Share News

ప్రజల ప్రాణాలపై ప్రభుత్వానికి పట్టింపు లేదు

ABN , Publish Date - Feb 24 , 2025 | 11:29 PM

ప్రజల ప్రాణాలపై కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పట్టింపులే దని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఆరోపించారు.

ప్రజల ప్రాణాలపై ప్రభుత్వానికి పట్టింపు లేదు
ధర్నా చేస్తున్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు

- బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

కాగజ్‌నగర్‌, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): ప్రజల ప్రాణాలపై కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పట్టింపులే దని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఆరోపించారు. సోమవారం కాగజ్‌నగర్‌ ఈసుగాం ఆలయ సమీపంలోని బ్రిడ్జి వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ సొరంగ మార్గంలో పైకప్పు కూలి ప్రమాదంలో ఎనిమిది గల్లంతైతే సీఎం ఎన్నికల ప్రచారంలో పాల్గొనటం విడ్డూరంగా ఉందన్నారు. కుమరం భీం జిల్లా కాగజ్‌నగర్‌ నుంచి ఇతర మండలాలకు వెళ్లే ప్రధాన రోడ్డుపై ఇరుకైన వంతెన వెడల్పు చేయాలని డిమాండు చేశారు. ఇరుకైన వంతెన వల్ల ప్రమాదాలు జరిగి పలువురు మృత్యువాత పడుతున్నా అధికారులు, ఎమ్మెల్యే పట్టించుకోవటం లేదన్నారు. ఎవ్మెల్సీ దండే విఠల్‌ కూడా ప్రొసీడింగ్‌లు తెస్తున్నా పనులు మాత్రం చేయటం లేదన్నారు. కేవలం నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయలు వెచ్చిస్తే బ్రిడ్జిల వెడల్పులు చేసే అవకాశం ఉందన్నారు. ఇప్పటికైనా అధికారులు, నాయకులు వెంటనే స్పందించి వంతెనలను వెడల్పు చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Updated Date - Feb 24 , 2025 | 11:29 PM