Password Security: 16 బిలియన్ లాగిన్ వివరాలు లీక్.. మీరు సేఫ్‌గా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ABN , Publish Date - Jun 22 , 2025 | 01:53 PM
భారీ స్థాయిలో లాగిన్ క్రెడెన్షియల్స్ లీకైనట్టు వార్తల నడుమ యూజర్లు తమ లాగిన్ వివరాలు జాగ్రత్త చేసుకునేందుకు సైబర్ భద్రత నిపుణులు కొన్ని టిప్స్‌ను సూచిస్తున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: వివిధ దేశాల్లోని యూజర్లకు చెందిన 16 బిలియన్ లాగిన్ వివరాలు బహిర్గతమయ్యాయన్న వార్త ప్రస్తుతం సైబర్ ప్రపంచంలో కలకలం రేపుతోంది. గూగుల్, యాపిల్ నుంచి టెలిగ్రామ్ వరకూ వివిధ యాప్‌ల యూజర్ల వివరాలు ఇందులో ఉండటంపై సైబర్ సెక్యూరిటీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, గూగుల్‌పై నేరుగా సైబర్ దాడి జరిగినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. ఇన్‌ఫోస్టీలర్ అనే మాల్‌వేర్ బారినపడ్డ డివైజ్‌ల నుంచి ఈ డాటాను సేకరించినట్టు సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. ఇవన్నీ బహిరంగ వేదికల్లో అందుబాటులో ఉండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో యూజర్లు తమ డాటాను ఎలా భద్రత పరుచుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం.
మీ అకౌంట్‌ను భద్రంగా పెట్టుకోవాలంటే వెంటనే పాత పాస్‌వర్డ్ స్థానంలో కొత్త పాస్‌వర్డ్‌ను ఎంచుకోవాలి. నమ్మకమైన పాస్‌వర్డ్ మేనేజర్ సాఫ్ట్‌వేర్‌లు సూచించిన వాటిని ఎంచుకుంటే భద్రతకు ఢోకా ఉండదు.
మీ అకౌంట్‌లకు సంబంధించి టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఉంటే వెంటనే యాక్టివేట్ చేసుకోవాలి. ఇది సైబర్ దాడుల నుంచి అదనపు రక్షణ కల్పిస్తుంది.
గూగుల్ అకౌంట్‌లోని సెక్యూరిటీ సెట్టింగ్స్‌లోకి వెళ్లి తెలియని డివైజుల్లో అకౌంట్ లాగిన్‌లో ఉందేమో చెక్ చేసుకోవాలి. అలా ఉంటే వెంటనే ఆయా డివైజ్‌ల నుంచి లాగౌట్ కావాలి.
ప్రస్తుతం లీకైన యూజర్ డాటాలో సెషన్ టోకెన్స్, కుకీలు కూడా ఉన్నాయని అంటున్నారు. కాబట్టి మీ బ్రౌజర్ నుంచి కుకీలను వెంటనే డిలీట్ చేయాలి.
గూగుల్ అకౌంట్ యాక్టివిటీపై నిత్యం కన్నేసి ఉంచాలి. రీసెంట్ సెక్యూరిటీ ఈవెంట్స్ పేజీలోని లాగిన్ వివరాలను తరచూ చెక్ చేస్తూ ఉండాలి. తేడా ఏమైనా ఉంటే వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
మాల్‌వేర్, యాంటీవైరస్ స్కాన్‌లు రన్ చేసి ఇన్ఫోస్టీలర్ గనక ఉంటే వెంటనే తొలగించాలి.
భవిష్యత్తులో ఇలాంటి వాటి బారినపడకుండా ఉండేందుకు ఈ జాగ్రత్తలను కొనసాగిస్తూ ఉంటే ఎలాంటి ఇబ్బందీ తలెత్తదని నిపుణులు భరోసా ఇస్తున్నారు. మరి మీరూ ఈ జాగ్రత్తలను వెంటనే పాటించండి.
ఇవి కూడా చదవండి:
చార్జర్‌ను స్విచ్ బోర్డులో అలాగే వదిలేస్తే ఏమవుతుందో తెలుసా
విదేశీ మహిళ ముందు పరువు పోగొట్టుకున్న భారతీయ పురుషులు.. వైరల్ వీడియో
Read Latest and Technology News