Share News

Vishwabharat Completes: 176 కి మీ 44 గంటలు

ABN , Publish Date - Sep 06 , 2025 | 03:57 AM

ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన రేసుగా పేరు గాంచిన అలా్ట్ర ట్రయల్‌ డు మోంట్‌ బ్లాంక్‌ (యూటీఎంబీ) వరల్డ్‌ సిరీస్‌ పరుగును ఆంధ్ర వెటరన్‌ అథ్లెట్‌ అల్లంశెట్టి విశ్వభరత్‌ విజయవంతంగా పూర్తి చేశాడు. పశ్చిమ ఐరోపాలో...

Vishwabharat Completes: 176 కి మీ 44 గంటలు

అత్యంత క్లిష్టమైన రేసును

పూర్తిచేసిన తెలుగు రేసర్‌ విశ్వభరత్‌

ఈ ఘనత సాధించిన రెండో భారతీయుడిగా రికార్డు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన రేసుగా పేరు గాంచిన అలా్ట్ర ట్రయల్‌ డు మోంట్‌ బ్లాంక్‌ (యూటీఎంబీ) వరల్డ్‌ సిరీస్‌ పరుగును ఆంధ్ర వెటరన్‌ అథ్లెట్‌ అల్లంశెట్టి విశ్వభరత్‌ విజయవంతంగా పూర్తి చేశాడు. పశ్చిమ ఐరోపాలో ఎత్తయిన పర్వత శిఖరమైన మోంట్‌ బ్లాంక్‌ మూడు దేశాల సరిహద్దుల నడుమ ఉంటుంది. 2018లో మనాలికి చెందిన షశ్వత్‌ తర్వాత ఈ రేసు పూర్తి చేసిన రెండో భారతీయుడు భరత్‌నే కావడం విశేషం. ఫ్రాన్స్‌, ఇటలీ, స్విట్జర్లాండ్‌ల మీదుగా ప్రయాణించిన అనంతరం తిరిగి ఫ్రాన్స్‌లోని చమోనిక్స్‌లో రేసు ముగుస్తుంది. గత నెల 29న జరిగిన 176.5 కిలోమీటర్ల రేసును విశ్వభరత్‌ 44 గంటల 29 నిమిషాల్లో పూర్తి చేశాడు. రేసును 46 గంటల 45 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉండగా నిర్దిష్ట సమయం కంటే ముందే భరత్‌ గమ్యానికి చేరుకొని, ఈ ఘనత సాధించిన రెండో భారతీయుడిగా ఖ్యాతి గడించాడు. ప్రాణ వాయువు తక్కువగా ఉండే ఎత్తయిన పర్వత శ్రేణులు, తీవ్రమైన గాలులు, శీతల వాతావరణం, ప్రతికూల పరిస్థితులను తట్టుకొని భరత్‌ ఈ రేసును ముగించాడు. రేసు మధ్యలో 81వ కి.మీ దగ్గర భరత్‌కు విపరీతమైన కాళ్ల నొప్పి వచ్చినా పట్టుదలతో పరుగును పూర్తిచేశాడు. ఫ్రాన్స్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న భరత్‌ స్వస్థలం గుంటూరు. కొవిడ్‌ లాక్‌డౌన్‌లో భరత్‌కు పరుగుపై ఆసక్తి కలగగా 2022 నుంచి ప్రొఫెషనల్‌ రన్నర్‌గా రేసుల్లో పాల్గొనడం ప్రారంభించాడు. 110 కిలోమీటర్ల యూటీఎంబీ వరల్డ్‌ సిరీస్‌ రేసులో ప్రతిభ ఆధారంగా ఈ 176 కిలోమీటర్ల రేసుకు అర్హత సాధించాడు. ఈ రేసుకు అర్హత సాధించడమే అత్యంత క్లిష్టమైన విషయమని విశ్వభరత్‌ చెప్పాడు. రెండేళ్ల ముందునుంచే పలు క్వాలిఫయింగ్‌ ట్రయల్‌ రేసులను నిర్వహిస్తారని, అర్హత పాయింట్ల ఆధారంగా రన్నర్లకు ప్రధాన రేసుకు ఎంట్రీ లభిస్తుందని తెలిపాడు.

ఇవి కూడా చదవండి..

ఈడీ ముందుకు శిఖర్ ధవన్.. బెట్టింగ్‌ యాప్‌ కేసులో విచారణ..

కోహ్లీ పాస్.. లండన్‌లో టెస్ట్‌కు అనుమతి ఇవ్వడంపై ఫ్యాన్స్ ఆగ్రహం..

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 06 , 2025 | 03:57 AM