Share News

ప్రభుత్వ భూములకు అక్రమ పట్టాలు

ABN , Publish Date - Mar 05 , 2025 | 11:54 PM

ప్రభుత్వ భూములకు అక్రమ పట్టాలు పుట్టుకొచ్చిన ఘటన ఇటీవల దండేపల్లి మండలం అదుగుల పేటలో వెలుగు చూసింది. సర్కారు భూములను అక్రమంగా కట్టబెట్టిన అధికారులు వాటికి లావుణి పట్టాలు జారీ చేశారు. పైగా అసైన్‌మెంట్‌ కమిటీ ప్రమేయం లేకుండానే నేరుగా మండల రెవెన్యూ అధికారులు పట్టాలు జారీ చేయడం గమనార్హం.

ప్రభుత్వ భూములకు అక్రమ పట్టాలు

- దండేపల్లి మండలంలో 55 ఎకరాలు అన్యాక్రాంతం

- అక్రమంగా లావుణి పట్టాలు, పాసు పుస్తకాలు జారీ

- అసైన్‌మెంట్‌ కమిటీ ఆమోదం లేకుండానే బదలాయింపు

- ఈ తతంగం వెనుక చేతులు మారిన లక్షల రూపాయలు

మంచిర్యాల, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ భూములకు అక్రమ పట్టాలు పుట్టుకొచ్చిన ఘటన ఇటీవల దండేపల్లి మండలం అదుగుల పేటలో వెలుగు చూసింది. సర్కారు భూములను అక్రమంగా కట్టబెట్టిన అధికారులు వాటికి లావుణి పట్టాలు జారీ చేశారు. పైగా అసైన్‌మెంట్‌ కమిటీ ప్రమేయం లేకుండానే నేరుగా మండల రెవెన్యూ అధికారులు పట్టాలు జారీ చేయడం గమనార్హం. అక్రమంగా లావుణి పట్టాలు జారీ చేయడమేగాక వాటికి పాసుపుస్తకాలు కూడా పుట్టుకురావడం కొసమెరుపు. ఆ పుస్తకాల ఆధారంగా లబిదారులు లక్షల రూపాయల బ్యాంకు రుణాలు కూడా పొందడం మరో ట్విస్టు. ఈ మొత్తం వ్యవహారం వెనుక లక్షల రూపాయలు చేతులు మారినట్లు ప్రచారం జరుగుతోంది.

55 ఎకరాలు అన్యాక్రాంతం.....

దండేపల్లి మండలం అందుగులపేటలో సర్వే నంబర్లు 9, 49లో సుమారు 200 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. అందులో అసైన్‌మెంట్‌ చట్టాన్ని తుంగలో తొక్కుతూ గ్రామానికి చెందిన 50 మంది పేర్లను అక్రమంగా రికార్డుల్లో నమోదు చేసిన మండల రెవెన్యూ అధికారులు వారి పేరిట 55 ఎకరాలకు పట్టాలు జారీ చేశారు. సర్వే నంబర్‌ 9లో 28 ఎకరాలకు పట్టాలు పుట్టుకురాగా, సర్వే నంబర్‌ 49లో మరో 27 ఎకరాలు ఇతరుల పేరిట పట్టాలుగా మారాయి. సదరు భూముల ధర బహిరంగ మార్కెట్‌ విలువ ఆధారంగా ఎకరా రూ. 50 లక్షల పై చిలుకు పలుతుండగా, స్థానిక నాయకులు కొందరు సహకారంతో అధికారులు పట్టాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

ఫ అసైన్‌మెంట్‌ కమిటీ ఆమోదం లేకుండానే...

