Driver Revenge: పనిలోంచి తీసేశారన్న కోపంతో కిడ్నాప్
ABN , Publish Date - Jun 21 , 2025 | 04:12 AM
ఆదిలాబాద్ డీసీసీబీ డైరెక్టర్ కిడ్నాప్, హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. తనను పనిలో నుంచి తీసివేసినందుకు.. అతడి వద్ద పనిచేస్తున్న డ్రైవరే పగ పెంచుకొని కిడ్నా్‌పకు పాల్పడినట్లు తేల్చారు.
ఆదిలాబాద్ డీసీసీబీ డైరెక్టర్ కిడ్నాప్‌లో డ్రైవరే నిందితుడు
నిర్మల్ రూరల్, జూన్ 20: ఆదిలాబాద్ డీసీసీబీ డైరెక్టర్ కిడ్నాప్, హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. తనను పనిలో నుంచి తీసివేసినందుకు.. అతడి వద్ద పనిచేస్తున్న డ్రైవరే పగ పెంచుకొని కిడ్నా్‌పకు పాల్పడినట్లు తేల్చారు. ఎస్పీ జానకీ షర్మిల వెల్లడించిన వివరాల ప్రకారం.. మామాడ మండలం పొన్కల్ గ్రామానికి చెందిన చిక్యాల హరీశ్ కుమార్ ఉమ్మడి ఆదిలాబాద్ డీసీసీబీ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఇదే గ్రామానికి చెందిన షేక్ హైదర్ పదేళ్ల క్రితం హరీశ్ వద్ద కారు డ్రైవర్‌గా పని చేశాడు. హైదర్ ప్రవర్తన, పని తీరు నచ్చకపోవడంతో ఆరు నెలలకే అతడిని హరీశ్ పనిలోంచి తీసేశాడు. హరీశ్‌పై కోపం, పగ పెంచుకున్న హైదర్.. అతడిని కిడ్నాప్ చేసి, డబ్బు రాబట్టాలని పథకం వేశాడు.
ఇందుకు తన మిత్రులు పొన్కల్‌కు చెందిన మధుసూదన్, ఏపీకి చెందిన బాణాల ప్రిన్స్, తట్టూరి రవి, కలకంటి సురేశ్, గూడె కోటేశ్వరరావు సహకారం తీసుకున్నాడు. ఈనెల 15న రాత్రి హరీశ్ ఇంట్లో ఒక్కడే ఉండటంతో లోపలికి ప్రవేశించి అతడి చేతులు, కాళ్లు కట్టేశారు. బాధితుడిని అతడి కారులోనే ఎక్కించుకొని హైదరాబాద్‌వైపు వెళ్లారు. కారులోనే బాధితుడిని కత్తులతో బెదిరిస్తూ, అతడి బంధువులకు ఫోన్లు చేయించి, రూ. 3 కోట్లు డిమాండ్ చేశారు. కాగా మనోహరాబాద్ టోల్‌ప్లాజా వద్ద.. హరీశ్ కారులో నుంచి బయటికి దూకి తప్పించుకున్నారు. ఘటనపై ఫిర్యాదు రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆరుగురు నిందితులను పట్టుకున్నారు.