Kumaram Bheem Asifabad: మున్సిపాలిటీ గ్రేడ్-2 అయ్యేనా?
ABN , Publish Date - Jan 17 , 2025 | 11:15 PM
కాగజ్‌నగర్, జనవరి 17(ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్ మున్సిపాలిటీ గ్రేడ్-2కావాలని ప్రజలంతా నిరీక్షిస్తున్నారు.

-నిరీక్షిస్తున్న కాగజ్‌నగర్ ప్రజలు
-పట్టణ జనాభా 57,803
-మున్సిపాలిటీ ఆదాయం రూ.3కోట్లు
-గ్రేడ్-2గా మారితే మరిన్ని నిధులు వచ్చే అవకాశం
-సమీప గ్రామాలు వీలినం చేస్తే మరింత అభివృద్ధి
కాగజ్‌నగర్, జనవరి 17(ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్ మున్సిపాలిటీ గ్రేడ్-2కావాలని ప్రజలంతా నిరీక్షిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల మున్సిపాల్టీని కార్పొరేషన్‌గా మార్పుచేస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కాగజ్‌నగర్ మున్సిపాలిటీ గ్రేడ్-3గా కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాల్టీల అప్‌గ్రేడ్ చేస్తున్న నేపథ్యంలో కాగజ్‌నగర్ మున్సిపాల్టీ గ్రేడ్-2గా మారాలన్న ఆశలు పెరుగుతున్నాయి. కాగజ్‌నగర్ మున్సిపాల్టీలో 30వార్డులుండగా, పట్టణ జనాభా 2011లెక్కల ప్రకారం 57,803 ఉంది. మున్సిపాల్టీకి వచ్చే ఆదాయంలో ప్రధానంగా ఇంటి పన్ను, ఆస్తిపన్ను, ప్రభుత్వ కార్యాయాల పన్నులు, మార్కెట్ వ్యాపారులకు ట్రేడింగ్ లైసెన్సు, నీటి కుళాయిల బిల్లు, ఎల్‌ఆర్‌ఎస్ బిల్లులు కలుపుకుంటే సాలీనా రూ.3కోట్లు ఆదాయం వస్తోంది. కాగజ్‌నగర్ మున్సిపాల్టీ గ్రేడ్-3 పరిధిలో ఉంది. గ్రేడ్-2 చేసేందుకు అవకాశాలున్నప్పటికీ కూడా ఇంకా ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ రావటం దలేదు. ఐదేళ్ల క్రితం కూడా ఈ మున్సిపాల్టీని గ్రేడ్-2గా మార్చాలని పాలకవర్గం తీర్మాణం చేసి ఉన్నతాధికారులకు పంపించారు. అయితే ఇది కేవలం ప్రతిపాదనలకే పరిమితమైంది. ఇంత వరకు అమలు కాలేదు.
గ్రేడ్-2గా మారిస్తే మారనున్న మున్సిపాలిటీ రూపురేఖలు..
కాగజ్‌నగర్ మున్సిపాల్టీని గ్రేడ్-2గా మారిస్తే పట్టణ రూపురేఖలు మారుతాయి. సమీప గ్రామాలైన భట్టుపల్లి, అందవెల్లి, జీడీచేను, డాడానగర్, రాంనగర్, కోసిని, బారెగూడ, వంజీరి గ్రామాలు కూడా మున్సిపాల్టీలో విలీనం చేసేందుకు అవకాశాలుంటాయి. దీంతో మున్సిపాల్టీకి ఆదాయం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రత్యేకగ్రాంటు విడులయ్యే అవకాశం ఉంటుంది. ప్రధానంగా మున్సిపాల్టీలో అదనంగా వివిధ విభాగాల్లో ఉద్యోగాలు పెరుగుతారు. ప్రస్తుతం కేంద్రప్రభుత్వం స్వచ్ఛ మున్సిపాల్టీకి కింద వివిధ నిధులను విడుదలు చేస్తుండగా గ్రేడ్-2గా మారితే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అధిక నిధులు వచ్చే అవకాశాలున్నాయని పలువురు పేర్కొంటున్నారు. ప్రధానంగా మాస్టర్‌ప్లాన్ చేసే అవకాశంతోపాటు సమీపగ్రామాల అనుసంధానం చేస్తే కొత్త కళ రానుంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో భైంసా, మందమర్రి, కాగజ్‌నగర్ మున్సిపాల్టీలు గ్రేడ్-3 జాబితాలో ఉన్నాయి. కాగా కాగజ్‌నగర్ పట్టణానికి సరిపడా వనరులున్నాయని, వెంటనే గ్రేడ్-2 మున్సిపాలిటీగా చేయాలని ప్రజలు డిమాండు చేస్తున్నారు. మున్సిపాల్టీలోనే అతి పెద్ద పేపర్‌మిల్లు ఉండటం విశేషం. వీటితో కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్ మీదుగా దాదాపు అన్ని ఎక్స్ ప్రెస్‌రైళ్లకు హాల్టు ఉండటం, కాగజ్‌నగర్ మీదుగా మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్ కలిసి అంతరాష్ట్ర రహదారి రోడ్డు సౌకర్యం ఉంది. ఆర్థిక వనరులు, రహదారి వ్యవస్థకు అన్ని హంగులున్నాయని అధికారులు వెంటనే గ్రేడ్-2 మున్సిపాలిటీగా చేయాలని ప్రజలు కోరుతున్నారు.
అధికారులకు ప్రతిపాదనలు పంపించాం..
-అంజయ్య, కమిషనర్, కాగజ్‌నగర్
కాగజ్‌నగర్ మున్సిపాల్టీ ప్రస్తుతం గ్రేడ్-2 విభాగంలో జాబితాలో ఉంది. గతంలో పాలకవర్గం గ్రేడ్-2గా చేయాలని ఉన్నతాధికారులకు నివేదికలను పంపించారు. ఇందుకు అవసరమైన అంశాలను అన్నింటిని ప్రస్తావిస్తూ వివరంగా ఉన్నతాధికారులు నివేదికలను అందజేశారు.