Healthcare: కొత్త తరానికి శక్తిగా ఏఐ ఆధారిత వైద్య ఆవిష్కరణలు!
ABN , Publish Date - Jun 22 , 2025 | 04:00 AM
కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వైద్య ఆవిష్కరణలు కొత్త తరానికి శక్తినిస్తున్నాయని, ఆరోగ్య సంరక్షణలో విప్లవాత్మక మార్పు వస్తోందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.
ఆస్పత్రులు, రోగుల సంరక్షణ సేవల్లో హైదరాబాద్ కీలకం: శ్రీధర్‌బాబు
వ్యాధి నిర్ధారణకు, చికిత్సకు ఏఐ తోడ్పాటు: గోరుకంటి రవీందర్‌రావు
హైదరాబాద్ సిటీ, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వైద్య ఆవిష్కరణలు కొత్త తరానికి శక్తినిస్తున్నాయని, ఆరోగ్య సంరక్షణలో విప్లవాత్మక మార్పు వస్తోందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. రోగ నిర్ధారణ, చికిత్స, రోగుల సంరక్షణలో కృత్రిమ మేధ అనేక విధాలుగా సహాయపడుతోందని చెప్పారు. శనివారం హైటెక్‌సిటీలోని యశోద ఆస్పత్రిలో ‘ఆరోగ్య సంరక్షణలో కృత్రిమ మేధ’ అంశంపై అంతర్జాతీయ వైద్య విజ్ఞాన సదస్సు జరిగింది. యశోద ఆస్పత్రుల వ్యవస్థాపక చైర్మన్ గోరుకంటి రవీందర్‌రావుతో కలిసి మంత్రి శ్రీధర్‌బాబు దీనిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. కృత్రిమ మేధ ఆధారిత సాంకేతికతలు రోగుల వైద్య నివేదికల విశ్లేషణ, వ్యక్తిగత చికిత్స ప్రణాళికల రూపకల్పన, ఔషధాల అభివృద్ధిలో కీలకంగా మారాయని చెప్పారు.
ఔషధాల ఆవిష్కరణ, క్లినికల్ ట్రయల్స్, ఆస్పత్రులు, డయాగ్నస్టిక్స్, రోగుల సంరక్షణ సేవల్లో హైదరాబాద్ అత్యంత కీలకంగా మారిందని చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న, అందుబాటు ధరల్లో ఆరోగ్య సంరక్షణ సేవలు అందించే గమ్యస్థానాలలో ఒకటిగా హైదరాబాద్ నిలిచిందన్నారు. కాగా, క్లినికల్ ట్రయల్స్ నుంచి జెనోమిక్స్ వరకు భారీ డేటాసెట్‌లను కృత్రిమ మేధ సాయంతో వేగంగా విశ్లేషించి, తక్కువ సమయంలో ఔషఽధాలను అభివృద్ధి చేయవచ్చని గూగుల్ చీఫ్ క్లినికల్ ఆఫీసర్ మైఖేల్ డి.హోవెల్ చెప్పారు. యశోద ఆస్పత్రుల వ్యవస్థాపకుడు గోరుకంటి రవీందర్‌రావు మాట్లాడుతూ.. వ్యాధిని కచ్చితంగా నిర్ధారించడానికి, సరైన చికిత్స చేయడానికి, వ్యాధుల నివారణకు వేగవంతమైన మార్గాలను అందించడంలో కృత్రిమ మేధ తోడ్పడుతుందని వివరించారు. క్లినికల్ ప్రాక్టీ్‌సలో కూడా కృత్రిమ మేధ అద్భుతాలను సృష్టిస్తుందని క్లినికల్ డైరెక్టర్ రోబోటిక్ సర్జికల్ అంకాలజిస్టు డాక్టర్ చినబాబు సుంకవల్లి వివరించారు.