Kumaram Bheem Asifabad: గాలి పటం.. ఇదో లెక్కల మంత్రం
ABN , Publish Date - Jan 12 , 2025 | 11:09 PM
వాంకిడి, జనవరి 12: సక్రాంతి పర్వదినం సెలవులొచ్చాయంటే విద్యార్థులకు ఎంతో సంతోషం. ఎక్కడలేని ఆనందం.

- సంక్రాంతికి పతంగుల సందడి
- నాటి బాలతరం పతంగి ఆటలతోనే మానసిక, శారీరక ఉల్లాసం
వాంకిడి, జనవరి 12: సక్రాంతి పర్వదినం సెలవులొచ్చాయంటే విద్యార్థులకు ఎంతో సంతోషం. ఎక్కడలేని ఆనందం. వారం రోజులు సందడిగా గడపొచ్చన్న భావన, ఈ ఆనందంలో ఇళ్ల ముందే పిల్లలంతా గుమిగూడుతారు. పతంగులు ఎగరేసుకోవాలంటూ అమ్మ దగ్గర కెళ్తారు. రూ. ఐదు కావాలంటారు. పట్టుబట్టి మరీ వసూలు చేస్తారు. తలక్కున మెరిసే పేపర్లతో రెడీ మేడ్‌గా రూపొందించిన గాలిపటం కొనుక్కుని వస్తారు. ఇళ్ల వద్ద ఎగరేస్తుంటారు. నేటి తరానికి ఇంతవరకే తెలుసు. నాటి బాలతరం ఇలా చేయలేదు. ఇంటింటికి తిరిగి పాతపత్రికలను అడుక్కొచ్చేవారు. ఇళ్లలో దొరకనప్పుడే కొనుక్కొచ్చేవారు. పతంగి తయారీ కోసం మెదడుకు పదును పెట్టేవారు. ఇదో గణితసూత్ర మంత్రం అనేంతగా సందడి చేసేవారు. నాడు ఆకాశంలో ఎగిరిన ఆ పతంగుల రూపకల్పన సందడి వెనక.. వారు పఠించిన ఆ గణిత మంత్రాలను నేటితరం ఆచరించాల్సిన ఆవశ్యకత ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
- ఇదో గణిత సూత్రం..
నాటి బాలతరం గణితంలో ఆకారాలు, సూత్రాలను గర్తు చేసుకుంటూ గాలిపటం తయారు చేసేవారు. మొదట పాత పత్రికలను సేకరించేవారు. ఒక పేజీని నాలుగు భుజాలు సమానంగా ఉండే (చతురస్రాకారం)లా కత్తిరిస్తారు. ఇళ్లలో కొబ్బరి పుల్లలు చీపుళ్ల నుంచి రెండు తీసుకుంటారు. వాటిలో ఒక దానిని చతురస్రాకారంలో కత్తిరించిన కాగితం మధ్యలో భుజాల అభిముఖంగా(కర్ణం) మరో పుల్లను వంచి(అర్థ వ్యాసం) కాగితం మూడు మూలలు కలుపుతూ గంజి లేదా అన్నంతో అంటిస్తారు. వారి అభిరుచిని బట్ట కొన్ని పతంగులకు కాగితం ముక్కల్ని సన్న (దీర్ఘ చతురస్రాకారం)గా కత్తిరించి పొడుగ్గా కొన్నింటికేమో చిన్న(త్రిభుజాకారం)గా తోకనంటి స్తారు. మొత్తంగా గణితంలో ఆకారాలు, వాటి సూత్రాలు పతంగి తయారీ ద్వారా మరోసారి గుర్తు చేసుకునేవారు.
- రూపకల్పనలో సృజనాత్మకత..
రూపకల్పనలో సృజనాత్మకత గణితసూత్రాలు ఉన్న గాలిప టాన్ని పైకి ఎగిరించాలంటే దారం అవసరం. ఆ రోజుల్లో మీటర్ల కొద్ది పొడవుండే దారం కండెలను కొనుక్కొచ్చేవారు. ఆ తర్వాత గాలి పటం బ్యాలెన్స్ తప్పకుండా కర్ణం, అర్ధ వ్యాసం గల పుల్లకు ఇరువైపులా రంధ్రం చేసి దారం లాగి కడతారు. దారం బిగింపులో ఏమాత్రం ఎగుడుతిగుడుగా ఉన్నా.. గాలి పటం ఎగరదు. గాలిపటం ఎగిరేది ఈ దారం కట్టే సృజనాత్మకత పైనే ఆధారపడి ఉంటుందన్నది దీనర్థం.
- స్నేహితుల సహకారం..
ఈ గాలిపటం తయారీకి అవసరమైన కాగితం సేకరణ దగ్గర్నుంచి ఎగరవేసేంత వరకు స్నేహితుల సహకారం తప్పనసరి. కనీసం ఇద్దరి, ముగ్గురి భాగస్వామ్యం ఉంటుంది. గాలిపటాలు కూడా ఒక్కడే ఎగరేయడు. ఒకరు దానిని ఆకాశంలో గద్దలకు పోటీగా ఎగిరేలా గాలి పటానికి అను గుణంగా దారం చేతుల్లో ఆడిస్తారు. ఇంకొకరు కండేనికి దారం చుడుతూ వదులుతూ ఉంటారు. ఇంకొకరు అది కింద పడ కుండా జాగ్రత్తలు, సలహాలు ఇస్తుంటారు. ఇలా రకరకాలుగా ఒకరికొకరు సహాకారం తీసుకుంటుంటారు. గ్రూపు సందడికి ఇది సంకేతం. సమూహంగ ఏర్పడితేనే ఏదైనా సాధన. రూపకల్పన చేయోచ్చనేది ఈ విషయ సారాంశం.
- జాగ్రత్తలు తప్పనిసరి..
వడ్లూరీ రాజేశ్- ఉపాధ్యాయుడు
గాలిపటాల్ని ఎగరేసేటప్పుడు పైన పిట్టగోడ లేని భవనం ఎక్కొద్దు. సాధారణ దారాన్నే వాడాలి. తప్పనిసరిగా పక్కన పెద్దలుండాలి. విద్యుత్ తీగలకు దగ్గరగా వెళ్లొద్దు. ఇవన్నీ ఒక ఎత్తైతే నాటి బాలతరం అడుగుజాడల్లో పతంగి ఆటలు ఆడితేనే మానసిక, శారీరక ఉల్లాసం లభిస్తుంది.