Share News

జయ జయ శంకర.. భక్త శుభంకర

ABN , Publish Date - Feb 26 , 2025 | 11:36 PM

జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. భక్తులు గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించారు. గోదావరి తీరం శివ నామస్మరణతో, శివసత్తుల పూనకాల నడుమ పులకించిపోయింది. వేకువజాము నుంచే ఆలయాలను సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. వేలాల గట్టు మల్లన్న జాతర, బెల్లంపల్లి మండలం బుగ్గ రాజరాజేశ్వరస్వామి, కత్తెరసాలలోని మల్లికార్జునస్వామి జాతరకు భక్తులు పోటెత్తారు.

జయ జయ శంకర.. భక్త శుభంకర
వేలాలలో గట్టు మల్లన్న స్వామి దర్శనానికి బారులుదీరిన భక్తులు

- శివనామస్మరణతో మార్మోగిన జిల్లా

- ఉదయం నుంచే ఆలయాల్లో బారులుతీరిన భక్తులు

- వేలాల, బుగ్గ రాజరాజేశ్వరస్వామి జాతరకు పోట్తెత్తిన భక్తజనం

జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. భక్తులు గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించారు. గోదావరి తీరం శివ నామస్మరణతో, శివసత్తుల పూనకాల నడుమ పులకించిపోయింది. వేకువజాము నుంచే ఆలయాలను సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. వేలాల గట్టు మల్లన్న జాతర, బెల్లంపల్లి మండలం బుగ్గ రాజరాజేశ్వరస్వామి, కత్తెరసాలలోని మల్లికార్జునస్వామి జాతరకు భక్తులు పోటెత్తారు.

జైపూర్‌, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): మహాశివరాత్రి పండగను పురస్కరించుకుని వేలాల గ్రామంలోని గుట్టపై వెలిసిన గట్టు మల్లన్న జాతరకు బుధవారం భక్తులు తండోప తండాలుగా తరలి వచ్చి గట్టు మల్లన్నను దర్శించుకున్నారు. తెల్లవారుజామునే భక్తులు కుటుంబాలతో కలిసి వచ్చి గోదావరినదిలో స్నానాలు ఆచరించి గట్టుపై వెలిసిన గుట్ట మల్లన్నను దర్శించుకోవడానికి బారులు తీరారు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు బోనాలు వండి గట్టు మల్లన్న స్వామికి నైవేద్యంగా సమర్పించారు. మల్లన్న స్వామికి భక్తులు వారి పిల్లల తలనీలాలు సమర్పించారు. జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్‌, శ్రీరాంపూర్‌ సీఐ వేణుచందర్‌ , జైపూర్‌ ఎస్‌ఐ శ్రీధర్‌ ఆధ్వర్యంలో గుట్టపై భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తూ భక్తులను క్యూలో పంపించారు. క్యూలైన్‌లో నీడ కోసం టెంట్లను ఏర్పాటు చేశారు. వేలాల గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో వాటర్‌ ట్యాంకుల ద్వారా మంచినీటిని భక్తులకు అందజేశారు. భక్తులు రాత్రి గుట్టపైనే జాగారం చేశారు.

- మల్లన్న స్వామిని దర్శించుకున్న ఎంపీ, ఎమ్మెల్యే, సీపీ

చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రామగుండం సీపీ శ్రీనివాస్‌, మంచిర్యాల డీసీపీ భాస్కర్‌ గట్టు మల్లన్న స్వామిని, గ్రామంలోని మల్లికార్జున స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలుచేశారు. అంతకుముందు ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యేకు, ఎంపీకి స్వాగతం పలికారు. ఎమ్మెల్యే, ఎంపీకి పండితులు తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా రామగుండం సీపీ శ్రీనివాస్‌ మాట్లాడుతూ వేలాల జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వ శాఖల సహాయంతో పూర్తి ఏర్పాట్లు చేశామని వివరించారు. డ్రోన్‌ కెమెరాల ద్వారా జాతరను పర్యవేక్షించారు. సీపీ వెంట అడిషనల్‌ డీసీపీ అడ్మిన్‌ రాజు, స్పెషల్‌ బ్రాంచ్‌ ఏసీపీ రాఘవేంద్రరావు, జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్‌,ఏఆర్‌ ఏసీపీ ప్రతాప్‌, శ్రీరాంపూర్‌ సీఐ వేణుచందర్‌, ఎస్‌ఐ శ్రీధర్‌ ఉన్నారు.

