అతివలకు బీమా.. అవగాహనతోనే ధీమా
ABN , Publish Date - Feb 23 , 2025 | 11:37 PM
అతివల ఆర్థిక స్వావలంబన కోసం మహిళా సంఘాల ద్వారా ప్రభుత్వాలు రుణాలను అందిస్తున్నాయి. సంఘాల ఏర్పాటు ద్వారా సభ్యులు రుణాలను పొందుతూ స్వశక్తితో ఎదుగుతున్నారు.

- స్వయం సహాయక సభ్యులకు చేకూరనున్న ప్రయోజనం
- ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ. 10 లక్షలు
- అంగవైకల్యం కలిగితే రూ. 5 లక్షలు
వాంకిడి, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): అతివల ఆర్థిక స్వావలంబన కోసం మహిళా సంఘాల ద్వారా ప్రభుత్వాలు రుణాలను అందిస్తున్నాయి. సంఘాల ఏర్పాటు ద్వారా సభ్యులు రుణాలను పొందుతూ స్వశక్తితో ఎదుగుతున్నారు. లక్షలాది మంది మహిళలు ప్రగతి మార్గంలో పయనిస్తున్నారు. సంఘాల్లోని మహిళలకు మరింత ప్రోత్సాహాన్ని అందించేందుకు ప్రభుత్వం ప్రతీమహిళకు బీమా సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించింది. సంఘాల్లో సభ్యురాలిగా ఉండి స్త్రీనిధి ద్వారా రుణం తీసుకున్న మహిళ అనివార్యకారణాల వల్ల మరణిస్తే రెండు లక్షల రూపాయల లోపు రుణాన్ని ప్రభుత్వమే చెల్లించేది. తాజాగా ప్రభుత్వం ఈ విధానాన్ని బ్యాంకు లింకేజీ ద్వారా తీసుకున్న వారికి కూడా వర్తింపచేస్తుంది.
- 92,512 మందికి ప్రయోజనం..
కుమరం భీం జిల్లా వ్యాప్తంగా 15 మండలాల్లో 8,275 స్వయం సహాయక సంఘాలకు చెందిన 92,512 వేల మంది సభ్యులు ఉన్నారు. అర్హత కలిగిన ప్రతీ మహిళ స్వయం సహాయక సంఘాల్లో చేరాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం బీమా సౌకర్యాన్ని కల్పించి ప్రోత్సహిస్తుంది. సంఘ సభ్యులు ఆర్థికంగా నిలదొక్కుకొని చిరువ్యాపారాలు చేసుకోవడానికి బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, సీఐఎఫ్, మహిళాశక్తి పథకాల ద్వారా వివిధ రకాల రుణాలు అందజేస్తున్నారు.
- 18 నుంచి 60 ఏళ్ల వయస్సు వారికి..
పొదుపు సంఘాల మహిళలు ప్రమాదవశత్తు మృతి చెందితే అలాంటి వారి కటుంబాలకు రూ. 10 లక్షల ఉచిత భీమా వర్తింపచేయనున్నారు. ఒకవేళ వందశాతం వైకల్యం కలిగినా రూ. 10 లక్షలు అందిస్తారు. 50 శాతం వైకల్యం కలిగితే రూ. 5 లక్షలు చెల్లిస్తారు. మృతి చెందిన మహిళలకు పొదుపు అప్పు ఉంటే అది కూడా మాఫీ చేస్తారు. గాయాలైన మహిళ అంగవైకల్యం తెలుపుతూ సదరం ధ్రువపత్రాలు, చికిత్స పొందిన అసుపత్రి పత్రాలు సమర్పించాలి. 18 నుంచి 60 ఏళ్ల వయసున్న పొదుపు మహిళలకు ఇది వర్తిస్తుంది.
- రుణ బీమా రూ. 2 లక్షలు
ఒక్కో సంఘానికి ఐదు లక్షల నుంచి 20 లక్షల వరకు ప్రస్తుతం రుణాలు అందిస్తున్నారు. రుణం పొందిన మహిళల్లో ఎవరైనా మరణిస్తే వడ్డీతో కలిపి ఆమె కుటుంబసభ్యులు చెల్లించాల్సి వచ్చేది. అలా చెల్లించకపోతే ఆ ప్రభావం గ్రూపు సభ్యులపై పడేది. ప్రస్తుతం పొదుపు మహిళలకు ప్రభుత్వం రూ. 2 లక్షల వరకు రుణ బీమా వర్తింపుచేస్తుంది. బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి పథకాల ద్వారా రుణం పొందిన మహిళ చనిపోతే ఆమె కట్టాల్సిన మొత్తాన్ని ప్రభుత్వం మాఫీ చేయనుంది.
- అవగాహన అవసరం
ప్రభుత్వం అమలు చేస్తున్న బీమా పథకాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ రెండు పథకాలలో అర్హత సాధించాలంటే తప్పనిసరిగా అన్ని గ్రూపులవారు నెలవారీ సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. వాటికి సంబందించిన వివరాలు మినిట్స్ పుస్తకంలో ఎప్పటికప్పుడు నమోదు చేయాలి. పొదుపు రుణం క్రమం తప్పకుండా చెల్లిస్తుండాలి. వీటి వివరాలు ఉండాలి. అయితే ఇలాంటి వాటిపై మహిళల్లో అవగాహన లేదు. రుణం పొందే సమయంలో మాత్రమే వీవోలు నమోదు చేస్తున్నారు. దీనిపై సెర్ప్, మెప్మా అధికారులు దృష్టి సారించాలి.
మహిళలకు ఎంతో ప్రయోజనం
మహేష్, ఏపీఎం, వాంకిడి
మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు రెండు రకాల బీమా సౌకర్యం కల్పించడంవల్ల ఎంతో ప్రయోజనం చేకూరనుంది. వారి కుటుంబాలకు, రుణం ఇచ్చిన బ్యాంకులకు ఆర్థిక భరోసా లభిస్తుంది. ఇంతకు ముందు స్త్రీనిధికి మాత్రమే ఉండేది. బ్యాంకు లింకేజీకి కూడా వర్తింపచేశారు. మహిళా సంఘాల సమావేశంలో సభ్యులందరికీ అధికారులు, సమాఖ్య బాధ్యులు బీమా గురించి వివరిస్తున్నారు. మహిళా సంఘాలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాము.