‘ఉపాధి’లో పొలం బాటల అభివృద్ధి
ABN , Publish Date - Feb 10 , 2025 | 11:44 PM
జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో రైతుల పొలాల్లో బాటలను అభివృద్ధి చేసేందుకు గ్రామీణాభివృద్ధిశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది.

- కాలిబాటలను దారులుగా మార్చేందుకు నిధుల కేటాయింపు
- రైతుల పనులకూ ప్రాధాన్యం
వాంకిడి, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో రైతుల పొలాల్లో బాటలను అభివృద్ధి చేసేందుకు గ్రామీణాభివృద్ధిశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీంతో అనేక సంవత్సరాలుగా పొలాల్లో రాకపోకలకు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తీరనున్నాయి. గతంలో నక్షా బాటలు, పూర్వ కాలం నుంచి బండ్ల బాటలు ఉన్న ప్రాంతాల్లో రహదారులను బాగుచేయగా.. తాజాగా రైతులకు ఉపయోగపడే పనులు చేపట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేస్తోంది. మార్చి నెలాఖరులోగా ఈ పనులను పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. వీటిలో జల సంరక్షణ పనులతో పాటు రైతులు తమ పొలాలలకు వెళ్లేందుకు ఉన్న కాలినడక బాటలను బాగు చేసేందుకు చర్యలు చేపట్టారు.
- కిలో మీటర్‌కు రూ. 10 లక్షలు
రైతుల పొలాల మధ్య ఉన్న కాలిబాటలను దారులుగా మార్చేందుకు ఉపాధిహామీ పథకంలో కిలో మీటరుకు 10 లక్షలరూపాయల చొప్పున నిధులను కేటాయించనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ఆ నిధులను వెచ్చించేందుకు పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు జిల్లాలోని ఆసిఫాబాద్, సిర్పూర్(టీ) నియోజన వర్గాల్లో రైతుల అంగీకారం మేరకు పొలం బాట పనులు చేపట్టనున్నారు.
- రైతులకు ఉపయోగపడేలా..
రైతులకు ఉపయోగపడేలా పశువుల షెడ్లు, ఆజోల్లా పెంపకం, వర్మీ కంపోస్టు తయారీ పనులు, జలనిధి ద్వారా చెక్‌డ్యాంల నిర్మాణం, ఇంకుడు గుంతలు, వ్యవసాయ బావులు, వర్షం నీటిని ఒడిసిపట్టే నిర్మాణాలు చేపట్టనున్నారు. పొలాల బాటలను బాగు చేయడానికి ప్రతీ నియోజకవర్గంలో ప్రత్యేక నిధులు వెచ్చించనున్నారు. తమ ఆవాసాల నుంచి పొలాలకు చేరుకునేందుకు రైతులు సరైన రహదారి లేక ఒడ్డు, గట్ల మధ్య నడిచి వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు, బోరు మోటార్లు, పైపులు తదితర సామగ్రిని పొలాల వద్దకు మోసుకెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు. వర్షాకాలంలో వారి కష్టాలు వర్ణనాతీతం. ప్రభుత్వం పొలాలకు బాటలను బాగు చేసేందుకు ప్రత్యేక నిధులు కేటాయించడంతో రైతుల్లో హర్షం వ్యక్తం అవుతోంది.
- రైతులు సద్వినియోగం చేసుకోవాలి
ఈజీఎస్ ఏపీవో శ్రావణ్
ప్రభుత్వం నిర్ణయంతో పొలాలకు కాలిబాటల్లో వెళ్లే రైతుల ఇబ్బందులు తీరుతాయి. పొలాల మధ్య నుంచి తమ బావుల వద్దకు, ఇతర పనుల నిమిత్తం వెళ్లే రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. రైతుల అంగీకారంతో పొలం బాటల పనులు చేపడుతాము. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
ఉమ్మడి జిల్లా వివరాలు
జిల్లా మండలాలు పంచాయతీలు జాబ్‌కార్డులు కూలీలు
ఆదిలాబాద్ 17 468 1,75,747 3,70,082
కుమరంభీం 15 335 1,29,885 2,77,287
నిర్మల్ 18 396 1,80,572 3,70,550
మంచిర్యాల 16 311 1,21,067 2,55,151