ప్రభుత్వ భూములను ఇతరుల పేరిట లావుణి పట్టాగా మార్చాలంటే అసైన్‌మెంట్‌ కమిటీ ఆమోదం ఉండాలి. రెవెన్యూ డివిజన్‌ పరిధిలో అసైన్‌మెంట్‌ కమిటీ చైర్మన్‌గా నియోజకవర్గ ఎమ్మెల్యే వ్యవహరిస్తుండగా, కన్వీనర్‌గా ఆర్డీవో, సభ్యుడిగా మండల తహసీల్దార్‌ ఉంటారు. వారి ఆమోదంతో ఎలాంటి జీవనాధారం లేని నిరుపేద వర్గాలకు చెందిన ఎస్టీ, ఎస్టీ, బీసీ కులస్థులకు నిబంధనల మేరకు ప్రభుత్వ భూములను సాగు చేసుకునేందుకు అసైన్‌ చేసే వెసులుబాటు ఉంది. అయితే ఇందుకోసం ముందుగా గ్రామంలో అర్హులుగా పేర్కొంటూ తీర్మానం చేయాల్సి ఉంటుంది. ఆ తీర్మానం ఆధారంగా అసైన్‌మెంట్‌ కమిటీ సమావేశం కావాల్సి ఉంటుంది. అసైన్‌మెంట్‌ కమిటీ చైర్మన్‌ అధ్యక్షతన సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తారు. ఆ సమావేశంలో దరఖాస్తుదారుల అర్హతలను బట్టి భూములను కేటాయిస్తారు. అయితే జిల్లాలో చివరిసారిగా 2012-13లో అసైన్‌మెంట్‌ కమిటీ సమావేశం జరిగింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఎక్కడాకూడా అసైన్‌మెంట్‌ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేయకపోగా, ప్రభుత్వ భూములకు లావుణి పట్టాలు జారీచేసే ప్రక్రియ నిలిచిపోయింది. అయినప్పటికీ రెండు, మూడు సంవత్సరాల వ్యవధిలో ఏకంగా 50 మందికి 55 ఎకరాల భూమిని పట్టాలు చేయడం గమనార్హం. ఈ పట్టాలన్నీ తహసీల్దార్‌ పేరిట జారీ కావడం కొసమెరుపు. గ్రామంలో కొందరి పేరిట అక్రమ పట్టాలు జారీకాగా, ఈ తతంగం వెనుక కొందరు నాయకుల చేతివాటం ఉందన్న ప్రచారం జరుగుతోంది. పట్టాలు జారీ అయిన లబ్ధిదారుల్లో కొందరు తమ పేర్లపైకి భూములు ఎలా వచ్చాయో తెలియదని వాదిస్తుండగా, అలా పట్టాలు పుట్టుకురావడం వెనుక ఎవరి ప్రమేయం ఉందో తేల్చాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంది. ఈ విషయంలో జిల్లా ఉన్నతాధికారులు సైతం లోతుగా ధృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

గ్రామంలో పలువురి పేరిట జారీ అయిన పట్టాల వివరాలు...

- జంబోజి కళావతి పేరిట సర్వే నంబర్‌ 9/అ/1/1/1/1/1/1/2లో రెండు ఎకరాలను 24-12-2022న లావుని పట్టా జారీ కాగా పాస్‌బుక్‌ సైతం అందజేశారు.

- కుటికేల లక్ష్మి పేరిట సర్వే నంబర్‌ 9/అ/1/1/1/1/1/1/1/1/1/1/2లో ఎకరం 24-12-2022న లావుని పట్టా జారీ అయింది.

- తీగల వెంకయ్య పేరిట సర్వే నంబర్‌ 49/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/2లో ఎకరం 01-10-2023న లావుణి పట్టా జారీ అయింది.

- పల్లె సాయక్క పేరిట సర్వే నంబర్‌ 49/1/1/1/1/1/2 లో ఎకరం భూమి 24-12-2022న లావుణి పట్టా జారీ అయింది.

- అల్లంల లక్ష్మి పేరిట సర్వే నంబర్‌ 9/అ/1/1/1/1/1/1/1/లో రెండు ఎకరాల భూమి లావుణి పట్టాగా మారింది.

- కుటికెల సూరవ్వ పేరిట సర్వే నంబర్‌ 9/అ/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/2లో ఎకరం భూమికి 06-12-2024న లావుణి పట్టా ఇచ్చారు.

- గోదర్ల భాగ్య పేరిట సర్వే నంబర్‌ 9/అ/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1 లో రెండెకరాలు 20-10-2024న పట్టా ఇచ్చారు.

- కుటికెల పద్మ పేరిట సర్వే నంబర్‌ 9/అ/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1లో రెండెకరాలు 20-10-2024న పట్టా జారీ అయింది.

విచారణ జరుపుతాం..

సంధ్యారాణి, దండేపల్లి తహసీల్దార్‌

దండేపల్లి మండలంలోని అందుగులపేటలో అక్రమంగా ప్రభుత్వ భూమికి పట్టాలు జారీ అయిన విషయం ఇప్పటిదాకా నా ధృష్టికి రాలేదు. నేను తహసీల్దార్‌గా విధుల్లో చేరినప్పటి నుంచి అధికారికంగా ఎవరికీ భూ పంపిణీ జరగలేదు. ఈ విషయాన్ని పైఅధికారుల ధృష్టికి తీసుకెళ్తాను. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.

Updated Date - Mar 05 , 2025 | 11:54 PM