Share News

Khammam: వేర్వేరు ఘటనల్లో కిచిడీ తిని.. 64 మంది విద్యార్థినులకు అస్వస్థత

ABN , Publish Date - Aug 05 , 2025 | 04:31 AM

వేర్వేరు ఘటనల్లో కిచిడీ తిన్న 64 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఖమ్మం జిల్లా కల్లూరు గిరిజన ఆశ్రమ వసతి గృహం, భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం కొర్కిశాలలోని కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి.

Khammam: వేర్వేరు ఘటనల్లో కిచిడీ తిని.. 64 మంది విద్యార్థినులకు అస్వస్థత

  • ఖమ్మం జిల్లా కల్లూరులో 37 మందికి ఫుడ్‌పాయిజన్‌

  • భూపాలపల్లి కేజీబీవీలో మరో 27 మందికి అస్వస్థత

కల్లూరు, భూపాలపల్లిటౌన్‌, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): వేర్వేరు ఘటనల్లో కిచిడీ తిన్న 64 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఖమ్మం జిల్లా కల్లూరు గిరిజన ఆశ్రమ వసతి గృహం, భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం కొర్కిశాలలోని కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. కల్లూరు గిరిజన ఆశ్రమ వసతి గృహంలో మొత్తం 86 మంది విద్యార్థినుల్లో సోమవారం ఉదయం అల్పాహారంగా కిచిడీ తిన్న 37 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి, వికారం, వాంతులు, శ్వాస ఇబ్బందులనెదుర్కొన్నారు. ఉపాధ్యాయులు, స్థానిక కాంగ్రెస్‌ నాయకులు వారిని ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యుల చికిత్సతో వారంతా కోలుకున్నారు. ఈ సమాచారం అందుకున్న కల్లూరు డివిజన్‌ సబ్‌-కలెక్టర్‌ అజయ్‌యాదవ్‌ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు.


పాఠశాలలో రెండ్రోజులు వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తామని వైద్యాధికారి నవ్యకాంత్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. కాగా.. సమాచారం అందుకుని, ఆస్పత్రికి చేరుకున్న సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్‌ మట్టా రాగమయి.. స్వయంగా స్టెతస్కో్‌పతో విద్యార్థినులను పరీక్షించారు. వసతి గృహంలో ఆహారాన్ని పరిశీలించి, సంక్షేమ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. భూపాలపల్లి జిల్లా కొర్కిశాల కేజీబీవీలోనూ కిచిడీ తిన్న 27 మంది బాలికలు సోమవారం ఉదయం వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్‌ సిబ్బంది వారిని అంబులెన్స్‌ల సాయంతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా, పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో చిట్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి హాస్టల్‌కు చేరుకుని వివరాలను సేకరించారు. హాస్టల్‌ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిట్యాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పరామర్శించారు.

Updated Date - Aug 05 , 2025 | 04:31 AM