Hayathnagar: ప్రేమ పేరిట ఇంటర్ విద్యార్థి వేధింపులు
ABN , Publish Date - May 07 , 2025 | 04:27 AM
హయత్‌నగర్‌లో ప్రేమ పేరిట ఇంటర్ విద్యార్థి వేధింపులు తాళలేక 9వ తరగతి బాలిక మీనాక్షి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన తల్లిదండ్రులను కలిచివేసింది.
తొమ్మిదో తరగతి బాలిక ఆత్మహత్య !
హయత్‌నగర్, మే 6 (ఆంధ్రజ్యోతి): ప్రేమ పేరిట ఓ ఇంటర్ విద్యార్థి చేస్తున్న వేధింపులు తాళలేక ఓ తొమ్మిదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తన ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. హైదరాబాద్, హయత్‌నగర్‌లో ఈ ఘటన జరగ్గా.. సదరు ఇంటర్ విద్యార్థితోపాటు అతడి తమ్ముడిపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు, బాలిక తండ్రి కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లాకు చెందిన కనిగిరి విజయ్ హయత్‌నగర్‌లోని ఓ కాలనీలో పదేళ్లుగా కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విజయ్ రెండో కుమార్తె మీనాక్షి(14)ని తమ కాలనీకే చెందిన ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి పానుబోతు రోహిత్ (19) ఆరు నెలలుగా ప్రేమ పేరిట వేధిస్తున్నాడు. మీనాక్షి ద్వారా విషయం తెలుసుకున్న విజయ్.. రోహిత్ కుటుంబాన్ని కలిసి వారికి ఫిర్యాదు చేశాడు. అయితే, రోహిత్ తన తమ్ముడు నూతన్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి మీనాక్షికి శనివారం ప్రేమ సందేశాలు పంపాడు. ఈ విషయం తెలిసి ఇదేమని ప్రశ్నించగా.. రోహిత్ తండ్రి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో విజయ్ ఆదివారం హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, బావమరది మరణించడంతో విజయ్, తన భార్యతో కలిసి సోమవారం ఉదయం మహబూబ్‌నగర్ జిల్లా మానాజీపేట్ వెళ్లి రాత్రి 11 గంటలకు తిరిగి ఇంటికి చేరుకున్నాడు. సోమవారం సాయంత్రం రోహిత్ ఇంటికి వచ్చి ప్రేమించాలని తనని బెదిరించాడని మీనాక్షి తల్లిదండ్రులకు చెప్పి కంటతడి పెట్టుకుంది. ఉదయాన్నే మాట్లాడదామని విజయ్ నచ్చచెప్పగా అందరూ నిద్రించారు. అయితే, విజయ్ భార్య మంగళవారం ఉదయం నిద్రలేచి చూసేసరికి మీనాక్షి.. ఇంట్లో ఉరి వేసుకుని కనిపించింది. రోహిత్ వేధింపుల వల్లే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని, రోహిత్, అతని సోదరుడు నూతన్‌పై చర్యలు తీసుకోవాలని విజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీనాక్షి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.