‘స్థానిక’ ఎన్నికలకు సన్నద్ధం
ABN , Publish Date - Feb 08 , 2025 | 11:11 PM
స్థానిక సంస్థల ఎన్నికలకు జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా సన్నద్ధమైంది. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు.

- ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు
- మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు
- 15వ తేదీ తర్వాత షెడ్యూల్ విడుదలకు సన్నాహాలు
- 10లోగా రిటర్నింగ్ అధికారుల నియామకం
మంచిర్యాల, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలకు జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా సన్నద్ధమైంది. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి, ఆ తరువాత సర్పంచ్ ఎలక్షన్లు నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈ నెల 15వ తేదీ తరువాత ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. వాస్తవానికి లోక్‌సభ ఎన్నికలు ముగియగానే, స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం అయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, పాలనపై పట్టు సాధించేందుకు కొంత సమయం పట్టింది. గ్రామపంచాయతీల పాలన గత సంవత్సరం జనవరిలో ముగియగా, జిల్లా పరిషత్, మండల పరిషత్‌ల పాలకవర్గాల పదవీకాలం జూలై మాసంతో ముగిసింది. దీంతో స్థానికసంస్థల పాలన ప్రత్యేకాఽధికారుల చేతుల్లోకి వెళ్లింది. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఈసీ సిద్ధంకాగా ఎలక్షన్లకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 10వ తేదీలోగా పీవోలు, ఏపీవోలు, రిటర్నింగ్ అధికారుల నియామకం పూర్తి చేయాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం ఇదే నెల 15లోగా వారికి శిక్షణ కార్యక్రమం కూడా పూర్తి చేయాలని ఈసీ పేర్కొనడంతో జిల్లా అధికారులు ఆ పనుల్లో నిమగ్నమయ్యారు.
- రిజర్వేషన్లలో మార్పులు...
స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. పంచాయతీ వార్డులు మొదలుకొని జడ్పీ చైర్మన్ స్థానం వరకు క్షేత్రస్థాయిలో రిజర్వేషన్లు మారనున్నాయి. రాష్ట్రంలో బీసీ కులగణన సర్వే పూర్తయినందున ఆ సామాజిక వర్గానికి సంబంధించి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంటుంది. బీసీలకు చట్టసభల్లో 42 శాతం రిజర్వేషన్ అమలు చేయనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇప్పుడున్న స్థానాలకు అదనంగా సీట్లు కేటాయింపు జరుగుతుంది. దీంతో ఇంతకాలం రిజర్వేషన్లు అనుకూలించక పోటీకి దూరంగా ఉన్న బీసీ సామాజిక వర్గాలకు కులగణన అనంతరం ఆ అవకాశం లభించనుంది. రిజర్వేషన్లు మారనుండటంతో సర్పంచ్ ఎన్నికల కోసం సిద్ధమవుతున్న ఆశావహులు ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే కుతూహలంతో ఉన్నారు. గత ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్ట సవరణ చేయడం ద్వారా రిజర్వేషన్లు పదేళ్ల వరకు ఉండేలా మార్పులు చేసింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లకోసారి రిజర్వేషన్లలో మార్పులు చేసేలా చట్ట సవరణ చేయడంతో ఇకమీదట ప్రతీసారి వివిధ వర్గాలకు అమలు చేసే రిజర్వేషన్లలో మార్పులు చోటు చేసుకోనున్నాయి.
- జిల్లాలో 129 ఎంపీటీసీ స్థానాలు..
స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో జిల్లాలోని 613 గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. గతంలో మొత్తం 311 గ్రామపంచాయతీలకు గాను హాజీపూర్ మండలంలోని ఐదు జీపీలను మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేశారు. దీంతో జీపీల సంఖ్య 306కు పడిపోగా, జైపూర్ మండలంలోని గోపాల్‌పూర్, కాసిపేట మండలంలోని వరిపేట, జన్నారం మండలంలోని చర్లపల్లి, మొర్రిగూడ గ్రామాలను పంచాయతీలు మార్చాలంటూ ప్రభుత్వానికి అఽధికారులు ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే నాలుగు పంచాయతీలు పెరిగి మొత్తం 310 జీపీలు ఉండనున్నాయి. జిల్లాలో రెండు పంచాయతీ డివిజన్లలో 16 మండలాలు ఉన్నాయి. ఎంపీటీసీ స్థానాలు 129 ఉన్నాయి. గతంలో 130 ఎంపీటీసీ స్థానాలు ఉండగా మున్సిపల్ కార్పొరేషన్‌లో మూడు స్థానాలు విలీనం అయ్యాయి. కొత్తగా భీమిని, భీమారం మండలాల్లో అధనంగా రెండు స్థానాలను పెంచుతుండగా, మొత్తం ఎంపీటీసీ స్థానాల సంఖ్యకు 129కి చేరనుంది. అలాగే జడ్పీటీసీ స్థానాలు 16, ఎంపీపీ స్థానాలు 16 ఉన్నాయి. వీటికిగాను తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనుండగా, అవసరమైన బ్యాలెట్ బాక్సులు, ఇతర సామగ్రి జిల్లాకు ఇప్పటికే చేరింది.