Cyber Crime: తాతను ఏం ‘మాయ’ చేశావే!
ABN , Publish Date - Aug 22 , 2025 | 04:24 AM
హైదరాబాద్‌కు చెందిన ఓ 81 ఏళ్ల వృద్ధుడు సైబర్ నేరగాళ్లు వేసిన వలపు వల ‘మాయ’లో పడి రూ.7.11 లక్షలు పోగొట్టుకున్నాడు.
81 ఏళ్ల వృద్ధుడిపైవలపువల
7.11 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌కు చెందిన ఓ 81 ఏళ్ల వృద్ధుడు సైబర్ నేరగాళ్లు వేసిన వలపు వల ‘మాయ’లో పడి రూ.7.11 లక్షలు పోగొట్టుకున్నాడు. గుర్తు తెలియని నంబర్ నుంచి వాట్సాప్ కాల్ చేసి తన పేరు మాయ అని పరిచయం చేసుకున్న యువతి తియ్యటి మాటలకు బోల్తా పడి జేబులు ఖాళీ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించి హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ డీసీపీ ధార కవిత తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని అమీర్‌పేటకు చెందిన వృద్ధుడి(81) వాట్సా్‌పకు జూన్ మొదటి వారంలో గుర్తు తెలియని నంబర్ నుంచి కాల్, మెసేజ్‌లు వచ్చాయి. వృద్ధుడు ఆ కాల్‌కు స్పందించగా.. అవతతి వైపు ఓ అమ్మాయి మాట్లాడింది. మృదువైన గొంతు, తియ్యటి మాటలతో వృద్ధుడిని ఆకట్టుకుంది.
తన పేరు మాయా రాజ్‌పుత్ అని పరిచయం చేసుకున్న ఆ యువతి.. ప్రేమగా మాట్లాడుతూ వృద్ధుడిని తన మాయలో పడేసింది. కొద్దిరోజుల తర్వాత తన కష్టాలు చెప్పుకుని బాధపడుతూ వృద్ధుడిని ఆర్థిక సాయం అడగడం ప్రారంభించింది. ఆస్పత్రి ఖర్చులు, తనఖా పెట్టిన ఆభరణాలు విడిపించడం, ప్లాట్ రిజిస్ట్రేషన్, గృహోపకరణాలు, ఎలకా్ట్రనిక్ వస్తువులు కొనుగోలు ఇలా రకరకాల కారణాలు చెప్పి వృద్ధుడి నుంచి విడతల వారీగా రూ.7.11 లక్షలు తీసుకుంది. వృద్ధుడు ఆ డబ్బులు తిరిగి వసూలు చేసే ప్రయత్నం చేయగా.. ‘మాయ రాజ్‌పుత్’ మాయమైపోయింది. దీంతో మోసపోయానని ఆలస్యంగా గ్రహించిన బాధిత వృద్ధుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు దర్యాప్తులో ఉంది.