Corruption: ఇందిరమ్మ ఇంటి బిల్లుకు రూ.15 వేలు లంచం పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
ABN , Publish Date - Aug 20 , 2025 | 04:05 AM
సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో లంచం కోసం డిమాండ్ చేసిన ఒక అధికారి, ఇద్దరు ప్రభుత్వోద్యోగులు మంగళవారం ఏసీబీ వలలో చిక్కుకోగా, ఒక పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్‌కు గురయ్యారు.
సూర్యాపేట కలెక్టర్ ఉత్తర్వుల జారీ
ఉత్తమ్ ఆగ్రహం.. ఏసీబీలో కేసు నమోదుకు ఆదేశం
పాలకవీడు/ ఆమనగల్లు/ తాండూరు, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో లంచం కోసం డిమాండ్ చేసిన ఒక అధికారి, ఇద్దరు ప్రభుత్వోద్యోగులు మంగళవారం ఏసీబీ వలలో చిక్కుకోగా, ఒక పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్‌కు గురయ్యారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలో ఇందిరమ్మ ఇల్లు పైలట్ గ్రామంగా ఎంపికైన జాన్ పహాడ్‌లో లబ్ధిదారుల్లో పూర్తయిన ఒకరి ఇంటి బిల్లులు మంజూరు చేయడానికి 2 దఫాల్లో రూ.15 వేలు ఇవ్వాలని కార్యదర్శి వెంకయ్య డిమాండ్ చేసిన ఆడియో సోమవారం సోషల్ మీడియాలో వైరలైంది. దీనిపై హౌసింగ్ పీడీ సిద్ధార్థ, డీఈ జబ్బార్ అహ్మద్, పాలకవీడు ఎంపీడీఓ లక్ష్మి మంగళవారం చేపట్టిన విచారణలో పంచాయతీ శివారు కొత్త తండాలో ముగ్గురు లబ్ధిదారుల నుంచి రూ.20 వేల చొప్పున రూ.60 వేలు లంచం తీసుకున్నట్లు గుర్తించారు. వారి నివేదిక మేరకు కార్యదర్శి వెంకయ్యను కలెక్టర్ తేజస్ నందలాల్‌కు మంగళవారం సస్పెండ్ చేయడంతోపాటు గ్రామం వదిలి వెళ్లరాదని ఆదేశించారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. సదరు కార్యదర్శిపై ఏసీబీలో కేసు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఇక రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలంలోని ఓ గ్రామ రైతు తన పట్టాదారు పాస్ పుస్తకంలో జెండర్ సవరణకు తహసీల్దార్ సీహెచ్ లలితకు గత నెల 29న రూ.50 వేలు సమర్పించుకున్నా పని కాలేదు.
మరోమారు మళ్లీ తహసీల్దార్ సరిత, సర్వేయర్ కోట రవిలను సంప్రదిస్తే చెరో రూ.50 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు డబ్బు డిమాండ్ చేసిన తహసీల్దార్, సర్వేయర్ ఫోన్ సంభాషణలను రికార్డు చేసి, ఏసీబీ అధికారులకు అందజేశాడు. దీంతో ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ బృందం ఆమనగల్లు తహసీల్దార్ కార్యాలయంలో తనిఖీలు చేసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు తహసీల్దార్ సరిత, సర్వేయర్ రవిలను అరెస్టు చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరు మునిసిపాలిటీ పరిధిలో ఒక షెడ్డుకు ఇంటి నంబర్ ఇవ్వడానికి ఈర్షద్ అనే వ్యక్తి నుంచి సీనియర్ అసిస్టెంట్‌గా ఉన్న ఆర్‌ఐ రమేశ్ రూ.20 వేలు డిమాండ్ చేశాడు. చివరకు రూ.15 వేలకు అంగీకరించాడు. దీనిపై బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో వారి సూచన మేరకు మంగళవారం రమేశ్‌కు రూ.15 వేలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇంటి నంబర్ల కేటాయింపునకు డిమాండ్ చేసిన డబ్బులో మునిసిపల్ కమిషనర్‌కూ వాటా ఇవ్వాలని తనతో రమేశ్ చెప్పినట్లు బాధితుడు మీడియాకు చెప్పారు. ఏసీబీ అధికారులు వచ్చే వరకూ కార్యాలయంలోనే ఉన్న మునిసిపల్ కమిషనర్ విక్రం సింహారెడ్డి బయటకెళ్లిపోయారు. రికార్డులను పరిశీలించడానికి ఏసీబీ అధికారులు ఫోన్ చేసినా, ఇంటికి పోలీసులను పంపినా అందుబాటులోకి రాలేదు.