Share News

Inter exams: 96.63% హాజరు

ABN , Publish Date - Mar 06 , 2025 | 04:59 AM

7,010 మంది గైర్హాజరయ్యారని ఇంటర్‌ విద్య కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. హన్మకొండ, వరంగల్‌ జిల్లాలో రెండు మాల్‌ ప్రాక్టీస్‌ కేసులు నమోదయ్యాయని ఆయన బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Inter exams: 96.63% హాజరు

ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షకు

17,010 మంది విద్యార్థుల గైర్హాజరు

హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌..

వందలాది మంది ఆలస్యంగా కేంద్రాలకు

పలుచోట్ల పరీక్ష రాయకుండానే వెనక్కి

నేటి నుంచి సెకండియర్‌ పరీక్షలు

హైదరాబాద్‌, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1,532 కేంద్రాల్లో నిర్వహించిన ద్వితీయ భాష (పేపర్‌-1)పరీక్షకు 96.63 శాతం హాజరయ్యారు. మొత్తం 5,14,184 మంది పరీక్షకు దరఖాస్తు చేసుకోగా 4,96,899 మంది హాజరయ్యారని, 17,010 మంది గైర్హాజరయ్యారని ఇంటర్‌ విద్య కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. హన్మకొండ, వరంగల్‌ జిల్లాలో రెండు మాల్‌ ప్రాక్టీస్‌ కేసులు నమోదయ్యాయని ఆయన బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు హైదరాబాద్‌ నుంచి అన్ని జిల్లాలకు ప్రత్యేక పరిశీలకులను పంపామన్నారు. పరీక్షల ఏర్పాట్లను కృష్ణ ఆదిత్య స్వయంగా పరిశీలించారు. హైదరాబాద్‌లోని పలు పరీక్షా కేంద్రాలను ఆయన బుధవారం ఉదయం తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలు చేయగా, అన్నిచోట్లా పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ఇక, హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ జామ్‌తో వందల సంఖ్యలో విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోలేకపోయారు.

gh.jpg

కొన్నిచోట్ల ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన వారిని అనుమతించగా, గేట్లు మూసేయడంతో ఆపై ఆలస్యంగా వచ్చిన వారు వెనుదిరగాల్సి వచ్చింది. కాగా, ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. 4,40,788 రెగ్యులర్‌, 67,735 ప్రైవేటు విద్యార్థులు కలిపి మొత్తం 5,08,523 విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు.


కళాశాల నిర్వాకంతో పరీక్ష రాయలేకపోయిన విద్యార్థి

వికారాబాద్‌ జిల్లా పరిగిలో ఫీజు చెల్లించలేదంటూ ఓ విద్యార్థికి కళాశాల యాజమాన్యం హాల్‌ టికెట్‌ ఇవ్వలేదు. చివరికి బుధవారం ఉదయం ఫీజు చెల్లించిన తర్వాత హాల్‌ టికెట్‌ ఇచ్చినా.. విద్యార్థి పరీక్షా కేంద్రానికి చేరుకునే సరికి 20 నిమిషాలు ఆలస్యం కావడంతో నిర్వాహకులు లోపలికి అనుమతించలేదు.

పొరపాటున మరో కేంద్రానికి.. విద్యార్థికి ఎస్సై సాయం

నిర్మల్‌ జిల్లా ముథోల్‌లో ఓ ఇంటర్‌ విద్యార్థి తనకు కేటాయించిన పరీక్షా కేంద్రానికి వెళ్లాల్సి ఉండగా.. పొరపాటున మరో కేంద్రానికి వెళ్లాడు. అసలు పరీక్షా కేంద్రం కిలోమీటర్‌ దూరం ఉండడంతో ఆందోళనతో పరుగు ప్రారంభించాడు. విద్యార్థి ఇబ్బందిని గమనించిన ముథోల్‌ ఎస్సై సంజీవ్‌ ఆ విద్యార్థిని పోలీసు వాహనంలో ఆ కేంద్రానికి సకాలంలో చేర్చడంతో పరీక్ష రాయగలిగాడు.

తండ్రి సహకారంతో పరీక్షకు..

నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడకు చెందిన దివ్యాంగురాలు శివానీని ఆమె తండ్రి సత్యనారాయణ మర్రిగూడలోని పరీక్షాకేంద్రానికి ఎత్తుకుని తీసుకురాగా పరీక్ష రాసింది. కుమార్తె అభ్యున్నతికి తండ్రి పడుతున్న తపనను పలువురు అభినందించారు.


ఇవి కూడా చదవండి

Uttarakhand: ఉత్తరాఖండ్ ఘటనలో నలుగురు మృత్యువాత.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

Parvesh Verma: తీహార్ నుంచి ఇక ఆయన తిరిగి రాకపోవచ్చు.. కేజ్రీవాల్‌ అవినీతిపై పర్వేష్ వర్మ

Congress: కేరళ కాంగ్రెస్‌ నేతల భేటీకి థరూర్‌

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 06 , 2025 | 05:00 AM