Share News

అభివృద్ధికి నోచుకోని కేవీకే

ABN , Publish Date - Feb 07 , 2025 | 11:22 PM

రైతులకు మెరుగైన సేవలు, ఆధునిక సాంకేతికతను చేరువచేయడంతో పాటు వివిధ అంశాల్లో మెరుగైనసేవలు అందించాలనే సంకల్పంతో మంచిర్యాల, కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల రైతుల కోసం ఏర్పాటైన కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) అభివృద్ధికి నోచుకోవడం లేదు. బెల్లంపల్లిలో కృషి విజ్ఞాన కేంద్రం ప్రారంభమైన ఏడేళ్ల నుంచి అభివృద్ధి కోసం నిధులు రావడం లేదు.

అభివృద్ధికి నోచుకోని కేవీకే
కృషి విజ్ఞాన కేంద్రంలో ధ్వంసమైన పంట

- ఏడే ళ్లుగా నిధులు మంజూరుకాని వైనం

- ప్రహరీలేక పంటలు పశువులు, అడవి జంతువులపాలు

- పట్టించుకోని ప్రజాప్రతినిధులు

బెల్లంపల్లి, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): రైతులకు మెరుగైన సేవలు, ఆధునిక సాంకేతికతను చేరువచేయడంతో పాటు వివిధ అంశాల్లో మెరుగైనసేవలు అందించాలనే సంకల్పంతో మంచిర్యాల, కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల రైతుల కోసం ఏర్పాటైన కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) అభివృద్ధికి నోచుకోవడం లేదు. బెల్లంపల్లిలో కృషి విజ్ఞాన కేంద్రం ప్రారంభమైన ఏడేళ్ల నుంచి అభివృద్ధి కోసం నిధులు రావడం లేదు. దీంతో కేవీకే ఆవరణలో సాగుచేసిన పంటలకు రక్షణ కోసం ఎలాంటి ఫెన్సింగ్‌, ప్రహరీ లేకపోవడంతో పంటలు పశువులపాలవు తున్నాయి. భూమి చదును లేకపోవడంతో విత్తనోత్పత్తి చేయలేని పరిస్థితి నెలకొంది.

- 50 ఎకరాల్లో ఏర్పాటు..

బెల్లంపల్లిలో 2018లో కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ కేంద్రం ఏర్పాటైంది. ఇందులో రెండు కోట్ల రూపాయలతో కృషి విజ్ఞాన కేంద్రం భవనంతో పాటు రూ. 80 లక్షలతో రైతువసతి గృహాన్ని ఏర్పాటు చేశారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రైతులకు ఏడేళ్లుగా సేవలందిస్తోంది. కేవీకే ద్వారా రైతులకు ఆధునిక పద్ధతులపై శిక్షణ, చీడపీడల నివారణ, నూతన వంగడాలను అందించడం వంటివి కేవీకే శాస్త్రవేత్తలు చేస్తున్నారు. సాంప్రదాయ సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు ఆధునిక సేధ్యంతో అధిక దిగుబడులు సాధించేందుకు శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రెండు జిల్లాల్లోని పలు గ్రామాల్లో కిసాన్‌ మేళా వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

- సాగుకు నోచుకోని భూమి..

కృషి విజ్ఞాన కేంద్రం 50 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కాగా భవనం, రైతు వసతి గృహం, రహదారులు పోనూ మిగతా భూమిని శాస్త్రవేత్తలు వివిధ పంటల సాగుకు ఉపయోగించాలి. కాని ఇందులో కేవలం 20 ఎకరాల భూమి మాత్రమే సాగుచేసి విత్తనోత్పత్తి చేస్తున్నారు. ఇందులో వరి, పత్తి, తీగజాతి, కూరగాయల పెంపకం, వంగడాల ఏర్పాటు, చేపల పెంపకం వంటివి చేస్తున్నారు. దాదాపు మరో 25 ఎకరాల భూమి సాగు లేక బీడుగా ఉంది. ఈ భూమి చదునుగా లేకపోవం, సాగుకు అనుకూలంగా లేకపోవడంతో సాగుచేయలేని దుస్ధితి నెలకొంది. ఏడేళ్లుగా నిధులు రాకపోవడంతో భూమిని చదును చేయలేక సాగు చేయడం లేదు.

- పంటలు అటవీ జంతువుల పాలు.....

