Share News

Tilak Varmas Heroic Knock: విజయ తిలకం

ABN , Publish Date - Sep 29 , 2025 | 02:40 AM

ఇది కదా అసలు సిసలు మజా అంటే.. ఆసియాకప్‌ ఫైనల్లోనూ దాయాది పాకిస్థాన్‌ ప్రత్యర్థిగా నిలిచిన వేళ.. ముచ్చటగా మూడోసారీ టీమిండియా తిరుగులేని పంచ్‌ ఇస్తుంటే.. అంతకు మించిన ఆనందం భారత...

Tilak Varmas Heroic Knock: విజయ తిలకం

తిలక్‌ వర్మ వీరోచిత పోరాటం

భారత్‌ ఖాతాలో ఆసియాకప్‌

విశేషంగా రాణించిన స్పిన్నర్లు

ఇది కదా అసలు సిసలు మజా అంటే.. ఆసియాకప్‌ ఫైనల్లోనూ దాయాది పాకిస్థాన్‌ ప్రత్యర్థిగా నిలిచిన వేళ.. ముచ్చటగా మూడోసారీ టీమిండియా తిరుగులేని పంచ్‌ ఇస్తుంటే.. అంతకు మించిన ఆనందం భారత క్రీడాభిమానికేముంటుంది. అయితే 146 పరుగుల స్వల్ప ఛేదనలో సూర్య సేన ఓ దశలో 20/3 స్కోరుతో కష్టాల్లో పడింది. ఈ దెబ్బకు అందరికీ ఫలితంపై ఏ మూలో సందేహం. కీలక ఫైనల్లో తడబాటు తప్పదా? అనిపించింది. కానీ క్లిష్టంగా మారిన పిచ్‌పై తెలుగు తేజం తిలక్‌ వర్మ చూపిన తెగింపు వహ్వా అనిపించక మానదు. ఆఖరి ఓవర్‌ వరకు పట్టుదలగా నిలిచిన తను భారత్‌ ఖాతాలో తొమ్మిదో టైటిల్‌ను వేసి దేశాన్ని సంబరాల్లో ముంచాడు..

దుబాయ్‌: ఆసియాకప్‌ టీ20 టోర్నమెంట్‌లో భారత క్రికెట్‌ జట్టు చాంపియన్‌గా నిలిచింది. బౌలర్లు విశేషంగా రాణించిన చోట.. బ్యాటర్లు కాస్త తడబడినా తిలక్‌ వర్మ (53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 69 నాటౌట్‌) అజేయంగా నిలిచాడు. తద్వారా పాకిస్థాన్‌కు వరుసగా మూడో ఓటమిని రుచి చూపిస్తూ భారత్‌ 5 వికెట్ల తేడాతో గెలిచింది. అలాగే టోర్నీలో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి కప్‌ను గెలవడం విశేషం. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌ 19.1 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు సాహిబ్‌జాదా ఫర్హాన్‌ (38 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 57), ఫఖర్‌ జమాన్‌ (35 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 46), సయీమ్‌ అయూబా (14) మాత్రమే ఫర్వాలేదనిపించగా.. ఎనిమిది మంది బ్యాటర్లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. స్పిన్నర్లు కుల్దీ్‌పనకు నాలుగు.. అక్షర్‌, వరుణ్‌, పేసర్‌ బుమ్రాలకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో భారత్‌ 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 150 పరుగులు చేసి గెలిచింది. దూబే (22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 33), శాంసన్‌ (21 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 24) సహకరించారు. అష్రాఫ్‌కు మూడు వికెట్లు దక్కాయి.


0-sports.jpg

తిలక్‌ నిలబెట్టాడు..

