Chandu Thota: ఏఐ డాక్టర్ కాదు.. అసిస్టెంట్ మాత్రమే
ABN , Publish Date - Jun 22 , 2025 | 03:55 AM
ఆరోగ్య సంరక్షణలో ఏఐ(కృత్రిమ మేధ) భవిష్యత్తులో కీలక పాత్ర పోషిస్తుందని, రోగి తన మాతృభాషలో వైద్యుడితో మాట్లాడినట్టుగా ఏఐతో మాట్లాడుకోవచ్చునని గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చందు తోట అన్నారు.
భవిష్యత్తులో వైద్యుడితో మాట్లాడినట్టు ఏఐతో సంభాషణలు
గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చందు తోట
హైదరాబాద్ సిటీ, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్య సంరక్షణలో ఏఐ(కృత్రిమ మేధ) భవిష్యత్తులో కీలక పాత్ర పోషిస్తుందని, రోగి తన మాతృభాషలో వైద్యుడితో మాట్లాడినట్టుగా ఏఐతో మాట్లాడుకోవచ్చునని గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చందు తోట అన్నారు. రోగ లక్షణాలు చెబితే ఉపశమనానికి ఏఐ సలహాలు, సూచనలు ఇస్తుందని, అలాగని ఏఐని డాక్టర్‌లా భావించకూడదని తెలిపారు. ఏఐ డాక్టర్ కాదనీ, ఓ అసిస్టెంట్(సహాయకారి) మాత్రమేనని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో ఆరోగ్య సంరక్షణలో కృత్రిమ మేధస్సు (ఏఐ) భాగస్వామ్యంపై శనివారం నిర్వహించిన అంతర్జాతీయ వైద్య విజ్ఞాన సదస్సులో చందుతోట పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏఐ వినియోగంతో డ్రగ్ డిస్కవరీ, క్లినికల్ కేర్ సహా నాణ్యమైన వైద్య సేవలు అందించడం సాధ్యమని చెప్పారు. ఆరోగ్య సంరక్షణకు సంబంధించి గూగుల్.. ఏఐ మోడల్స్‌ను మాత్రమే అభివృద్ధి చేస్తోందని వివరించారు.
ఆయా ఏఐ మోడల్స్‌ను యశోద ఆస్పత్రి వంటి తమ భాగస్వాములు తమకు అనుకూలమైన రీతితో అప్లికేషన్‌గా రూపొందించుకుంటాయని చెప్పారు. తాము అభివృద్ధి చేసిన ఏఐ మోడల్స్‌కు కొన్ని టూల్స్‌ను వినియోగించి కంటి, మధుమేహ పరీక్షలను నిర్వహించి సమస్యను కచ్చితంగా తెలుసుకుంటున్నారని తెలిపారు. భవిష్యత్‌లో ఏఐ అప్లికేషన్ రూపంలో మొబైల్ ఫోన్‌లో అందుబాటులోకి వస్తుందని, ఓ డాక్టర్‌తో మాట్లాడినట్టేరోగులు ఏఐతో మాట్లాడుకుంటారని చెప్పారు. ఏఐ సలహాతో నిపుణడైన డాక్టర్‌ను సంప్రదించి మెరుగైన చికిత్స పొందవచ్చని పేర్కొన్నారు. అలాగని ఏఐని డాక్టర్‌గా చూడకూడదని స్పష్టం చేశారు. కాగా, ఏఐ మోడల్స్ అభివృద్ధికి కీలకమైన సమాచారం(డేటా) కోసం గూగుల్.. స్థానిక ప్రభుత్వాలతో కలిసి పని చేస్తుందని చెప్పారు. నిబంధనలు పాటిస్తూ పని చేసేలా ఏఐ మోడల్స్‌ను అభివృద్ధి చేస్తున్నామని చందు తోట వెల్లడించారు. అలాగే, ఏపీలోని తెనాలికి చెందిన తాను ఉస్మానియా వర్సిటీలో ఇంజనీరింగ్ చదివేందుకు హైదరాబాద్ వచ్చానని గుర్తు చేసుకున్నారు.