Share News

చాపకింద నీరులా డయేరియా

ABN , Publish Date - Feb 07 , 2025 | 11:20 PM

చెన్నూరు పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో డయేరియా చాపకింద నీరులా విజృంభిస్తుండడంతో ప్రజలు తీవ్రఆందోళనకు గురవుతున్నారు. పట్టణంలోని పలు కాలనీలకు చెందిన పలువురు వాంతులు, విరేచనాలతో స్ధానిక ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు.

చాపకింద నీరులా డయేరియా
చెన్నూర్‌ సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్సపొందుతున్న బాధితులు

- ఒకరి మృతి, పలువురికి తీవ్ర అస్వస్థత

- ఆసుపత్రికి పరుగులు పెడుతున్న బాధితులు

చెన్నూరు, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): చెన్నూరు పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో డయేరియా చాపకింద నీరులా విజృంభిస్తుండడంతో ప్రజలు తీవ్రఆందోళనకు గురవుతున్నారు. పట్టణంలోని పలు కాలనీలకు చెందిన పలువురు వాంతులు, విరేచనాలతో స్ధానిక ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో సామాజిక ఆరోగ్య కేంద్రంలో 67 డయేరియా కేసులు నమోదైనట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. కాగా పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ, పట్టణ ప్రాంతమైన మంచిర్యాలకు పలువురు డయేరియాతో బాధపడుతూ చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

- వారం రోజుల వ్యవధిలో 67 కేసులు

వారం రోజుల వ్యవధిలో చెన్నూరు సామాజిక ఆరోగ్యకేంద్రం లో 67 కేసులు నమోదైనట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ సత్యనారాయణ పేర్కొన్నారు. ఈనెల 1న ఎనిమిది మంది, 2న ఏడుగురు, 3న 13 మంది, 4న ఎనిమిది మంది, 5న 16 మంది, 6న 12 మంది, శుక్రవారం మూడు కేసులు నమోదైనట్లు ఆయన తెలిపారు.

- డయేరియాతో ఒకరు మృతి

పట్టణంలోని జగన్నాఽథస్వామి ఆలయ వీధికి చెందిన చొక్కారపు రవీందర్‌ (55) డయేరియాతో బాధపడుతూ ఈ నెల 4న మృతి చెందాడు. కుటుంబీకుల కథనం ప్రకారం.. మూడు రోజులు వాంతులు, విరేచనాలతో బాధపడుతూ ఇంట్లోనే చికిత్స పొందినట్లు తెలిపారు. మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా చికిత్స పొందుతూ అదేరోజు మృతిచెందినట్లు తెలిపారు.

- కలుషిత నీరే కారణం..

పట్టణానికి సరఫరా అయ్యే మంచినీరు కలుషితం కావడం వల్లనే డయేరియా ప్రబలినట్లు పట్టణ ప్రజలు పేర్కొంటున్నారు. పట్టణానికి సమీపంలోని బతుకమ్మ వాగు నుంచి పట్టణంలోని పలు కాలనీలకు తాగునీరు సరఫరా జరుగుతోంది. అయితే కొన్ని ప్రాంతాలకు మాత్రం మిషన్‌ బగీరథ పథకం ద్వారా తాగునీరు సరఫరా జరుగుతోంది. భగీరధ పథకం ద్వారా సరఫరా అయ్యే నీరు స్వచ్ఛంగా లేకపోవడంతో నీటిని ఎవరూ తాగడానికి వినియోగించడం లేదు. బతుకమ్మ వాగు ద్వారా అక్కడి పంప్‌ హౌజ్‌ నుంచి వచ్చే ప్రధాన పైపులైన్‌కు అమర్చిన కుళాయిల ద్వారా వచ్చే కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సరఫరా జరుగుతుంది. పట్టణంలోని బట్టిగూడెం, జెండవాడ, సొన్నాయిల వీది, లైన్‌గడ్డ, శివాలయం వీధి, కోటబొగడ, మంగలి బజార్‌ తదితర ప్రాంతాల్లో బతుకమ్మ వాగు ద్వారా సరఫరా చేసే ప్రధాన పైపులైన్లకు నల్లాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోని వారే అధికంగా వాంతులు, విరేచనాలతో బాధపడుతూ ఆసుపత్రుల్లో చేరుతుండడం ఆందోళన కలిగిస్తోంది. బతుకమ్మ వాగు సంప్‌ హౌజ్‌ వద్ద ఫిల్టర్‌ బెడ్‌ లేకపోవడంతో ఆనీరు కలుషితమై సరఫరా జరుగుతుందేమోనన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈనీటిని తాగిన స్ధానికులు వాంతులు, విరేచనాలకు గురవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