కేవీకే ఆవరణలో దాదాపు 20 ఎకరాల భూమిలో వివిధ పంటలు విత్తనోత్పత్తి కోసం శాస్త్రవేత్తలు సాగు చేస్తున్నారు. కొన్ని పంటలు మొక్క దశలోనే అటవీ జంతువులు, పశువుల పాలవుతున్నాయి. మరికొన్ని పంటలు దిగుబడి వచ్చే సమయంలో నష్టపరుస్తుండడంతో పూర్తిస్థాయిలో రైతులకు వివిధ పంటలపై అవగాహన కల్పించలేకపోతున్నారు. విత్తనోత్పత్తి సైతం సరిగా దిగుబడి కావడం లేదు. కృషి విజ్ఞాన కేంద్రానికి కేవలం ముందు నుంచే ప్రహరీ ఉండడం, ఇతర మూడు పక్కల ఎలాంటి ప్రహరీలేకపోవడం, ఫెన్సింగ్‌ లేకపోవడంతో అటవీ జంతువులు, పశువులు కృషి విజ్ఞాన కేంద్రంలోనికి వెళ్లి పంటలను ధ్వంసం చేస్తున్నాయి.

- వర్షాకాలంలో చెరువును తలపిస్తూ..

సుమారు 20 ఎకరాలకు పైగా భూమి బీడుగా ఉంటుంది. వర్షకాలంలో ఈ భూమిలో నీరు నిల్వ ఉండి చెరువుల మాదిరిగా దర్శనమిస్తున్నాయి. విత్తనోత్పత్తి కేంద్రంగా ఏర్పాటయిన కేవీకేకు అనుకూలంగా భూమి చదును లేకపోవడం, వ్యవసాయం చేయడానికి ఆరు బోర్లు కావాల్సి ఉండగా కేవలం రెండు బోర్లు మాత్రమే ఉన్నాయి. దీంతో పూర్తిస్థాయిలో పంటను సాగు చేయలేని పరిస్థితి నెలకొంది. సాగు చేసిన పంటకు సైతం ఫెన్సింగ్‌, ప్రహరీ లేకపోవడంతో పండించిన పంట సైతం పశువులపాలవుతోంది.

- గోదాం లేకపోవడంతో..

కేవీకే కేంద్రంలో వరి, కంది, వేరుశనగా, జనుము, నువ్వులు వంటివి ప్రతీ ఏటా విత్తనోత్పత్తి చేస్తుంటారు. దిగుబడి వచ్చిన పంటను భద్రపరిచేందుకు గోదాం సైతం లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో వేల మంది రైతులకు శిక్షణ కార్యక్రమాలు ప్రతీ ఏటా నిర్వహిస్తుంటారు. ఇందుకు అనుకూలంగా గదులు, హాల్‌ లేకపోవడంతో ఆరుబయటే శాస్త్రవేత్తలు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు జిల్లా కలెక్టర్‌ స్పందించి కేవీకే అభివృద్ధికి కృషి చేయాలని రైతులు కోరుతున్నారు.

కేవీకేను అభివృద్ధి పర్చాలి

- శరత్‌, రైతు, నందులపల్లి

కేవీకే శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రైతులకు మరిన్ని సేవలు అందుబాటులోకి రావాలంటే కేవీకేను ప్రజాప్రతినిధులు, అధికారులు అభివృద్ధి చేయాలి. వివిధ పంటల విత్తనోత్పత్తి కోసం బీడుగా ఉన్న భూమిని అందుబాటులోకి తీసుకురావాలి. రెండు జిల్లాలకు అందుబాటులోఉన్న కేవీకేకు వేలాది మంది రైతులు వస్తున్నారు. అవగాహన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు పూర్తిస్థాయి వసతులతో కూడిన భవనం అందుబాటులో లేకపోవడం ఇబ్బందులు కలిగిస్తుంది.

-వ్యవసాయ హబ్‌గా మార్చాలి

- దుగుట తిరుపతి, రైతు, మాల గురిజాల

విత్తనోత్పత్తి కేంద్రంగా ఉన్న కేవీకేను పరిశోధన కేంద్రంగా అభివృద్ధి పర్చాలి. కేవీకేను వ్యవసాయ హబ్‌గా మారిస్తే ఎంతో మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. కేవీకే ఆవరణలో రైతులకు అన్నివసతులు కల్పించడంతో పాటు అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తే బాగుంటుంది.

Updated Date - Feb 07 , 2025 | 11:22 PM