Share News

Engineering Admissions: 44,553 మందికి నచ్చలే!

ABN , Publish Date - Jul 17 , 2025 | 04:20 AM

ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఎప్‌సెట్‌ మొదటివిడత కౌన్సెలింగ్‌ కొనసాగుతోంది. గత నెల 28 నుంచి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం కాగా ధ్రువీకరణ పత్రాల పరిశీలన అనంతరం ఆప్షన్లు ఇచ్చే ప్రక్రియ ఇటీవలే ముగిసింది.

Engineering Admissions: 44,553 మందికి నచ్చలే!

  • ఇంజనీరింగ్‌లో ఆప్షన్లు మార్చుకున్న 58ు మంది

  • రేపు మొదటి విడత తుది జాబితా విడుదల

హైదరాబాద్‌, జూలై 16 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఎప్‌సెట్‌ మొదటివిడత కౌన్సెలింగ్‌ కొనసాగుతోంది. గత నెల 28 నుంచి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం కాగా ధ్రువీకరణ పత్రాల పరిశీలన అనంతరం ఆప్షన్లు ఇచ్చే ప్రక్రియ ఇటీవలే ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 95,256 మంది ధ్రువీకరణ పత్రాల పరిశీలన ముగిసింది. 94,354 మంది తమకు నచ్చిన కళాశాల, కోర్సులకు సంబంధించిన ఆప్షన్లు ఇచ్చారు. అయితే ప్రతి ఏడాది ఆప్షన్ల ప్రక్రియ ముగిసిన అనంతరం సీట్ల కేటాయింపు ఉంటుండగా.. ఈ సారి సీట్ల కేటాయింపునకు ముందే మాక్‌ అలాట్‌మెంట్‌ (ఆప్షన్ల మార్పు)కు అవకాశమిచ్చారు. విద్యార్థులు తమకు నచ్చిన కళాశాల, అనుకున్న బ్రాంచీలో సీటు దక్కకపోతే వెంటనే ఆప్షన్‌ మార్చుకోవచ్చు. ఈ నూతన విధానాన్ని తొలిసారిగా ఈ ఏడాది నుంచే అమలు చేస్తున్నారు. తమకు నచ్చిన చోట సీటు దక్కకపోతే విద్యార్థులు కళాశాలల్లో చేరట్లేదు.


దాంతో ఈ నూతన విధానాన్ని ప్రారంభించారు. తొలిసారి ప్రారంభించిన ఈ విధానంలో దాదాపు సగం మంది తమకు కేటాయించిన సీట్లను మార్చుకున్నారు. మాక్‌ ఆలాట్‌మెంట్‌లో భాగంగా ఈ నెల 12న 77,154 మందికి సీట్లు కేటాయించారు. మార్పులు చేర్పులకు ఈ నెల 15 వరకు అవకాశమిచ్చారు. గడువు పూర్తయ్యే నాటికి 44,553 మంది వారికి కేటాయించిన సీటుపై అసంతృప్తితో ఇతర ఆప్షన్లు ఇచ్చారు. అంటే సీట్లు పొందిన వారిలో 58 శాతం మంది వారికి కేటాయించిన సీటుతో సంతృప్తిగా లేరని స్పష్టమవుతోంది. తుది కేటాయింపు జాబితాను సాంకేతిక విద్యాశాఖ ఈ నెల 18న విడుదల చేయనుంది. అయితే మాక్‌ అలాట్‌మెంట్‌లో ఇప్పటికే సీటు దక్కించుకుని.. ఎలాంటి ఆప్షన్లు ఇవ్వనివారి సీట్లు కూడా మారే అవకాశాలున్నాయి.

Updated Date - Jul 17 , 2025 | 04:20 AM