Kumaram Bheem Asifabad: పంచాయతీ ఎన్నికల కోసం ఎదురుచూపులు
ABN , Publish Date - Jan 16 , 2025 | 10:27 PM
చింతలమానేపల్లి, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరపకపోవడంతో గ్రామాలు అవస్థల్లో కొట్టుమిట్టాడుతున్నాయి.

- ఇప్పటికే ఓటర్ల జాబితా విడుదల
- గ్రామాల్లో పేరుకుపోతున్న సమస్యలు
- ప్రత్యేక పాలనలో పంచాయతీలకు ఆర్థిక ఇబ్బందులు
- అస్తవ్యస్థంగా గ్రామాలు..
- సిబ్బందికి నెలనెలా వేతనాలు ఇవ్వని పరిస్థితి
చింతలమానేపల్లి, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరపకపోవడంతో గ్రామాలు అవస్థల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. గ్రామాలకు ప్రథమ పౌరులు కరువైపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రాక పంచాయతీలు నీరసించిపోతున్నాయి. గ్రామపంచాయతీల పదవీకాలం ముగిసి నెలలు దాటినా ప్రస్తుతం ప్రభుత్వం పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. ఫిబ్రవరిలో స్థానికఎన్నికలు జరిగే అవకాశం ఉన్నదని అధికారులు చెబుతున్నప్పటికీ ఎన్నికలు జరుపుతారా? లేదా? అన్న అనుమానం ప్రజల్లో ఉంది. ఓ వైపు అధికారులు ఇప్పటికే ఓటర్ల జాబితాను విడుదల చేసి బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేయడం, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సౌకర్యాల పరిశీలన, నోడల్ అధికారుల నియామకం, ఆయా సర్పంచులు, వార్డు సభ్యులకు గుర్తులు కేటాయిచడం వంటివి చూస్తుంటే ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోందిది. సర్పంచుల బ్యాలెట్ గులాబీ రంగులో, వార్డు సభ్యుల బ్యాలెట్ తెలుపు రంగు కాగితంలో ముద్రించే పనులకు అధికారులు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తున్నది. దీంతో గ్రామ పంచాయతీల ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని ఆశావహులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం బీసీల జనాభా తేల్చడానికి పూనుకుంది. ఇప్పటికే కులగణన కార్యక్రమాలు పూర్తి చేసింది.
ప్రత్యేక అధికారుల పాలనలో పంచాయతీలు..
గ్రామసర్పంచుల పదవీకాలం ముగియగానే మండలాల్లో పనిచేస్తున్న అధికారులను ప్రభుత్వం ప్రత్యేక అధికారులుగా నియమించింది. ఆయా పంచాయతీల గ్రామకార్యదర్శులతో కలిసి గ్రామంలో సర్పంచుల పాత్ర పోషిస్తున్న ప్రత్యేకఅధికారులు ప్రారంభంలో గ్రామాలకు వెళ్లి ప్రజల సమస్యల తెలుసుకున్నా.. అవి పరిష్కరించడానికి నిధులు లేక దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. గ్రామాల్లో పారిశుధ్య కార్మికులకు సైతం వేతనాలు ఇవ్వలేని పరిస్థితిలో గ్రామ పంచాయతీలున్నాయి. ఇప్పటికీ 3నెలల వేతనం ఇవ్వాల్సి ఉన్నదని ఆ సంఘం నేతలు చెబుతున్నారు. దీన్నిబట్టి గ్రామ పంచాయతీలు ఆర్థికంగా ఎంత ఇబ్బందిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇకపంచాయతీ కార్యదర్శులు కరెంటు బల్బులు, బ్లీచింగ్ పౌడర్, తదితర వస్తువులు అరువుకు తెచ్చి కాలం నెట్టుకొస్తుండడంతో చిన్న, చిన్న గ్రామపంచాయతీలు కూడా అప్పుల్లో కూరుకుపోయినట్లు తెలుస్తున్నది.
పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టడానికి ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను కేటాయించడంతో దీనిపై డ్రైవర్‌తోపాటు పారిశుధ్య సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రతీరోజు ట్రాక్టర్ నడపడానికి డీజిల్ డబ్బులు అవసరమ వుతున్నాయి. ఇవేమి కూడా ప్రత్యేక అధికారులు పట్టనట్టు ఉండడంతో కార్యదర్శులు డబ్బులు వెచ్చింది అప్పుల్లో కూరుకుపోతున్నారు.
జిల్లాలో మొత్తం 335 జీపీలు ఉండగా ఓటర్లు ఇలా..
నియోజకవర్గం పోలింగ్ కేంద్రాలు పురుష ఓటర్లు మహిళా ఓటర్లు ఇతరులు మొత్తం
సిర్పూర్ 320 1,15,323 1,15,811 16 2,31,150
ఆసిఫాబాద్ 358 1,13,815 1,15,813 16 2,29,644
మొత్తం 678 2,29,138 2,31,624 32 4,60,794
సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలి..
కత్తెర్ల భీమేష్, మండల నాయకుడు
ప్రభుత్వం వెంటనే గ్రామపంచాయతీల ఎన్నికలను నిర్వహించాలి. గ్రామస్థాయిలో ప్రజాప్రతినిధులు లేకపోవడంవల్ల గ్రామీణప్రాంతాల ప్రజల సమస్యలు నెరవేరడం లేదు. గ్రామాలు అస్థవ్యస్థంగా తయారవుతు న్నాయి. వెంటనే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించి ప్రజలకు మెరుగైనపాలన అందించే దిశగా చర్యలు చేపట్టాలి. గ్రామాలకు నెలనెలా నిధులు కేటాయించి అభివృద్దికి పాటుపడాలి.
పెండింగ్ బిల్లులు చెల్లించాలి..
- సుశీల్ కుమార్, మాజీసర్పంచ్ (రవీంద్రనగర్-2)
గ్రామస్థాయిలో సర్పంచులు సమస్యలు పరిష్కరించడానికి అప్పులు చేసి డబ్బులు పెట్టారు. గతంలో అధికా రంలో ఉన్న ప్రభుత్వం గ్రామపంచాయతీలకు సకాలంలో నిధులు ఇవ్వకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకు పోయారు. ప్రజాప్రభుత్వం మాజీసర్పంచులకు వెంటనే బిల్లులు చెల్లించడంతోపాటు ఎన్నికలు త్వరగా నిర్వహిం చాలి. మా రవీంద్రనగర్-2 జీపీలోనే సుమారు రూ.5లక్షల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.