Share News

Crime Investigation: గొంతు కోసి ఐదేళ్ల బాలిక దారుణ హత్య

ABN , Publish Date - Jul 06 , 2025 | 05:05 AM

అభం శుభం తెలియని ఐదేళ్ల బాలికను గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఆడుకునేందుకు సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన ఆమె.. అదే కాలనీలోని మరొకరి ఇంటి బాత్రూంలో రక్తపు మడుగులో శవమై కనిపించింది.

Crime Investigation: గొంతు కోసి ఐదేళ్ల బాలిక దారుణ హత్య

  • జగిత్యాల జిల్లా కోరుట్లలో ఘటన..

కోరుట్ల, జూలై 5 (ఆంధ్రజ్యోతి): అభం శుభం తెలియని ఐదేళ్ల బాలికను గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఆడుకునేందుకు సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన ఆమె.. అదే కాలనీలోని మరొకరి ఇంటి బాత్రూంలో రక్తపు మడుగులో శవమై కనిపించింది. శనివారం జగిత్యాల జిల్లా కోరుట్లలో చోటుచేసుకున్న ఈ ఘటన సంచలనం రేపింది. పోలీసుల వివరాల మేరకు.. ఆదర్శనగర్‌లో నివాసముంటున్న ఆకుల రాములు-నవీన దంపతులకు కుమారుడు వేదాస్‌, కూతురు హితిక్ష(5) ఉన్నారు. రాములు ఉపాధి నిమిత్తం కొద్దిరోజుల కింద గల్ఫ్‌కు వెళ్లగా నవీన అత్తామామలతోనే ఉంటోంది. సాయంత్రం కాలనీకి చెందిన పిల్లలతో హితిక్ష ఆడుకుంటూ కనిపించకుండాపోయింది.


దీంతో చుట్టుపక్కల వెతికిన హితిక్ష బంధువులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ నేపథ్యంలోనే స్థానికుల సాయంతో పోలీసులు వెతుకుతుండగా.. అదే కాలనీలోని కొడుపల్లి విజయ్‌ అనే వ్యక్తి ఇంటి బాత్రూంలో హితిక్ష రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గుర్తించారు. హుటాహుటిన బాలికను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విజయ్‌ ఇంట్లో హితిక్ష రక్తపు మడుగులో పడి ఉండడంతో అతడే హత్య చేసి ఉంటాడని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విజయ్‌కు ఇంటి యజమాని ఫోన్‌ చేయగా తాను వరంగల్‌ జిల్లా నర్సంపేటలో ఉన్నానని చెప్పినట్లు సమాచారం. సంఘటనా స్థలాన్ని ఎస్పీ అశోక్‌కుమార్‌ పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jul 06 , 2025 | 05:05 AM