Kumaram Bheem Asifabad: ఐదు నెలలుగా వేతనాల్లేవు!
ABN , Publish Date - Jan 04 , 2025 | 11:22 PM
వాంకిడి, జనవరి 4(ఆంధ్రజ్యోతి): ఒక నెల వేతనం ఆలస్యమైతేనే ఇంటి నిర్వహణ ఖర్చులు, నెలవారీ చెల్లింపులు(ఈఎంఐ) ఆలస్యమై ఇబ్బందులు పడతాం. అదే నెలల తరబడి వేతనాలు రాకుంటే పరిస్థితి ఎలాం ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

- ఇబ్బందులు పడుతున్న అతిథి అధ్యాపకులు
వాంకిడి, జనవరి 4(ఆంధ్రజ్యోతి): ఒక నెల వేతనం ఆలస్యమైతేనే ఇంటి నిర్వహణ ఖర్చులు, నెలవారీ చెల్లింపులు(ఈఎంఐ) ఆలస్యమై ఇబ్బందులు పడతాం. అదే నెలల తరబడి వేతనాలు రాకుంటే పరిస్థితి ఎలాం ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. చాలీచాలని వేతనాలతో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులకు ఐదు నెలలుగా వేతనాలు అందడంలేదు. ప్రభుత్వ అథ్యాపకులతో సమానంగా పనిచేస్తూ విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న వీరి వేతనాలను ప్రభుత్వం విడుదల చేయడం లేదు. దీంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే జీతాలు విడుదల చేయాలని కోరుతున్నారు.
జిల్లాలో 61మంది అధ్యాపకులు..
జిల్లాలో 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా ఇందులో రగ్యులర్ అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీ అధ్యాపక పోస్టులను ప్రభుత్వం భర్తీ చేపట్టకపోవడంపతో విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా అతిథి అధ్యాపకులను నియమించారు. ప్రభుత్వ జూనియర్ కశాళాలల్లో రెగ్యులర్ అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్న చోట అన్ని కళాశాలల్లో మొత్తం 61మంది ఒప్పంద, అతిథి అధ్యాపకులను ప్రభుత్వం నియమించింది. ఈ ఏడాది జూన్‌లో వారిని రెన్యువల్ చేసింది. ప్రతీ పీరియడ్‌కు రూ.390చొప్పున నెలకు 72పీరియడ్‌లకు రూ.28,080కి మించకుండా వేతనం చెల్లించారు. జూన్, జూలై రెండు నెలల వేతనం చెల్లించారు. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలలు అంటే ఐదు నెలల జీతం ఇంతవరకు విడుదల చేయలేదు. నెలకు రూ.28,080అని చెపుతున్నా.. ఒక నెలలో సెలవులు ఎక్కవగా ఉన్నా లేదా అనారోగ్యం, ఇతర పనులతో విధులకు హాజరు కాకున్నా వాటికి వేతనం కట్ చేస్తున్నారు. వచ్చే డబ్బులను కూడా నెలనెలా ఇవ్వకుంటే తమ కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలంటూ అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- ఇబ్బందులు పడుతున్నాం..
జీ సత్తయ్య, అతిథి అధ్యాపకుడు
ప్రభుత్వ జూనియర్ కళాశాల - వాంకిడి
నాలుగు నెలల నుంచి వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నాం. దీంతో కుటుంబ పోషణ భారంగా మారింది. చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న తమకు నెలల తరబడి వేతనాలు ఇవ్వకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోంది. వెంటనే వేతనాలు విడుదల చేసి ఆదుకోవాలి.