మెరుగైన వైద్యం అందించాలి

- ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి

చెన్నూరు, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): డయేరియాతో బాధపడుతున్న రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి సూచించారు. శుక్రవారం పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని పలు కాలనీల్లో నీరు కలుషితం కావడం వల్లనే డయేరియా ప్రబలింద న్నారు. కాలనీ వాసులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని మున్సిపాలిటీ అధికారులను కోరారు. వ్యాధినివారణకు ప్రత్యేకచర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. పట్టణంలోని అన్ని కాలనీల్లో అమృత్‌ పథకం ద్వారా నీటిని అందించేందుకు కృషి చేస్తానన్నారు. ఆయన వెంట కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఉన్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

జిల్లా వైద్యాధికారి హరీష్‌రాజ్‌

చెన్నూరు పట్టణంలో డయేరియా ప్రబలుతున్న దృష్య్టా పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి హరీష్‌రాజ్‌ సూచించారు. శుక్రవారం చెన్నూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో మున్సిపల్‌, శానిటేషన్‌, ఇరిగేషన్‌, వైద్య సిబ్బందితో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ డయేరియా విజృంభణపై అన్ని శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. సామాజిక ఆరోగ్యకేంద్రానికి రోజుకు ఆరు నుంచి 10 కేసులు వస్తున్నాయన్నారు. ఇప్పటివరకు సామాజిక ఆరోగ్యకేంద్రం ఆసుపత్రిలో 67 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. ప్రజలు వేడి చేసి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని సూచించారు. నీరు కలుషితం వల్లనే డయేరియా ప్రబలుతుందని పేర్కొన్నారు. డయేరియాకు గురైన వారు వెంటనే ఆసుపత్రికి రావాలని ఎక్కువగా ఓఆర్‌ఎస్‌ తీసుకోవాలని సూచించారు. బతుకమ్మ వాగు సంప్‌ హౌజ్‌ నుంచి వచ్చే మంచినీటిని పరీక్షల నిమిత్తం వరంగల్‌ ల్యాబ్‌కు పంపించినట్లు ఆయన తెలిపారు. పరీక్షల అనంతరం పూర్తి సమాచారం ఇస్తామన్నారు. బతుకమ్మ వాగు, మిషన్‌ భగీరథ నీటి సరఫరాను వెంటనే నిలిపివేయాలని మున్సిపల్‌ అధికారులకు సూచించారు. వైద్య సిబ్బంది, అంగన్‌వాడీ టీచర్లు, తదితర శాఖలతో ఇంటింటికి ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లును పంపిణీ చేస్తామన్నారు. చెన్నూరు పట్టణంలో 22 వాటర్‌ ప్లాంట్లు ఉన్నాయన్నారు. ఈ ప్లాంట్‌లను తనిఖీ చేయాలని శానిటేషన్‌ అధికారులకు సూచించారు. ఆ నీటిని కూడా పరీక్షల నిమిత్తం వరంగల్‌ల్యాబ్‌కు పంపాలని ఆదేశించారు. ఆసుపత్రిలో అన్ని మందులు సిద్ధంగా ఉన్నాయన్నారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటి డీఎంహెచ్‌వో అమృత, సూపరిండెండెంట్‌ సత్యనారాయణ, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 07 , 2025 | 11:20 PM