‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలి
ABN , Publish Date - Feb 10 , 2025 | 11:39 PM
పదోతరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేలా ఎంఈవోలు, హెచ్‌ఎంలు కృషిచేయాలని విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి సూచించారు.

విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి
ఆసిఫాబాద్, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): పదోతరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేలా ఎంఈవోలు, హెచ్‌ఎంలు కృషిచేయాలని విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి సూచించారు. పట్టణంలోని బీఈడీ కళాశాలలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశానికి సత్యనారాయణరెడ్డి పాల్గొని మాట్లాడారు. జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలల నుంచి పదో తరగతిలో విద్యార్థులు 10 జీపీఏ సాధించేలా కృషి చేయాలన్నారు. విద్యార్థులకు నిర్వహిస్తున్న స్లిప్ టెస్టు ఫలితాలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. పాఠశాలలను జిల్లా కో ఆర్డినేటర్లు సందర్శించి విద్యార్థుల సామార్థ్యాలను పరీక్షించాలని ఆదేశించారు. సైన్స్ మెటిరీయల్ ఉపయోగించుకొని విద్యార్థులకు బోధించేలా దృష్టి సారించాలని అన్నారు. సమావేశంలో ఇన్‌చార్జి డీఈవో గామేనియల్, జిల్లా పరీక్షల సహాయ కమిషనర్ ఉదయ్‌బాబు, కో ఆర్డినేటర్లు కటకం మధుకర్, అబుద్ ఆలీ, శ్రీనివాస్, భాగ్యలక్ష్మి, ఎంఈవోలు, హెచ్‌ఎంలు పాల్గొన్నారు.