భక్తజనసంద్రమైన బుగ్గ జాతర

బెల్లంపల్లిరూరల్‌ (ఆంధ్రజ్యోతి): బెల్లంపల్లి మండలం కన్నాలలోని బుగ్గ రాజరాజేశ్వరస్వామి ఆలయం బుధవారం భక్తజన సంద్రమైంది. బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్‌ దంపతులు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు సౌకర్యాలను కల్పించారు. నీడ కోసం టెంట్లను ఏర్పాటు చేశారు. జాతరలో ఎలాంటి అవాంఛచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

ఫ మండలంలోని కన్నాల బుగ్గ రాజరాజేశ్వరస్వామి దేవాలయంలో మహాశివరాత్రి జాతర సందర్భంగా ట్రాఫిక్‌ సమస్య తలెత్తడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. కన్నాల నుంచి బుగ్గ దేవాలయం వరకు ఇటీవల నిర్మించిన బీటీ రోడ్డుపై వాహనాలు చిక్కుకున్నాయి. రోడ్డు వెడల్పు తక్కువగా ఉండడంతో పాటు రోడ్డుకు రెండు వైపులా మట్టితో రోలింగ్‌ చేయకపోవడంతో వాహనాలు రోడ్డు దిగలేని పరిస్థితి తలెత్తింది. బెల్లంపల్లి నుంచి బుగ్గకు, బుగ్గ ఆలయం నుంచి బెల్లంపల్లి వైపు వెళ్లే వాహనాలు కిక్కిరిసి ట్రాఫిక్‌ సమస్యకు కారణమైంది. దాదాపు రెండు గంటలకు పైగా వాహనాలు కదలని పరిస్థితి ఏర్పడింది. దీంతో పోలీసులు చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.

- కన్నుల పండువగా మల్లికార్జునస్వామి కల్యాణం

చెన్నూరు (ఆంధ్రజ్యోతి): మండలంలోని కత్తెరసాలలోని మల్లికార్జునస్వామి ఆలయంలో మల్లికార్జున-భ్రమరాంబిక కల్యాణాన్ని వేద పండితులు ఘనంగా నిర్వహించారు. మల్లికార్జున స్వామి ఆలయంలో పూజలు చేసిన భక్తులు బోనాలు పోసి పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి దంపతులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చెన్నూరు సీఐ రవీందర్‌ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

చెన్నూరు పట్టణ సమీపంలోని పంచకోశ ఉత్తర వాహిని గోదావరి తీరంలో పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు పోటెత్తారు. గోదావరి తీరం శివ నామస్మరణతో, శైకత లింగాలు, శివసత్తుల పూనకాల నడుమ పులకించిపోయింది. అనంతరం గోదావరి తీర సమీపంలోని హనుమాన్‌ ఆలయంలో భక్తులు పూజలు చేశారు. పట్టణంలోని అంబా అగస్త్యేశ్వర ఆలయంలో భక్తులు పూజలు చేశారు.

దండేపల్లి (ఆంధ్రజ్యోతి): మహాశివరాత్రి పర్వదినంను పురస్కరించుకుని బుధవారం దండేపల్లి మండలం ద్వారక, లక్ష్మీకాంతపూర్‌, గుడిరేవు గ్రామాల గోదావరి తీరాలు భక్తజన సందోహంతో నిండిపోయాయి. భక్తులు నదీస్నానాలు చేసేందుకు ఉదయాన్నే కుటుంబ సమేతంగా నదీ తీరానికి చేరుకోని పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం గంగమ్మతల్లికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ద్వారక ఒడ్డున గల గంగమ్మతల్లి, దత్తాత్రేయాలయం, శివాలయం, లక్ష్మీకాంతపూర్‌ నది ఒడ్డున గల శ్రీమల్లికార్జునస్వామి, నర్సాపూర్‌లో శ్రీభ్రరామంభ మల్లిఖార్జున సమేత, దండేపల్లి భక్త మార్కండేయశివాలయం, మ్యాదరిపేటలో లక్ష్మీనారాయణ, అన్నపూర్ణ కాశీవిశ్వేశ్వర, శివనంచాయతన భక్తాంజనేయ నవగ్రహాలకు భక్తులు ప్రత్యేకపూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. గూడెంలో సత్యనారాయణస్వామి ఆలయంతోపాటు పలు ఆలయాలను భక్తులు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరి వద్ద భక్తుల రద్దీ పెరగడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎంపీడీవో జేఆర్‌ ప్రసాద్‌, సిబ్బంది, కార్యదర్శి గూడెం గోదావరి నది వద్ద పర్యవేక్షించారు. దండేపల్లి ఎస్సై తైసినోద్దీన్‌ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

లక్షెట్టిపేట(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని సాంభశివాలయం తో పాటు సాయిబాబా, కన్యకాపరమేశ్వరి ఆలయాలు భక్తులతో కలిటకిటలాడాయి. వివిధ స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార సంఘాలు దైవ దర్శనాలకు వచ్చిన భక్తులకు పండ్లు నీళ్లు అందించారు. లక్షెట్టిపేట గోదావరిలో సుమారు 20వేల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్‌రావు కుటుంబ సభ్యులతో కలిసి లక్షెట్టిపేట గోదావరి నదిలో పుణ్య స్నానాలను ఆచరించారు. లక్షెట్టిపేట సీఐ నరేందర్‌, ఎస్సై సతీష్‌ బందోబస్తును పర్యవేక్షించారు.

Updated Date - Feb 26 , 2025 | 11:36 PM