Kumaram Bheem Asifabad: యధేచ్ఛగా బెల్టుషాపులు
ABN , Publish Date - Jan 12 , 2025 | 11:10 PM
చింతలమానేపల్లి, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో బెల్టుషాపు దందా మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది. నియంత్రించాల్సిన సంబంధిత అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తుండడంతో పల్లెలు పట్టణాలని తేడాలేకుండా కిరాణా దుకాణం నుంచి మొదలుకొని నివాసగృహాల వద్ద మద్యం ఏరులై పారుతోంది.

- జిల్లాలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న వైనం
- నిబంధనలకు విరుద్దంగా విక్రయాలు
- పట్టణాలు..పల్లెలని తేడాలేకుండా ఏరులైపారుతున్న మద్యం
- కల్తీ మద్యానికి బలవుతున్న అమాయకులు
- చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు
చింతలమానేపల్లి, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో బెల్టుషాపు దందా మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది. నియంత్రించాల్సిన సంబంధిత అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తుండడంతో పల్లెలు పట్టణాలని తేడాలేకుండా కిరాణా దుకాణం నుంచి మొదలుకొని నివాసగృహాల వద్ద మద్యం ఏరులై పారుతోంది. జిల్లాలో దాదాపుగా అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. వివిధ రకాల పనులకు వెళ్లేవారికి తెల్లవారుజాము నుంచే మద్యం విక్రయిస్తున్నారు. పోలీసులకు స్థానికులు సమాచారం ఇవ్వడంతో అడపాదడపా దాడులు నిర్వహిస్తున్నా.. బెల్టు దందామాత్రం జోరుగా సాగుతోంది.
నేరుగా మద్యం షాపుల నుంచి రవాణా..
ఓవైపు గుడుంబా మానేసిన వారికి ప్రభుత్వం స్వయంఉపాధి మార్గాలతో జీవనోపాధి కల్పిస్తుంటే, మరోవైపు బెల్టు దుకాణాలు పల్లె, పట్టణప్రజలను మత్తులో ముంచెత్తుతున్నాయి. నిబంధనలకు వ్యతిరేకంగా గ్రామాల్లో బెల్టుదుకాణాలు కొనసాగుతున్నా.. చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం విఫలమవుతుందన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. జిల్లాలోని కొందరు మద్యం షాపుల వారే కమీషన్లకు బెల్టుషాపుల నిర్వహణ చేయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. బెల్టు షాపులు ఒక్కరిని చూసి ఒకరు పెడుతూ ఈదందానే జీవనోపాధిగా చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఉదయం నుంచిసాయంత్రం దాకా..రాత్రి వేళల్లో సైతం మద్యం అందుబాటులో ఉంచుతూ ప్రజలను మత్తులో ముంచుతున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
మద్యం మత్తులో గ్రామాలు..
ఒకప్పుడు పట్టణప్రాంతాల్లోనే పరిమితమైన ఈదందా ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోనూ విచ్చల విడిగా కొనసాగుతోంది. వార్డుకో దుకాణం చొప్పున ఏర్పాటు చేయడంతో గ్రామాల్లో జోరుగా మద్యం దందా సాగుతోంది. ఒక్కో గ్రామంలో సుమారుగా 10బెల్టుషాపుల వరకు ఉంటాయి. ఇందులో రోజుకు ఒక్కో బెల్టుషాపు నుంచి రూ.5నుంచి 10వేల మద్యం అమ్మకాలు జరిగితే సుమారుగా రోజుకు రూ.50వేల నుంచి లక్షవరకు మద్యం అమ్మకాలు ఒక్క గ్రామంలోనే జరుగుతున్నాయి. జిల్లాలో 335గ్రామ పంచాయతీలు, మరో 300వరకు అనుబంధ గ్రామాలు ఉండగా మద్యం దందా రోజుకు ఏ స్థాయిలో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో దాదాపుగా వెయ్యికి పైగానే బెల్టు షాపులు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. బెల్టుదుకాణాల్లో మద్యం బాటిళ్లను ఎమ్మార్పీ కంటే రూ. 40నుంచి 50వరకు ఎక్కువ ధరలకు విక్రయిస్తూ అవసరమైతే మద్యాన్ని కల్తీచేస్తూ ప్రజల ప్రాణాలకు ముప్పుతెస్తున్నారు. పట్టణాల్లో, గ్రామాల్లో సైతం ఎప్పుడు అవసరమైతే అప్పుడు అన్ని వేళల్లో మద్యం లభిస్తోంది. గతంలో టీతాగడానికి హోటల్‌కు వెళ్లేవారు కానీ ప్రస్తుతం ఉదయం లేవగానే బెల్టు దుకాణానికి వెళ్తూ తమ ఆరోగ్యాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ వ్యవహార మంతా అధికారులకు తెలిసినా బెల్టుదందాపై కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లాలోని ఉన్నతాధికారులు ప్రత్యేకదృష్టి సారిస్తేనే బెల్టుదందాకు అడ్డుకట్ట పడే అవకాశాలున్నాయి. అతేకాకుండా ప్రజల ఆరోగ్యాలకు రక్షణ కల్పించిన వారవుతారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.