పాక్‌ విధించిన స్వల్ప ఛేదనలో భారత్‌కు ఆరంభంలోనే గట్టి ఝలక్‌లు తగిలినా తిలక్‌ వర్మ ఎదురొడ్డి నిలిచాడు. అతడికి శాంసన్‌, దూబే సహకరించారు. తాజా టోర్నీలో ఎదురు లేకుండా సాగిన ఓపెనర్‌ అభిషేక్‌ (5)ను కట్టడి చేయడంలో ఈసారి పాక్‌ బౌలర్లు సఫలమయ్యారు. రెండో ఓవర్‌లో పేసర్‌ అష్రాఫ్‌ స్లోబాల్‌ను సిక్సర్‌గా మలిచే ప్రయత్నంలో తను క్యాచ్‌ అవుటయ్యాడు. ఇక తర్వాతి ఓవర్‌లోనే కెప్టెన్‌ సూర్య (1) క్యాచ్‌ను కెప్టెన్‌ సల్మాన్‌ అద్భుతంగా పట్టేశాడు. దీనిపై రివ్యూ కోరినా ఫలితం లేకపోయింది. పేసర్‌ షహీన్‌ ఈ వికెట్‌ తీశాడు. అటు పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న ఓపెనర్‌ గిల్‌ (12) ఈ క్లిష్ట పరిస్థితిలో నిలుస్తాడని ఆశించినా అతడూ నిరాశపరిచాడు. అష్రాఫ్‌ ఓవర్‌లోనే మిడాఫ్‌లో రౌఫ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో తొలి నాలుగు ఓవర్లలోనే జట్టు 3 వికెట్లు కోల్పోయింది. అప్పటికి స్కోరు 20 పరుగులే కావడం గమనార్హం. అయితే ఈ దశలో తిలక్‌-శాంసన్‌ జోడీ ఆదుకునే ప్రయత్నం చేసింది. ఆరో ఓవర్‌లో తిలక్‌ 4,6తో 11 రన్స్‌ రావడంతో పవర్‌ప్లేలో జట్టు 36/3తో నిలిచింది. కానీ పిచ్‌ పరిస్థితిని బట్టి వీరు రిస్కీ షాట్లకు వెళ్లకుండా, అడపాదడపా బౌండరీలతో పరుగులను రాబట్టారు. తొమ్మిదో ఓవర్‌లో శాంసన్‌ క్యాచ్‌ను తలత్‌ జారవిడిచాడు. స్పిన్నర్లు అబ్రార్‌, సయీమ్‌ ఓవర్లలో వీరు చెరో సిక్సర్‌తో ఆకట్టుకున్నారు. కానీ చక్కగా కుదురుకున్న ఈ జోడీని 13వ ఓవర్‌లో అబ్రార్‌ విడదీశాడు. శాంసన్‌ క్యాచ్‌ను ఫర్హాన్‌ పట్టేయడంతో నాలుగో వికెట్‌కు 57 పరుగుల కీలక భాగస్వామ్యం ముగిసింది. డెత్‌ ఓవర్లలో తిలక్‌-దూబే ద్వయం జోరు పెంచింది. 15వ ఓవర్‌లో అతడి 4,6.. దూబే 4తో 17 రన్స్‌ వచ్చాయి. తర్వాతి ఓవర్‌లోనే దూబే సిక్సర్‌ బాదగా తిలక్‌ 41 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. కానీ 17వ ఓవర్‌లో పేసర్‌ షహీన్‌ కేవలం ఆరు పరుగులే ఇచ్చి ఉత్కంఠ పెంచాడు. అయితే దూబే సిక్సర్‌తో 18వ ఓవర్‌లో 13 రన్స్‌ వచ్చాయి. 19వ ఓవర్‌లో దూబే అవుటైనా.. ఆఖరి ఓవర్‌లో 10 రన్స్‌ కావాల్సిన వేళ తిలక్‌ 6, రింకూ (4 నాటౌట్‌)తో మ్యాచ్‌ను అద్భుతంగా ముగించారు.


