POLYCET: పాలిసెట్ తొలివిడత కేటాయింపులో 18,984 సీట్ల భర్తీ
ABN , Publish Date - Jul 16 , 2025 | 05:25 AM
పాలిసెట్ అభ్యర్థులకు తొలివిడత సీట్లను సాంకేతిక విద్యాశాఖ అధికారులు ఎట్టకేలకు కేటాయించారు.
హైదరాబాద్ సిటీ, జూలై 15 (ఆంధ్రజ్యోతి): పాలిసెట్ అభ్యర్థులకు తొలివిడత సీట్లను సాంకేతిక విద్యాశాఖ అధికారులు ఎట్టకేలకు కేటాయించారు. ఈనెల 4లోపే సీట్ల కేటాయింపు జరగాల్సి ఉండగా, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆలస్యమయింది. షెడ్యూల్ ప్రకారం సీట్ల కేటాయింపు జరగకపోవడంపై అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. దీంతో గత బుధవారం తొలివిడత సీట్లను కేటాయించిన అధికారులు తుదివిడత కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో మార్పులు చేశారు. మొదటి కౌన్సెలింగ్‌కు హాజరుకాని అభ్యర్థులకు ఈనెల 23 నుంచి రిజిస్ట్రేషన్లు, 24న ధ్రువపత్రాల పరిశీలన, 25 లోగా వెబ్ ఆప్షన్లు, 28న సీట్ల కేటాయింపు ఉంటుందని అధికారులు ప్రకటించారు. తుదివిడత కౌన్సెలింగ్ అనంతరం అభ్యర్థులు తమకు సీటు లభించిన కళాశాలల్లో ఈనెల 30లోగా రిపోర్టు చేయాలని సూచించారు. 31నుంచి ఫస్టియర్ తరగతులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఆపై ఆగస్టు 2 నుంచి పాలిటెక్నిక్‌లలో చేరిన అభ్యర్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ ఉంటుందని, మిగిలిపోయిన సీట్ల భర్తీ కోసం ఆగస్టు 5 నుంచి 11వరకు స్పాట్ అడ్మిషన్ల పక్రియను నిర్వహిస్తామని వెల్లడించారు. పాలిసెట్ తొలివిడత సీట్ల కేటాయింపు అనంతరం వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో 10,012 సీట్లు మిగిలి పోయాయి. రాష్ట్రంలోని 115 పాలిటెక్నిక్‌లలో మొత్తం 28,996 సీట్లు ఉండగా 18,984 (65.50 శాతం) సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తం 59 ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో 11,455 మందికి, 56 ప్రైవేటు పాలిటెక్నిక్‌లలో 7,529 మందికి సీట్లు లభించాయి.