Jeedimetla Fake Constable Arrest: నకిలీ పోలీసుగా మారిన యువతి.. కానిస్టేబుల్ పరీక్షలో విఫలమయ్యాక..
ABN , Publish Date - Nov 22 , 2025 | 04:43 PM
పోలీసు ఉద్యోగంపై మోజుతో ఓ యువతి తన జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుంది. కానిస్టేబుల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయిన ఆమె చివరకు నకిలీ కానిస్టేబుల్‌గా మారి పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది.
ఇంటర్నెట్ డెస్క్: పోటీ పరీక్షల్లో వైఫల్యాలు సహజం. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోతే మళ్లీ ప్రయత్నించాలి. లక్ష్యం చేరుకునే వరకూ ప్రయాణం కొనసాగించాలి. ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే వారికి ఈ దృఢచిత్తం మరింత అవసరం. ఇక ఓటమి తప్పనప్పుడు పరిస్థితులతో రాజీ పడాలి. అంతేకానీ, పక్కదారి మాత్రం పట్టకూడదు. కానీ జీడిమెట్లకు చెందిన ఓ యువతి సరిగ్గా ఇదే తప్పు చేసి తన జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుంది (Fake Constable Arrest - Jeedimetla).
స్థానిక షాపూర్‌నగర్‌కు చెందిన ఉమాభారతి(21) అనే యువతి నకిలీ కానిస్టేబుల్‌గా మారి పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. ఆమె డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. ఉమాభారతికి కానిస్టేబుల్ కావాలని ఉన్నా పరీక్షలో మాత్రం నెగ్గలేకపోయిందని పోలీసులు తెలిపారు. అయితే, పోలీసు ఉద్యోగంపై ఉన్న మోజు కారణంగా ఆమె నకిలీ కానిస్టేబుల్ అవతారం ఎత్తింది. ఖాకీ డ్రెస్ వేసుకుని పోలీసులా నటిస్తూ ఎవరికీ అనుమానం రాకుండా డ్యూటీలు కూడా చేయడం ప్రారంభించింది. వీఐపీ మీటింగ్‌లు, సెక్రటేరియట్, హైదరాబాద్ సీపీ ఆఫీసుల్లో మీటింగులకు సైతం హాజరయ్యింది. అయితే ఈ ఆటలు ఎక్కువ కాలం సాగలేదు.
శుక్రవారం సైబరాబాద్ సీపీ ఆఫీసు క్యాంటీన్‌లో ఉమాభారతి టిఫిన్ తింటూ ఉన్నతాధికారుల కంట పడింది. వారికి యువతి వాలకం అనుమానాస్పదంగా కనిపించడంతో చివరకు ఆమె బండారం బయటపడింది. మాదాపూర్ పోలీసులు నిందితురాలిని అరెస్టు చేసి జీడిమెట్ల పోలీసులకు అప్పగించారు. ప్రభుత్వ పోటీ పరీక్షలు మళ్లీ రాసేందుకు అన్ని అర్హతలు ఉన్నా యువతి ఇలా పక్కదారి పట్టడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
ఇవి కూడా చదవండి...
రూ.6 లక్షలకు శిశువు విక్రయం.. కరీంనగర్‌లో దారుణం
సైబర్ నేరాలపై అవగాహన, అప్రమత్తత ఉండాల్సిందే: సీపీ సజ్జనార్
Read Latest Telangana News And Telugu News