Share News

School exams: నేటి నుంచి టెన్త్‌ పరీక్షలు

ABN , Publish Date - Mar 21 , 2025 | 03:33 AM

రాష్ట్రంలో శుక్రవారం నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షల నిర్వహణకు 2,650 కేంద్రాలు ఏర్పాటు చేశామని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవీ నరసింహారెడ్డి తెలిపారు.

School exams: నేటి నుంచి టెన్త్‌ పరీక్షలు

  • హాజరుకానున్న 5,09,403 మంది విద్యార్థులు

  • అందుబాటులో 5 నిమిషాల గ్రేస్‌ పీరియడ్‌

హైదరాబాద్‌, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో శుక్రవారం నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షల నిర్వహణకు 2,650 కేంద్రాలు ఏర్పాటు చేశామని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవీ నరసింహారెడ్డి తెలిపారు. ఈ పరీక్షలకు 5,09,403 మంది విద్యార్థులు హాజరుకానుండగా, వారిలో 2,58,895 మంది బాలురు, 2,50,508 మంది బాలికలు ఉన్నారు. పరీక్షా కేంద్రాల్లో తలెత్తే సమస్యలు, విద్యార్ధుల విజ్ఞప్తుల స్వకరణకు జిల్లా, రాష్ట్రస్థాయిలో 24 గంటలూ పని చేసే కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశామని ఈవీ నరసింహా రెడ్డి చెప్పారు. ప్రతి రోజూ ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభం అవుతుందని, విద్యార్ధులకు ఐదు నిమిషాల గ్రేస్‌ పీరియడ్‌ కేటాయించినట్లు వెల్లడించారు. సజావుగా పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.


పరీక్షల విధుల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 28,100 మంది ఇన్విజిలేటర్లు, 2,650 మంది చీఫ్‌ సూపరింటెండెంట్‌లు, 2,650 మంది శాఖ అధికారులను నియమించామని తెలిపారు. శుక్రవారం నుంచి పరీక్షలు ప్రారంభం కానుండటంతో గురువారం సికింద్రాబాద్‌లోని సెయింట్‌ పీటర్స్‌ హైస్కూల్‌ను పాఠశాల విద్య సంచాలకులు ఈవీ నరసింహారెడ్డి, ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు కృష్ణారెడ్డి, హైదరాబాద్‌ డీఈఓ రోహిణి సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు.

Updated Date - Mar 21 , 2025 | 03:33 AM