Share News

టెస్టు ముగించాడు

ABN , Publish Date - May 13 , 2025 | 05:54 AM

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీ్‌సకు ముందు భారత క్రికెట్‌లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రపంచ క్రికెట్‌లో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పిన స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ తనకెంతో ఇష్టమైన టెస్టులకు రిటైర్మెంట్‌...

టెస్టు ముగించాడు

14 ఏళ్ల సంప్రదాయ క్రికెట్‌ కెరీర్‌కు వీడ్కోలు

బీసీసీఐ విజ్ఞప్తి బేఖాతరు

  • ఇక వన్డేలకే పరిమితం

  • వారం వ్యవధిలో ఇద్దరు దిగ్గజాల నిష్క్రమణ

ఊహాగానాలే నిజమయ్యాయి.. హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌ నుంచి ఇంకా తేరుకోకముందే భారత క్రికెట్‌ ప్రేమికులకు మరో పిడుగులాంటి వార్త. ఏదైతే జరగకూడదని కోట్లాది మంది క్రికెట్‌ ప్రేమికులు భావించారో అదే జరిగింది. దశాబ్దానికి పైగా భారత క్రికెట్‌కు టార్చ్‌బేరర్‌గా ఉన్న విరాట్‌ కోహ్లీ టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. బీసీసీఐతో పాటు సెలెక్టర్లు, మాజీలు, విశ్లేషకులు ఇలా ఎంత మంది వారించినా తన మనస్సాక్షికే ఓటేశాడు. ఆధునిక క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాడిగా పేరు తెచ్చుకున్న కింగ్‌ కోహ్లీ ఇక వన్డేలకే పరిమితం. భారత క్రికెట్‌కు మూలస్తంభాల్లాంటి ఇద్దరు స్టార్లు వారం వ్యవధిలోనే టెస్టు జట్టును వీడడం నిజంగా టీమిండియా కెరీర్‌లో ఓ శకం ముగిసినట్టే..

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీ్‌సకు ముందు భారత క్రికెట్‌లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రపంచ క్రికెట్‌లో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పిన స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ తనకెంతో ఇష్టమైన టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఈమేరకు సోమవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగంతో కూడిన పోస్ట్‌ పెట్టాడు. గతేడాది టీ20 ప్రపంచక్‌పను గెలిచాక పొట్టి ఫార్మాట్‌ నుంచి వైదొలిగిన 36 ఏళ్ల కోహ్లీ ఇక వన్డేలకు మాత్రమే అందుబాటులో ఉంటాడు. ఈనెల 7న కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సైతం ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రోజే విరాట్‌ సైతం ఇదే బాట పడతాడనే కథనాలు రావడంతో అంతా షాక్‌కు గురయ్యారు. కఠినంగా సాగే ఇంగ్లండ్‌ పర్యటనలో ఇద్దరు అనుభవజ్ఞులు లేకపోతే ఎలా? అనే ఆందోళన బీసీసీఐలోనూ కనిపించింది. దీంతో వెంటనే అతడిని బుజ్జగించే ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. అయినా తను తిరస్కరించడంతో సచిన్‌ను కూడా రంగంలోకి దింపినట్టు తెలిసింది. అయితే ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా విరాట్‌ తాను అనుకున్నదానికే కట్టుబడి సంచలన నిర్ణయాన్ని ప్రకటించాడు. కొంతకాలంగా అతడి టెస్టు కెరీర్‌ అంత సాఫీగా సాగడం లేదు. గతేడాది ఆస్ర్టేలియా పర్యటనలో విరాట్‌ 9 ఇన్నింగ్స్‌లో చేసింది 190 పరుగులే. అంతేకాకుండా ఇందులో ఎనిమిదిసార్లు ఆఫ్‌సైడ్‌ ఆవల బంతులకే అవుట్‌ కావడంతో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆ సమయంలోనే అతడి మనస్సులో రిటైర్మెంట్‌ ఆలోచన వచ్చి ఉండవచ్చు. యువ ఆటగాళ్లకు దారి ఇవ్వాల్సిన తరుణం ఆసన్నమైందనే భావన అతడిలో వ్యక్తమైందేమో. కానీ భారత టెస్టు జట్టు అతడి ఆధ్వర్యంలో 68 మ్యాచ్‌ల్లో 40 విజయాలు అందుకున్న విషయం మాత్రం చరిత్ర మరువదు. అంతేకాకుండా సేన (ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌) దేశాలపై విరాట్‌ అద్వితీయ సెంచరీలు అభిమానుల జ్ఞాపకాల్లో ఎన్నటికీ ఉండిపోయేవే..


ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని

ఊహించలేదు..

‘టెస్టు క్రికెట్‌లో నీలి రంగు క్యాప్‌ను ధరించి 14 ఏళ్లయ్యింది. నిజానికి ఈ ఫార్మాట్‌లో ఇంతకాలం కొనసాగుతానని నేనెప్పుడూ అనుకోలేదు. ఇది నన్నెంతగానో పరీక్షించింది. తీర్చిదిద్దింది. జీవితానికి సరిపడా పాఠాలను కూడా నేర్పింది. వ్యక్తిగత జీవితంలోనూ నేను వాటిని కొనసాగిస్తాను. తెలుపు రంగు జెర్సీలో ఆడడం వ్యక్తిగతంగా నాకెంతో ప్రత్యేకమైంది. ఈ క్రమంలో ఎదురైన నిశ్శబ్దకర పరిస్థితులు.. సుదీర్ఘ రోజులు.. ఎవరికీ కనిపించని చిన్న చిన్న మధుర క్షణాలు కూడా జీవితాంతం గుర్తుండిపోతాయి. ఇక ఈ ఫార్మాట్‌ నుంచి తప్పుకోవడం నాకంత సులువుగా ఏమీ అనిపించలేదు. కానీ ఇదే సరైన సమయం. ఆట కోసం సర్వస్వాన్నీ ధారపోశాను. తిరిగి క్రికెట్‌ కూడా నేను ఆశించినదానికంటే ఎక్కువే ఇచ్చింది. అందుకే ఎనలేని సంతృప్తి, కృతజ్ఞతాభావంతోనే వైదొలుగుతున్నాను. క్రికెట్‌కు, సహచర ఆటగాళ్లకు, ఈ నా ప్రయాణాన్ని సుదీర్ఘ కాలం కొనసాగేలా చేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే నా టెస్టు కెరీర్‌ను ఎప్పుడూ చిరునవ్వుతోనే చూసుకోగలను...ఇక ఉంటా’

విరాట్‌ కోహ్లీ

టెస్ట్‌ కెరీర్‌

మ్యాచ్‌లు ఇన్నింగ్స్‌ పరుగులు అత్యధికం సెంచరీలు అ.సెం సగటు

123 210 9230 254 30 31 46.8

ఇవి కూడా చదవండి..

AP SSC Supplimentary Exams hall tickets: టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల

Operation Sindoor: మళ్లీ అడ్డంగా దొరికిన పాక్..

Operation Sindoor: పాక్ ఎయిర్ బేస్‌ల ధ్వంసం.. వీడియోలు విడుదల

Operation Sindoor: పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టాం: ఎయిర్ మార్షల్ ఎ.కె. భార్తీ

For Sports News And Telugu News

Updated Date - May 13 , 2025 | 05:54 AM