Share News

ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం

ABN , Publish Date - Feb 26 , 2025 | 11:28 PM

ఎమ్మెల్సీ ఎన్నికలకు జిల్లాలో సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్‌, ఎన్నికల అధికారి కుమార్‌ దీపక్‌ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌ కార్యాలయంలో అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌, ఆర్డీవోలు శ్రీనివాస్‌రావు, హరికృష్ణలతో కలిసి ఎన్నిక సామగ్రి పంపిణీ ప్రక్రియను పరిశీలించారు.

ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం
దండేపల్లి పోలింగ్‌ కేంద్రానికి ఎన్నికల సామగ్రితో వస్తున్న సిబ్బంది

- కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్సీ ఎన్నికలకు జిల్లాలో సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్‌, ఎన్నికల అధికారి కుమార్‌ దీపక్‌ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌ కార్యాలయంలో అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌, ఆర్డీవోలు శ్రీనివాస్‌రావు, హరికృష్ణలతో కలిసి ఎన్నిక సామగ్రి పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల పోలింగ్‌ జరుగుతుందన్నారు. ఇందుకోసం 60 మంది ప్రిసైడింగ్‌, 181మంది పోలింగ్‌ అధికారులు, 25 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించామన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో 1,904 మంది పురుషులు, 11,880 మంది మహిళలు, ఉపాధ్యాయుల ఎన్నికల్లో 999 మంది పురుషులు, 665 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. ఉపాధ్యాయ ఎన్నికల కోసం ఎనిమిది పోలింగ్‌ కేంద్రాలు, పట్టభద్రుల ఎన్నికల కోసం 40 పోలీంగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

ఓటు హక్కు వినియోగించుకోవాలి

ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశాలు, సభలు, ఊరేగింపులు జరపకూడదని తెలిపారు. ఏ రకమైన వాహనం ద్వారా ఓటరును ప్రత్యక్షం గా పరోక్షంగా పోలింగ్‌ కేంద్రానికి బయటకు తీసుకువెళ్లి ఏర్పాట్లు చేస్తే చట్టరీత్యా నేరమని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన వారందరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.

దండేపల్లి(ఆంధ్రజ్యోతి): పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం దండేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. బుధవారం సాయంత్రం మంచిర్యాల నుంచి ఎన్నికల సామగ్రితో దండేపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలో పోలింగ్‌ కేంద్రాలకు అధికారులు చేరుకున్నారు. మండలంలో 83 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉండగా, 1,848 మంది పట్టభధ్రుల ఓటర్లు ఉన్నారు. ఉపాధ్యాయుల కోసం ఒక పోలింగ్‌ కేంద్రం, పట్టభద్రుల కోసం రెండు పోలీంగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

జన్నారం (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మండల కేంద్రంలోని బాయ్స్‌ హైస్కూల్‌లో మూడు పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తహసీల్దార్‌ రాజమనోహర్‌రెడ్డి బుధవారం పోలింగ్‌ సిబ్బంది కేంద్రాలకు రావడంతో ఏర్పాట్లను పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎస్‌ఐ రాజమనోహర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Feb 26 , 2025 | 11:28 PM