Biotechnology: బయోటెక్నాలజీ రంగంలో అపార అవకాశాలు
ABN , Publish Date - Aug 10 , 2025 | 04:52 AM
బయోటెక్నాలజీ రంగం భారత దేశాన్ని ఫ్యూచర్ రెడీ ఇండియాగా నిలుపుతుందని..
భారత్‌ను తీర్చిదిద్దడంలో విద్యార్థులే కీలకం: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
ఎన్‌ఐఏబీ శాస్త్రవేత్తల ఐదు విప్లవాత్మక సాంకేతిక పరిజ్ఞానాల ఆవిష్కరణ
దేశంలోనే మొట్టమొదటి ‘జంతు మూలకణాల బయో బ్యాంక్’ ప్రారంభం
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): బయోటెక్నాలజీ రంగం భారత దేశాన్ని ‘ఫ్యూచర్ రెడీ ఇండియా’గా నిలుపుతుందని.. నేటి యువతకు ఆ రంగంలో అపార అవకాశాలు ఉన్నాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. గచ్చిబౌలిలోని ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ (ఎన్‌ఐఏబీ) సంస్థ అభివృద్ధి చేసిన ఐదు కిట్‌లను శనివారం ఆయన జాతికి అంకితం చేశారు. దేశంలోనే తొలి జంతు మూలకణాల బయో బ్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. ఎన్‌ఐఏబీ ఆవిష్కరణలు రైతులకు మేలుచేస్తాయని ఆశిస్తున్నట్టు తెలిపారు. పశువుల ఉత్పాదకత మెరుగుపడడంతోపాటు రైతుల జీవనోపాధికి భరోసా కల్పించడంలోనూ ఇవి తోడ్పతుతాయని భావిస్తున్నట్టు చెప్పారు. అందుబాటు ధరల్లో ఉండే ఈ ఆవిష్కరణలు పశువుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అత్యంత కీలకపాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. జునోటిక్ (జంతువుల నుంచి సంక్రమించే) వ్యాధులతో పోరాడేందుకు ఈ తరహా పరిశోధనలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. విద్యార్థులను దేశ భవిష్యత్తుగా పేర్కొన్న ఆయన.. దేశాన్ని తీర్చిదిద్దడంలో వారిదే కీలకపాత్ర అని స్పష్టం చేశారు. అలాగే.. విద్యార్థులకు డిజిటల్ హెల్త్‌లో మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అనంతరం ఆయన రైతులతో మాట్లాడారు. పొదుగు వాపు వ్యాధి బారిన పడుతున్న పశువులను గుర్తించడం కోసం ప్రత్యేకంగా క్యాంప్‌లను చేయాలని రైతులు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో.. ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని ఎన్‌ఐఏబీ డైరెక్టర్‌కు సూచించారు. కాగా.. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రత్యేకమైన సంస్థ ఎన్‌ఐఏబీ అని కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సెక్రటరీ, బీఆర్‌ఐసీ డీజీ రాజేశ్ ఎస్ గోఖలే అన్నారు. తమ ఇన్‌స్టిట్యూట్ ప్రస్థానంలో తాజా ఆవిష్కరణలు కీలక మైలురాయిగా నిలుస్తాయని ఎన్‌ఐఏబీ డైరెక్టర్ తరు శర్మ అన్నారు.
ఆ 5 ఆవిష్కరణలు..
పశువుల్లో కనిపించే పలు వ్యాధులను ముందుగానే గుర్తించేందుకు, పాల నాణ్యత మెరుగుపరిచేందుకు, వాటికి ఏవైనా వ్యాధులు వచ్చినప్పుడు ఉపయోగించాల్సిన యాంటీ బయాటిక్‌లను గురించి తెలిపే కిట్‌లను ఎన్‌ఐఏబీ శాస్త్రజ్ఞులు శనివారం విడుదల చేశారు. వాటి పూర్తి వివరాలు..

టీకా తీసుకోని పశువుల్ని గుర్తించే.. బ్రూ డివా
డాక్టర్ గిరీష్ రాధాకృష్ణన్ బృందం ఎనిమిదేళ్ల పాటు కష్టపడి అభివృద్ధి చేసిన ఈ కిట్‌తో... బ్రూసెల్లోసిస్ వ్యాక్సిన్ తీసుకున్న పశువులు, తీసుకోని పశువులను వేరు చేయడం సాధ్యమవుతుంది. బ్రూసెల్లోసిస్ అనేది బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి. పశువుల నుంచి మనుషులకు సంక్రమించే బ్యాక్టీరియా ఇది. సాధారణంగా బ్రూసెల్లోసిస్ టీకాలను ఆరు-ఎనిమిది నెలల వయసున్న దూడలకు వేస్తారు. ఆ తరువాత వ్యాక్సిన్ వేసినా ఫలితాలు తక్కువగా ఉంటాయి. ఈ టీకా తీసుకున్న, తీసుకోని పశువులకు తదతనంతర కాలంలో పరీక్షిస్తే, రెండింటికీ పాజిటివ్ అనే పరీక్షలు చూపుతాయి. అలా కాకుండా ఈ పశువులను టీకా తీసుకున్న/తీసుకోని వాటిగా వేరు చేయాలంటే బ్రూ డివా కిట్ తోడ్పడుతుంది. ఒక్క రక్తపు చుక్క లేదంటే పాల చుక్క ద్వారా ఈ వ్యాక్సిన్ తీసుకున్న పశువులు, తీసుకోని పశువు ఏదో కనిపెట్టవచ్చు. ఖర్చు కేవలం 50 రూపాయలు!
