Share News

Kumaram Bheem Asifabad: కుహు..కుహూ.. సరాగాలు..

ABN , Publish Date - Jan 18 , 2025 | 10:56 PM

పచ్చని చెట్లు.. ఎత్తైన కొండలు.. వన్యప్రాణులు.. సుమారు 300కు పైగా రకాల పక్షులు.. పెద్దవాగు, ప్రాణహిత సంఘమ పరిహాక ప్రాంతం.. వీటికి తోడు శీతాకాలంలో వచ్చే విడిది వలస పక్షుల కిలకిల రావాలతో విరసిల్లుతున్న పెంచికలపేట రేంజ్‌ పరిధిలోని అటవీప్రాంతం శనివారం బర్డ్‌వాక్‌ ఫెస్టివల్‌-3తో పక్షి ప్రేమికులను పరవశించేలా చేసింది.

Kumaram Bheem Asifabad:  కుహు..కుహూ.. సరాగాలు..

- బర్డ్‌వాక్‌ ఫెస్టివల్‌-3ని ప్రారంభించిన సబ్‌ కలెక్టర్‌, ఏఎస్పీ, ఎఫ్‌డీవో

- పలు ప్రాంతాల్లో పక్షుల వీక్షణ

- 15రకాల విదేశీ పక్షుల సందడి

- పాల్గొన్న 30మంది ఔత్సాహిక పక్షి ప్రేమికులు

పచ్చని చెట్లు.. ఎత్తైన కొండలు.. వన్యప్రాణులు.. సుమారు 300కు పైగా రకాల పక్షులు.. పెద్దవాగు, ప్రాణహిత సంఘమ పరిహాక ప్రాంతం.. వీటికి తోడు శీతాకాలంలో వచ్చే విడిది వలస పక్షుల కిలకిల రావాలతో విరసిల్లుతున్న పెంచికలపేట రేంజ్‌ పరిధిలోని అటవీప్రాంతం శనివారం బర్డ్‌వాక్‌ ఫెస్టివల్‌-3తో పక్షి ప్రేమికులను పరవశించేలా చేసింది. - పెంచికలపేట

అటవీశాఖ ఆధ్వర్యంలో పెంచికలపేట రేంజ్‌లో నిర్వహించిన బర్డ్‌వాక్‌ ఫెస్టివల్‌-3లో పాల్గొనేందుకు 30మంది ఔత్సాహిక పక్షిప్రేమికులు శుక్రవారం సాయంత్రం పెంచికల్‌ పేటకు చేరుకున్నారు. రాత్రి ఇక్కడే బసచేశారు. శనివారం ఉదయం సబ్‌కలెక్టర్‌ శ్రద్ధాశుక్లా, ఏఎస్పీ చిత్తరంజన్‌, ఎఫ్‌డీవో బోబడే సుశాంత్‌ సుకుదేవ్‌తో కలిసి బర్డ్‌వాక్‌ ఫెస్టివల్‌-3ను ప్రారంభించారు. ముందుగా ఎల్లూరు బొక్కివాగు ప్రాజెక్టు వద్ద పక్షులను వీక్షించారు. ఈ ప్రాంతంలో సుమారు 35రకాల దేశీ, విదేశీ పక్షులను గుర్తించి తమ తమ కెమెరాలలో బంధించారు. పక్షిప్రేమికులకు ఎఫ్‌ఆర్వో అనీల్‌కుమార్‌ వాటి ప్రాముఖ్యతను వివరించారు.

ప్రధాన ఆకర్షణ..

15రకాల విదేశీ పక్షుల ఆగమనం బర్డ్‌వాక్‌ ఫెస్టివల్‌కే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇందులో బ్లాక్‌ డ్రాగన్లో, యుఏషాన్‌ స్పూన్‌ బిల్‌, ఐట్‌ త్రోటేడ్‌ కింగ్‌ ఫిషిర్‌, కామన్‌ హోప్‌, రివర్‌ టర్న్‌, గ్రేహార్న్‌ బిల్‌, నార్తర్న్‌ ఫిన్టెయిల్‌, స్పాట్‌ బిల్‌ డక్స్‌, బ్లాక్‌ వింజర్డ్‌ స్టిల్డ్‌, రెడ్‌ వాటర్‌ లాప్వింగ్‌, గ్రీన్‌ బిఈటర్‌, ఒపెన్‌బిల్‌ స్టార్క్‌ మొదలగు విదేశీ పక్షులు ఔత్సాహికులను ఆనందింపజేశాయి. మధ్యాహ్నం పొడుగు ముక్కు రాబందుల ఆవాసమైన పాలరాపు గుట్ట వద్దకు పయనమయ్యారు. పెద్దవాగు-ప్రాణహిత సంగమ ప్రాంతం ప్రకృతి ప్రేమికులను ఆకట్టుంది.

నిరాశే మిగిలింది..

పెంచికలపేట రేంజ్‌ అంటేనే ముందుగా గుర్తొచ్చేది పాలరాపు గ్టుటపై ఉన్న అంతరించి పోయే దశలో ఉన్న పొడుగు ముక్కు రాబందులు. అయితే రెండు మూడేళ్లుగా రాబందుల జాడ అంతగా కనిపించడం లేదు. దీంతో ఈ బర్డ్‌ వాక్‌ ఫెస్టివల్‌లో వాటిని చూద్దాం అనుకున్న పక్షి ప్రేమికులకు మళ్లీ నిరాశే ఎదురయింది. గతంలో సుమారు 30 రాబందులు ఉండేవని అటవీ శాఖాధికారుల అంచనా.

సిర్పూర్‌(టి)రేంజ్‌ పరిధిలో బర్డ్‌ వాక్‌-3

సిర్పూర్‌(టి), జనవరి 18(ఆంధ్రజ్యోతి): అటవీశాఖ ఆధ్వర్యంలో కాగజ్‌నగర్‌ డివిజన్‌లోని సిర్పూర్‌(టి)రేంజ్‌ పరిధిలో శనివారం బర్డ్‌వాక్‌ ఫెస్టివల్‌-3ను ఘనంగా ప్రారంభించారు. వివిధ రకాల దేశ, విదేశీ పక్షులను తమ కెమెరాల్లో బంధించారు. సిర్పూర్‌(టి)రేంజ్‌ పరిధిలో చింతకుంట సెక్షన్‌లోని వివిధ కుంటలు, హీరాపూర్‌వాగు, జీడివాగు తదితర ప్రాంతాల్లో పక్షి ప్రేమికులు పర్యటించారు. కార్యక్రమంలో ఎఫ్‌డీవో సుశాంత్‌బోబడే, ఎఫ్‌ఆర్వో ఇక్బాల్‌ హుస్సేన్‌, సెక్షన్‌ఆఫీర్‌ మోహన్‌రావు పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2025 | 11:06 PM