Share News

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముమ్మరం

ABN , Publish Date - Feb 19 , 2025 | 11:26 PM

ఎమ్మెల్సీ ఎన్నికల గడువు సమీపిస్తున్న కొద్దీ ప్రచారం వేగం పుంజుకుంది. జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రచారం ఊపందుకుంది. ఇటీవల ఇక్కడికి వచ్చే వివిధ ప్రాంతాల నేతల సంఖ్య కూడా పెరుగుతోంది.

 ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముమ్మరం

- అభ్యర్థులకు మద్దతుగా పార్టీల ముఖ్యనేతలు

- ఉమ్మడి జిల్లాలో ఎక్కువ ఓటర్లున్న మంచిర్యాలపై నాయకుల ఫోకస్‌

- జిల్లాకు పెరుగుతున్న నేతల తాకిడి

మంచిర్యాల, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్సీ ఎన్నికల గడువు సమీపిస్తున్న కొద్దీ ప్రచారం వేగం పుంజుకుంది. జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రచారం ఊపందుకుంది. ఇటీవల ఇక్కడికి వచ్చే వివిధ ప్రాంతాల నేతల సంఖ్య కూడా పెరుగుతోంది. ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా మంచిర్యాలలోనే ఎక్కువ మంది ఓటర్లు ఉండగా ముఖ్య నేతలు ఇక్కడే దృష్టి పెడుతున్నారు. దీంతో పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఉమ్మడి మెదక్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల పరిధిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 56 మంది, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. గతంలో కంటే పోటీ ఎక్కువగా ఉన్నందున ప్రతీ ఓటు కీలకంగా మారింది. పైగా ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా నుంచి కూడా అభ్యర్థులు బరిలో నిలవటంతో కిందిస్థాయి నాయకుల్లో ఉత్సాహం నెలకొంది. స్థానికుడైన తమ నేతను గెలిపించుకోవాలన్న కుతూహలం వారిలో నెలకొంది.

- మంచిర్యాలలోనే ఓటర్లు అధికం...

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పేర్లు నమోదు చేసుకున్న పట్టభద్రులు 67,738 మంది ఉండగా, వారిలో 30,448 మంది మంచిర్యాల జిల్లాకు చెందిన వారే కావడం గమనార్హం. నిర్మల్‌ జిల్లాలో 16,855 మంది, ఆదిలాబాద్‌ జిల్లాలో 14,586 మంది, కుమురం భీం జిల్లాలో 5,855 మంది ఓటర్లు ఉన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటు హక్కు కోసం ఉమ్మడి జిల్లాలో మొత్తం 5,512 మంది ఓటర్లు ఉండగా, వారిలో నిర్మల్‌ జిల్లాలో 1,944, ఆదిలాబాద్‌ జిల్లాలో 1,561, మంచిర్యాల జిల్లాలో 1,550, కుమురంభీం జిల్లాలో 457 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ క్రమంలో పట్టభద్రుల ఓట్లు అధికంగా ఉన్న మంచిర్యాల జిల్లాపై పార్టీలు, అభ్యర్థులు దృష్టి సారిస్తుండగా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లను సైతం ఆకర్శించే ప్రయత్నం చేస్తున్నారు.

నేతల తాకిడి....

కాగా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ప్రధానంగా కాంగ్రెస్‌, బీజేపీలకు చెందిన ముఖ్య నేతల తాడికి జిల్లాకు క్రమంగా పెరుగుతోంది. ఇండిపెండెంట్‌ అభ్యర్థులు నేరుగా వివిధ నియోజకవర్గాల పరిధిలో పర్యటిస్తూ సొంతంగా తమ కేడర్‌తో ప్రచారం నిర్వహిస్తుండగా, బీజేపీ అభ్యర్థుల తరుపున ఆ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు రఘునాథ్‌ వెరబెల్లి విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఆయన వివిధ జిల్లాలకు చెందిన బీజీపీ ఎమ్మెల్యేలు, మంత్రులను ప్రచారంలో పాల్గొనేలా చేస్తున్నారు. పార్టీ పట్టభద్రులు, ఉపాఽధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులైన చిన్నమైల్‌ అంజిరెడ్డి, మల్క కొమురయ్యకు మద్దతుగా ఈ నెల 18న జిల్లా కేంద్రంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌తోపాటు కామారెడ్డి, సిర్పూర్‌ ఎమ్మెల్యేలు వెంకట్‌రెడ్డి, పాల్వాయి హరీష్‌బాబులు రోడ్‌షో, సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్‌ అభ్యర్థి అల్ఫోర్స్‌ విద్యాసంస్థల అధినేత నరేందర్‌రెడ్డికి మద్దతుగా రెండు రోజుల క్రితం బెల్లంపల్లిలో రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్‌లు ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 27న జరుగనుండగా, జిల్లాకు నేతల తాకిడి మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.

- ప్రలోభాలకు తెర....

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్శించేందుకు కొందరు అభ్యర్థులు ప్రలోభాలకు తెరలేపినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పట్టభద్రుల ఓటర్లను ఆకర్శించేందుకు నజరానాలు ఆఫర్‌ చేస్తున్నట్లు సమాచారం. పట్టభద్రుల ఓట్ల కోసం అధికంగా ప్రైవేటు విద్యా సంస్థలపై ఆధారపడుతున్న అభ్యర్థులు వాటి యజమాన్యాల ద్వారా తమ పని చక్కబెట్టుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అద్యాపకులను తమకే ఓట్లు వేయించేలా యజమాన్యాలతో చర్చించినట్టు ప్రచారం జరుగుతోంది. రానున్న రోజుల్లో ఓటుకు ఇంత లెక్క చొప్పున చెల్లించేందుకు సైతం రంగం సిద్ధమైనట్లు సమాచారం.

Updated Date - Feb 19 , 2025 | 11:26 PM