గోండి పరాన్నజీవిని గుర్తించే కిట్
రక్తం లేదంటే ప్లాస్మా, సీరమ్‌లో యాంటీ టోక్సోప్లాస్మా గోండి యాంటీబాడీ్‌సను కనుగొనేందుకు రూపొందించిన కిట్.. టోక్సో ర్యాపిడ్ యాంటీబాడీ డిటెక్షన్ కిట్ ఇది. పశువులతో పాటు మనుషులకు కూడా వ్యాపించే గోండి పరాన్నజీవి ఒక్కొసారి ప్రాణాంతకం కావొచ్చు. దీనివల్ల పశువులు, మనుషుల్లో గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంది. ప్రధానంగా పిల్లులు వాటి నుంచి ఇతర క్షీరదాలకు వ్యాప్తి చెందే అవకాశంఉంది. ఈ కిట్‌తో 10 నిమిషాల్లోనే ఫలితాలను పొందవచ్చు. ఈ కిట్‌ను డాక్టర్ అభిజీత్ దేశ్‌ముఖ్ బృందం తయారుచేసింది.
జబ్బు పడ్డ పశువుకు ఏ మందు వేయాలో చెప్పే.. క్యూర్ చెక్
పశువులు జబ్బు పడినప్పుడు.. తొలుత ఒక యాంటీ బయాటిక్ వాడడం, తగ్గకపోతే మరో యాంటీ బయాటిక్ వాడటం వల్ల యాంటీ బయాటిక్ రెసిస్టెన్స్ పెరిగే ప్రమాదం ఉంది. ఇండియాలో మనుషులకే కాదు పశువులకూ ఇది ఓ సమస్యగానే ఉందిప్పుడు. ఆ సమస్యకు పరిష్కారమే క్యూర్ చెక్ కిట్. ఈ కిట్‌తో కేవలం రెండు గంటలలో ఫలితాలను తెలుసుకుని, సరైన యాంటీ బయాటిక్ మందును పశువుకు అందించవచ్చు. పరీక్ష ఖరీదు 50 రూపాయల్లోపే ఉంటుంది. దీనిని కూడా పంకజ్ సుమన్, బృందమే రూపొందించింది.
జపనీస్ ఎన్‌సెఫలైటి్‌సను గుర్తించే.. ర్యాపిచెక్స్
డాక్టర్ సోను గాంధీ బృందం తయారుచేసిన ఈ కిట్ ద్వారా.. జపనీస్ ఎన్‌సెఫలైటి్‌స వైర్‌సను కనుగొనడం సాధ్యమవుతుంది. ఈ జపనీస్ ఎన్‌సెఫలైటి్‌స వైరస్ పందుల నుంచి దోమల ద్వారా మనుషులకు వ్యాపించి, మెదడువాపు వ్యాధికి కారణమవుతుంది.
పొదుగువాపు వ్యాధిని గుర్తించే.. అడర్ కేర్
పశువులలో పొదుగు వాపు వ్యాధి (మస్టైటి్‌స)ని కనుగొనేందుకు ఉపయోగంచే కిట్. పశువులకు పొదుగు వాపు వ్యాధి వస్తే.. పాల రంగు మారడం, పాలు నిల్వ ఉండకపోవడం, చెడువాసన వంటి లక్షణాల ద్వారా రైతులు ఆ విషయాన్ని తెలుసుకుంటారు. అయితే ఆ స్థితికి వచ్చేసరికి పశువు పొదుగులో బ్యాక్టీరియా గణనీయంగా పెరిగిపోతుంది. దీనివల్ల పాల దిగుబడి తగ్గడంతో పాటుగా నాణ్యత కూడా గణనీయంగా తగ్గిపోతుంది. పశువుతో పాటుగా రైతుకూ నష్టం కలుగుతుంది. అలా కాకుండా.. పొదుగు వాపు వ్యాధిని ముందగానే గుర్తించే కిట్ అడర్ కేర్. కేవలం 20-50 రూపాయల ఖర్చుతో ఈ పరీక్షను రైతులే స్వయంగా చేసుకునే అవకాశం ఉంది. ఈ కిట్‌ను ఇప్పటికే పలు డెయిరీ ఫార్మ్‌లు పరీక్షించి సంతృప్తిని వ్యక్తం చేశాయి. ఈ కిట్‌ను డాక్టర్ పంకజ్ సుమన్ బృందం ఐదేళ్ల పాటు కష్టపడి రూపొందించింది.