00-sports.jpg

స్పిన్‌ ధాటికి విలవిల

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ ఇన్నింగ్స్‌ ఆరంభానికి, ముగింపునకు పొంతన లేకుండా సాగింది. ఓపెనర్లు ఫర్హాన్‌, ఫఖర్‌ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగి పరుగులు రాబట్టడంతో 180+ స్కోరు ఖాయమనిపించింది. అటు పేస్‌, స్పిన్‌ తేడా లేకుండా ఫర్హాన్‌ స్వేచ్ఛగా బ్యాట్‌ ఝుళిపించాడు. అయితే తొలి పది ఓవర్ల పాటు పాక్‌ ఆధిపత్యమే సాగినా..స్పిన్నర్లు సరైన సమయంలో వికెట్లను పడగొట్టి భారత్‌కు రిలీ్‌ఫనందించారు. కుల్దీప్‌ అయితే తన చివరి రెండు ఓవర్లలో ఏడు పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు తీయడం విశేషం. ఫీల్డింగ్‌లోనూ భారత్‌ అదుర్స్‌ అనిపించుకుంది. హార్దిక్‌ లేకపోవడంతో శివమ్‌ దూబే కొత్త బంతితో బౌలింగ్‌ ఆరంభించాడు. అటు బుమ్రాను మాత్రం ఫర్హాన్‌ ఎప్పటిలాగే అవలీలగా ఆడేశాడు. అతడు వేసిన ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్‌లో 4,6తో 13 రన్స్‌ రాబట్టాడు. దీంతో పవర్‌ప్లేలో పాక్‌ 45 రన్స్‌ సాధించింది. అనంతరం కుల్దీప్‌ రెండు వరుస ఓవర్లలో ఫర్హాన్‌ ఒక్కో సిక్సర్‌తో ఒత్తిడి పెంచడమే కాకుండా, 35 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. అయితే ఈసారి తను గన్‌ సెల్యూట్‌ సంబరాల జోలికి మాత్రం పోలేదు. ఇక పదో ఓవర్‌లో మరో సిక్సర్‌తో జోరు చూపిన ఫర్హాన్‌ను వరుణ్‌ దెబ్బతీశాడు. ‘పుల్‌’తో భారీ షాట్‌కు ప్రయత్నించిన తను డీప్‌ మిడ్‌ వికెట్‌లో తిలక్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. అప్పటికే తొలి వికెట్‌కు 84 పరుగులు జత చేరాయి. వచ్చీ రాగానే సయీమ్‌ అయూబ్‌ రెండు ఫోర్లతో ఆకట్టు కోగా.. ఫఖర్‌ మరో ఫోర్‌తో పాక్‌ 12 ఓవర్లలో వంద పరుగులతో పటిష్టంగా కనిపిం చింది. అయితే 13వ ఓవర్‌ నుంచి స్పిన్నర్ల ఉచ్చులో చిక్కుకుని పాక్‌ బ్యాటర్లు విలవిల్లాడారు. కుల్దీప్‌, అక్షర్‌, వరుణ్‌ తమ వరుస ఓవర్లలో వికెట్లను పడగొడుతూనే పోయారు. 17వ ఓవర్‌లోనైతే కుల్దీప్‌ ఏకంగా ముగ్గురిని పెవిలియన్‌కు చేర్చాడు. మొత్తంగా స్పిన్నర్ల ధాటికి 33 రన్స్‌ వ్యవధిలో పాక్‌ చివరి 8 వికెట్లను కోల్పోయింది.


స్కోరుబోర్డు

పాకిస్థాన్‌ : ఫర్హాన్‌ (సి) తిలక్‌ (బి) వరుణ్‌ 57, ఫఖర్‌ జమాన్‌ (సి) కుల్దీప్‌ (బి) వరుణ్‌ 46, అయూబ్‌ (సి) బుమ్రా (బి) కుల్దీప్‌ 14, మహ్మద్‌ హారిస్‌ (సి) రింకూసింగ్‌ (బి) అక్షర్‌ 0, సల్మాన్‌ ఆఘా (సి) శాంసన్‌ (బి) కుల్దీప్‌ 8, హుస్సేన్‌ తలత్‌ (సి) శాంసన్‌ (బి) అక్షర్‌ 1, మహ్మద్‌ నవాజ్‌ (సి) రింకూసింగ్‌ (బి) బుమ్రా 6, షహీన్‌ షా (ఎల్బీ) కుల్దీప్‌ 0, ఫహీమ్‌ అష్రఫ్‌ (సి) తిలక్‌ (బి) కుల్దీప్‌ 0, హారిస్‌ రౌఫ్‌ (బి) బుమ్రా 6, అబ్రార్‌ అహ్మద్‌ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు : 7; మొత్తం 19.1 ఓవర్లలో 146 ఆలౌట్‌ ; వికెట్లపతనం : 1-84, 2-113, 3-114, 4-126, 5-131, 6-133, 7-134, 8-134, 9-141 ; బౌలింగ్‌ : దూబే 3-0-23-0, బుమ్రా 3.1-0-25-2, వరుణ్‌ 4-0-30-2, అక్షర్‌ 4-0-26-2, కుల్దీప్‌ 4-0-30-4, తిలక్‌ వర్మ 1-0-9-0.

భారత్‌ : అభిషేక్‌ (సి) రౌఫ్‌ (బి) ఫహీమ్‌ అష్రఫ్‌ 5, గిల్‌ (సి) రౌఫ్‌ (బి) ఫహీమ్‌ అష్రఫ్‌ 12, సూర్యకుమార్‌ (సి) ఆఘా (బి) షహీన్‌ షా 1, తిలక్‌ వర్మ (నాటౌట్‌) 69, శాంసన్‌ (సి) ఫర్హాన్‌ (బి) అబ్రార్‌ 24, దూబే (సి) షహీన్‌ షా (బి) ఫహీమ్‌ అష్రఫ్‌ 33, రింకూసింగ్‌ (నాటౌట్‌) 4 ; ఎక్స్‌ట్రాలు : 2 ; మొత్తం 19.4 ఓవర్లలో 150/5 ; వికెట్లపతనం : 1-7, 2-10, 3-20, 4-77, 5-137 ; బౌలింగ్‌ : షహీన్‌ షా 4-0-20-1, ఫహీమ్‌ అష్రఫ్‌ 4-0-29-3, మహ్మద్‌ నవాజ్‌ 1-0-6-0, హారిస్‌ రౌఫ్‌ 3.4-0-50-0, అబ్రార్‌ అహ్మద్‌ 4-0-29-1, అయూబ్‌ 3-0-16-0.


