Share News

ఆందోళనలో పోస్టల్‌ ఉద్యోగులు

ABN , Publish Date - Feb 17 , 2025 | 11:33 PM

కేంద్ర ప్రభుత్వం ఆధ్వ ర్యంలో కొనసాగుతున్న తపాలా (పోస్టల్‌) శాఖ లో తెస్తున్న సంస్కరణలు, పెండింగ్‌ సమస్యలు పరిష్కారం కాక భవిష్యత్తుపై ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

ఆందోళనలో పోస్టల్‌ ఉద్యోగులు

- ఇంటిగ్రేటెడ్‌ డెలివరీ సెంటర్ల ఏర్పాటుతో ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లోకి పంపిణీ వ్యవస్థ

- ఉద్యోగ భద్రత కరువైందని ఆవేదన

- సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌

కాగజ్‌నగర్‌ టౌన్‌, ఫిబ్రవరి 17 (ఆంధ్ర జ్యోతి): కేంద్ర ప్రభుత్వం ఆధ్వ ర్యంలో కొనసాగుతున్న తపాలా (పోస్టల్‌) శాఖ లో తెస్తున్న సంస్కరణలు, పెండింగ్‌ సమస్యలు పరిష్కారం కాక భవిష్యత్తుపై ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. నూతన విధానాల సంస్కరణలతో తపా లా వ్యవస్థ నిర్వీర్యమవయ్యే అవకాశాలున్నాయని ఉ ద్యోగ సంఘాలు ఆవేదన చెందుతున్నాయి. ఇంటిగ్రేటెడ్‌ డెలివరీ సెంటర్ల ఏర్పాటు చేస్తే తమ పరిస్థితి ఏంటీ? తమ భవిష్యత్తుకు భరోసా ఉండదనే అనుమానాలు వారిలో ఏర్పడుతున్నాయి. ఈ సెంటర్లను ప్రస్తుతం ప్రధాన పట్టణాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న వివిధ వస్తువులను ఈ-కామర్స్‌ సెంటర్ల ద్వారా పంపిణీ చేస్తున్నారు. అదే తరహాలో తపాలా శాఖకు సంబంధించిన వస్తువుల పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రైవేటు వ్యక్తుల చేతిల్లోకి సంస్థ కార్యక్రమాలు పోతే తమకు భవిష్యత్‌ ఉండదని ఆవేదన చెందు తున్నారు. వీటితో పాటు మెకనైజ్డ్‌ డెలివరీ సిస్టం ద్వారా పోస్టల్‌ ఉద్యోగులకు భద్రత లేకుండా పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు వెంటనే పాత పెన్షన్‌ విధానం కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విధానం తమకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని పలువురు సిబ్బంది పేర్కొంటున్నారు. కొత్త పెన్షన్‌ విధానం వల్ల తమ జీతాల్లోంచి 33 శాతం పీఎఫ్‌ శాఖకు కట్టాల్సి ఉంటుందని పలువురు తెలిపారు. వీటితో పాటు పెండింగ్‌లో ఉన్న గ్రామీణ డాక్‌ సేవకులను తీసుకొని సివిల్‌ సర్వేంట్‌ హోదా కల్పించటంతో పాటు పెన్షన్‌, మెడికల్‌, బెనిఫిట్‌ సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.

- జిల్లాలో 20 పోస్టాఫీసులు..:

కుమురం భీం జిల్లాలో 20 తపాలా శాఖలు సేవలు అందిస్తున్నాయి. ప్రస్తుతం వంద మందికిపైగా సిబ్బంది పనిచేస్తున్నారు. నూతన మార్పులు వస్తుండటంతో వీరి భవిష్యత్తుపై నీలినీడలు పడుతుంటంతో అంతా ఆందోళనకు గురవుతున్నారు. నూతన విధానంలో కొత్త ఒరవడిని అవలంభించి ఇంటిగ్రేటెడ్‌ డెలివరీ సెంటర్ల ఏర్పాటు చేస్తే తమ ఉద్యోగాలకు భద్రత ఉండదని ఆవేదన చెందుతున్నారు. పెండింగ్‌ సమస్యలు పరిష్కరించి తమకు ఉద్యోగ భధ్రత కల్పించేట్టు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పోస్టల్‌ శాఖలో సంస్కరణలతో తమకు ముప్పు ఉందని తమకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని, దశల వారీగా పోరాటం చేస్తామని జేఏసీ సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు.

న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం

- పి సంతోష్‌ కుమార్‌, జేఏసీ కన్వీనర్‌

తపాలా శాఖలో పెండింగ్‌ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. పాత పెన్షన్‌ విధానం ఇంత వరకు అమలు కావటం లేదు. దీంతో ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఇంటిగ్రేటెడ్‌ డెలివరీ సెంటర్లపై కూడా స్పష్టత లేదు. స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగులకు అన్యాయం చేస్తే ఆందోళనలు తీవ్రతరం చేస్తాం.

Updated Date - Feb 17 , 2025 | 11:33 PM