియా బస్తాను బహుమతిగా ఇచ్చి సంతోషాన్ని నింపాడు. మహబూబాబాద్‌ జిల్లా ఇనుగుర్తి మండలం అయ్యగారిపల్లికి చెందిన బొల్లు శివకృష్ణ (చింటు) పుట్టినరోజు సందర్భంగా ఇనుగుర్తిలో ఆయన మిత్రుడు మలిశెట్టి శోభన్‌ కేక్‌ తీసుకువచ్చి కట్‌ చేయించాడు. అప్పటికే యూరియా బస్తాల టోకెన్ల కోసం శివకృష్ణ ప్రయత్నించగా అవి అందకపోవడంతో నిరుత్సాహంగా ఉన్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న శోభన్‌ ఓ యూరియా బస్తానే శివకృష్ణకు బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరిచాడు.


మరోవైపు.. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం విలేజి తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లే కూడలిలో రహదారిపై ఆదివారం బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో రైతులు యూరియా కోసం రాస్తారోకోకు దిగారు. అంతకుముందు కేసముద్రం, ధన్నసరి సొసైటీలకు ఒక లారీ యూరియా రావడంతో టోకెన్లను రైతువేదికలో ఇచ్చారు. దీనికోసం తెల్లవారుజాము నుంచే రైతులు భారీసంఖ్యలో రైతు వేదిక వద్దకు తరలివచ్చారు. టోకెన్లు అయిపోవడంతో మిగిలిన రైతులంతా బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు.

Updated Date - Aug 18 , 2025 | 05:13 AM