4444-'sports.jpg

ఇద్దరు కెప్టెన్లు

చెరొకరితో..

దుబాయ్‌: ఫైనల్‌ మ్యాచ్‌ టాస్‌ సమయంలో అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. సహజంగా టాస్‌ పడ్డాక ఇరు జట్ల కెప్టెన్లు అక్కడున్న ప్రెజెంటర్‌తో తమ అభిప్రాయాలను పంచుకుంటారు. కానీ అంతర్జాతీయ క్రికెట్‌లో తొలిసారిగా టాస్‌ ఇంటర్వ్యూను ఇద్దరు మాజీ ఆటగాళ్లు నిర్వహించడం గమనార్హం. భారత కెప్టెన్‌ సూర్యకుమార్‌ రవిశాస్త్రితో మాట్లాడగా, పాక్‌ కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘా.. వకార్‌ యూని్‌సతో సంభాషించాడు. వాస్తవానికి సూర్య తమతో షేక్‌హ్యాండ్‌ నిరాకరించడంతో పాకిస్థాన్‌ జట్టు భారత్‌పై ఎలాగైనా పైచేయి సాధించాలనే కసితో ఉన్నట్టుంది. అందుకే టాస్‌ అప్పుడు రెగ్యులర్‌ ప్రెజెంటర్‌ రవిశాస్త్రితో తమ కెప్టెన్‌ సల్మాన్‌ మాట్లాడడని తెగేసి చెప్పింది. దీంతో అతడి స్థానంలో తటస్థ వ్యక్తిని నియమించాలని ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) బీసీసీఐని కోరింది. కానీ అందుకు భారత క్రికెట్‌ బోర్డు ససేమిరా అంది. అందుకే మధ్యేమార్గంగా శాస్ర్తితో పాటు పాక్‌ మాజీ పేసర్‌ వకార్‌ యూని్‌సను కూడా టాస్‌ సమయంలో పంపారు.

పైక్రా్‌ఫ్టను మార్చేశారు..

దుబాయ్‌: భారత్‌-పాకిస్థాన్‌ జట్ల మధ్య జరిగిన ఆసియాకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు రెఫరీగా ఆండీ పైక్రాఫ్ట్‌ను మార్చారు. అతడి స్థానంలో రిచీ రిచర్డ్‌సన్‌ బాధ్యతలు నిర్వహించాడు. ఈ రెండు జట్ల మధ్య జరిగిన గ్రూప్‌, సూపర్‌-4 మ్యాచ్‌లకు రెఫరీగా పైక్రాఫ్ట్‌ వ్యవహరించాడు. అయితే ఈనెల 21న భారత్‌తో మొదటిమ్యాచ్‌ తర్వాత పాక్‌ జట్టు పైక్రా్‌ఫ్టపై ఫిర్యాదు చేసింది. టాస్‌ సమయంలో పాక్‌ కెప్టెన్‌ సల్మాన్‌తో సూర్యకుమార్‌ కరచాలనం చేయకపోవడం తెలిసిందే. ఫైనల్‌ మ్యాచ్‌కు మాత్రం ఎటువంటి వివాదం చోటు చేసుకోకుండా రిచీ రిచర్డ్‌సన్‌ను రెఫరీగా నియమించింది.

ఒకే ఆసియాకప్‌ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కుల్దీప్‌ యాదవ్‌

పాక్‌పై తొమ్మిది సార్లు ఛేదనకు దిగిన ప్రతీసారి భారత్‌ గెలవడం విశేషం.

2019, డిసెంబరు నుంచి శివమ్‌ దూబే పాల్గొన్న చివరి 34 టీ20 మ్యాచ్‌ల్లోనూ భారత్‌ ఓడిపోలేదు.

పురుషుల టీ20 టోర్నీలను ఓటమి లేకుండా భారత్‌ దక్కించుకోవడం ఇది నాలుగోసారి. 2016 ఆసియాకప్‌, 2023 ఆసియాగేమ్స్‌, 2024 టీ20 వరల్డ్‌క్‌పలోనూ ఇలాగే గెలిచింది.

ఆపరేషన్‌ సింధూర్‌..

‘మైదానంలో ఆపరేషన్‌ సింధూర్‌. అదే ఫలితం.. భారత విజయం. క్రికెటర్లకు అభినందనలు’

ప్రధాని నరేంద్ర మోదీ

ఇవి కూడా చదవండి

ఆసియా కప్ 2025లో చరిత్ర సృష్టించిన కుల్దీప్ యాదవ్..వికెట్ల వేటలో రికార్డ్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 29 , 2025 | 07:58 AM