Virat Kohli Closer To 100 Centuries: 100 అందేనా
ABN , Publish Date - Dec 05 , 2025 | 06:38 AM
దక్షిణాఫ్రికాపై రెండు వన్డేలలో వరుసగా రెండు సెంచరీలు బాదిన విరాట్ కోహ్లీ మళ్లీ తన పూర్వపు రోజుల్ని గుర్తు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ స్టార్ బ్యాటర్‌కు సంబంధించి దేశ క్రికెట్‌లో పెద్ద చర్చ నడుస్తోంది. అది..
మరో 16 శతకాల దూరంలో విరాట్
దక్షిణాఫ్రికాపై రెండు వన్డేలలో వరుసగా రెండు సెంచరీలు బాదిన విరాట్ కోహ్లీ మళ్లీ తన పూర్వపు రోజుల్ని గుర్తు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ స్టార్ బ్యాటర్‌కు సంబంధించి దేశ క్రికెట్‌లో పెద్ద చర్చ నడుస్తోంది. అది..విరాట్ శతకాల ‘సెంచరీ’ చేస్తాడా అని! 37 ఏళ్ల కోహ్లీ సఫారీలపై రెండు శతకాలను (135, 102) కూడా మంచి స్ట్రయిక్ రేట్‌తో సాధించాడు. ఇటీవలి కాలంలో అతడి స్ట్రయిక్ రేట్‌పై విమర్శలు వ్యక్తమవుతున్న తరుణంలో..వాటిని తిప్పికొడుతూ వేగంగా పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికాపై రెండో వన్డేలో సెంచరీ..విరాట్ కెరీర్‌లో 84వది. తాజా ఫామ్ 2016-17లో కోహ్లీ అద్భుత ప్రదర్శన రోజులను జ్ఞప్తికి తెస్తోంది. దీంతో అన్ని ఫార్మాట్లలో కలిపి సచిన్ చేసిన వంద శతకాల రికార్డును అతడు చేరుకోవడం సాధ్యం కావచ్చేమోనన్న చర్చ జరుగుతోంది. వన్డే వరల్డ్ కప్ 2027 అక్టోబరు-నవంబరులో దక్షిణాఫ్రికాలో జరగనుంది. ఇదే ఫిట్‌నె్‌సను కాపాడుకుంటూ, క్రమం తప్పకుండా జట్టుకు ఎంపికైతే కనుక మెగా టోర్నీకి ముందు కోహ్లీకి మరో 25 వన్డేలు ఆడే అవకాశం లభిస్తుంది.
ఆ దిశగా
అడుగులు..
వన్డే ప్రపంచ కప్ నాటికీ ఇదే ఫామ్‌ను కొనసాగించాలనే పట్టుదలతో విరాట్ ఉన్నాడు. దాంతో విజయ్ హజారే ట్రోఫీ వన్డే టోర్నమెంట్‌లో ఆడాలని అతడు నిర్ణయించుకున్నాడు. ఈ నిర్ణయాన్ని క్రికెట్ పండితులు స్వాగతిస్తున్నారు. బెంగళూరులో జరిగే మూడు మ్యాచ్‌ల్లో ఢిల్లీకి కోహ్లీ ఆడనున్నట్టు సమాచారం.
ఆత్మవిశ్వాసం రెండింతలు..
ఇటీవలి కాలంలో పెద్దగా ఫామ్‌లో లేని విరాట్‌కు..సఫారీలపై చేసిన రెండు సెంచరీలు అతడిలో ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపజేశాయి. కోహ్లీ గత రికార్డులను పరిశీలిస్తే ప్రతి 5-6 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లో ఒక శతకం సాధించాడు. కొన్ని సంవత్సరాల్లో అయితే ఆ రికార్డు మరింత మెరుగ్గా ఉండడం విశేషం. కానీ వయస్సు, కొన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లే ఆడడం వల్ల కొంతకాలంగా అతడి శతకాల నిష్పత్తి తగ్గింది. పైగా టెస్టులు, టీ20లనుంచి ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక్కడి నుంచి..ప్రతి 4, 5 ఇన్నింగ్స్‌కు ఒకటి చొప్పున సెంచరీ కొట్టే రేట్‌ను కనుక విరాట్ కొనసాగిస్తే..12-16 శతకాలు సాధించేందుకు కనీసం 50-60 మ్యాచ్‌లు అవసరమవుతాయి..కానీ 2027 వన్డే వరల్డ్ కప్‌తో కలిపి కోహ్లీ కొంచెం అటూఇటూగా 36 మ్యాచ్‌లు మాత్రమే ఆడే చా న్సుంది. ఈ కోణంలో చూస్తే కోహ్లీ 2027 నాటికి వంద శతకాలు చేసే చాన్సులు దాదాపు కనిపించడం లేదు. అయితే పైన పేర్కొన్న మ్యాచ్‌ల కన్నా ఎక్కువ ఆడడంతోపాటు అత్యధిక సెంచరీల రేటు కలిగిన 2016-17 నాటి ఫామ్‌ను అందుకొంటే కోహ్లీ శతకాల ‘సెంచరీ’కి చేరువ అయ్యే అవకాశాలు లేకపోలేదు. కానీ వన్డే వరల్డ్‌కప్ తర్వాత కోహ్లీ రిటైరవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి
'తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం'.. వెంకయ్యనాయిడు కీలక వ్యాఖ్యలు!
పదవి పోయిన తర్వాత ఏపీలో ఎన్ని రోజులు ఉన్నావ్ జగన్: అనిత
Read Latest AP News And Telugu News