Akbaruddin Owaisi: అక్బర్ వర్సెస్ సీఎం
ABN , Publish Date - Sep 01 , 2025 | 03:48 AM
కాళేశ్వరంపై పీసీ ఘోష్ నివేదికపై శాసనసభలో చర్చ సందర్భంగా ఆదివారం మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, సీఎం రేవంత్‌రెడ్డి మధ్య వాడివేడి వాదన కొనసాగింది.
కాళేశ్వరంపై మీరేం చేయదల్చుకున్నారు?
రేపు సభ ఉంటుందా లేదా.. ఏమీ చెప్పడం లేదు: అక్బర్
నివేదికను పూర్తిగా చదవండి.. సలహాలివ్వండి
నిర్ణయం మేం తీసుకుంటాం: సీఎం రేవంత్
హైదరాబాద్, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరంపై పీసీ ఘోష్ నివేదికపై శాసనసభలో చర్చ సందర్భంగా ఆదివారం మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, సీఎం రేవంత్‌రెడ్డి మధ్య వాడివేడి వాదన కొనసాగింది. కమిషన్ నివేదికలో విజిలెన్స్ రిపోర్టును ఎక్కడా ప్రస్తావించలేదని అక్బర్ నిలదీశారు. ‘‘కమిషన్ తన నివేదికలో సుమారు రూ.6.5 కోట్లను రికవరీ చేయాలని పేర్కొంది. కానీ, కమిషన్ నియామకం, ఖర్చులకే రూ.3కోట్లు అయ్యింది’’ అని ఆయన ఎద్దేవా చేశారు.
అసలు కాళేశ్వరం ప్రాజెక్టును ఏంచేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. సోమవారం సభ ఉంటుందా? లేదా? తామంతా రావాలా? వద్దా? చెప్పలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి ఘాటుగా సమాధానమిచ్చారు. కమిషన్ నివేదికను తాను పూర్తిగా చదివానని, మీరు కూడా చదవాలని అక్బర్‌కు సూచించారు. నివేదికను పరిశీలించి సలహాలు ఇవ్వాలని, తాము నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.