శాట్ ఏదీ జోష్
ABN , Publish Date - May 15 , 2025 | 05:20 AM
స్వతహాగా క్రీడాకారుడైన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక క్రీడారంగానికి కొంత ఊపు వచ్చింది. గచ్చిబౌలిలోని ఫుట్‌బాల్ స్టేడియం ఆధునికీకరణతో పాటు ఫిఫా ఇంటర్ కాంటినెంటల్ కప్, హాకీ, కరాటే జాతీయ స్థాయి పోటీలను కూడా....
చరిత్రాత్మక బడ్జెట్ ఇచ్చినా కనిపించని ఉత్సాహం
ఐదేళ్లుగా తయారీలోనే స్పోర్ట్స్ పాలసీ
విదేశీ పర్యటనలు, అధ్యయనాలతోనే సరి
సరిపడా కోచ్‌లు లేక కుంటుపడిన శిక్షణ
స్వతహాగా క్రీడాకారుడైన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక క్రీడారంగానికి కొంత ఊపు వచ్చింది. గచ్చిబౌలిలోని ఫుట్‌బాల్ స్టేడియం ఆధునికీకరణతో పాటు ఫిఫా ఇంటర్ కాంటినెంటల్ కప్, హాకీ, కరాటే జాతీయ స్థాయి పోటీలను కూడా నిర్వహించారు. చరిత్రలో కూడా ఎన్నడూ లేని విధంగా రూ.465 కోట్ల బడ్జెట్ ఇచ్చిన తర్వాత రాష్ట్ర క్రీడారంగాన్ని పరుగులు పెట్టించాల్సిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్) మాత్రం సీఎం ఆశయాలకు తగ్గట్టుగా పనిచేయడంలో విఫలమవుతోంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి, స్పోర్ట్స్ పాలసీ రూపకల్పన, క్రీడాకారులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ప్రణాళికబద్ధంగా ‘శాట్’ ముందుకు వెళ్లలేకపోతోంది.
తెలంగాణను స్పోర్ట్స్ హబ్‌గా తయారు చేస్తామన్న గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కనీసం కొత్త స్పోర్ట్స్ పాలసీని కూడా తయారు చేయకుండా ప్రకటనలతోనే కాలం గడిపేసింది. ఇక ఇప్పుడు క్రీడాశాఖ కూడా సీఎం రేవంత్ వద్దే ఉండడంతో కిందటి ఏడాది సుమారు రూ.330 కోట్లు, ఈసారి తెలంగాణ చరిత్రలోనే ఎన్నడు లేని విధంగా రూ.465 కోట్ల చరిత్రత్మాక బడ్జెట్‌ను కేటాయించారు. అయినా క్రీడారంగాన్ని గాడిన పెట్టేందుకు అవసరమైన విధానపరమైన నిర్ణయాలను తీసుకోవడంలో ‘శాట్’ మీనమేషాలను లెక్కిస్తోంది.
కొత్త స్పోర్ట్స్ పాలసీకి ఇంకెన్నేళ్లు?: గత ప్రభుత్వం 2021లో ఒడిశాకు చెందిన ఒక స్పోర్ట్స్ కన్సల్టెన్సీకి కొత్త క్రీడా పాలసీని రూపొందించే బాధ్యతను రూ.1.30 కోట్లకు అప్పగించింది. నాలుగేళ్లు గడుస్తున్నా స్పోర్ట్స్ పాలసీ వ్యవహారం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే తీరున ఉంది. బీఆర్‌ఎస్ సర్కార్ ఈ పాలసీ రూపకల్పనకు కేబినెట్ సబ్‌కమిటీ వేసినా కూడా వారి పాలనలో ఈ వ్యవహారం కొలిక్కి రాలేదు. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక రాష్ట్రంలోని క్రీడా నిపుణులు, దిగ్గజ క్రీడాకారులు, ప్రముఖ కోచ్‌లు, క్రీడా సంఘాలతో పలు ధపాలు సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి, పాలసీ రూపకల్పనకు ప్రభుత్వ క్రీడా సలహాదారుడు ఏపీ జితేందర్ రెడ్డి, శాట్ చైర్మన్ శివసేనా రెడ్డి విదేశీ పర్యటనలు కూడా చేశారు. భువనేశ్వర్, బళ్లారితో పాటు ఆస్ట్రేలియాలోని ప్రఖ్యాత క్రీడా సముదాయాలను, విశ్వవిద్యాలయాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదికలు కూడా సమర్పించారు. అయినా ఇప్పటికీ స్పోర్ట్స్ పాలసీ రూపకల్పనను పూర్తి చేయలేకపోవడంపై క్రీడాకారుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.
ముసాయిదాలో కనిపించని కొత్తదనం..: కొన్ని నెలల కిందట క్రీడా ప్రముఖుల ముందు శాట్ ఉంచిన ముసాయిదా స్పోర్ట్స్ పాలసీలో కొత్తదనమేమీ కనిపించలేదనే అభిప్రాయాలు నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న టార్గెట్ ఒలింపిక్స్ పోడియం స్కీమ్ (టాప్స్) వల్ల ప్రతిభావంతులైన యువ క్రీడాకారులకు నెలవారి ఉపకార వేతనంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ తీసుకోగలుగుతున్నారు. అలాంటి పథకం రాష్ట్రంలోనూ అమలు చేయాలనే వాదన బలంగా వినిపిస్తోంది. ప్రధానంగా ఒలింపిక్స్ సన్నద్ధతలో టాప్-10లో ఉన్న క్రీడాకారులను గుర్తించి వారికి ఉపకార వేతనంతో పాటు మెరుగైన శిక్షణకయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
జాతీయ క్రీడల్లో 26వ స్థానంలో తెలంగాణ..: తెలంగాణ కంటే క్రీడారంగంలో వెనుకబడి ఉన్న రాష్ట్రాలు కూడా ఈ ఏడాది ఉత్తరాఖండ్‌లో జరిగిన జాతీయ క్రీడల్లో అద్భుత ప్రతిభ కనబర్చాయి. తెలంగాణ మాత్రం 18 మెడల్స్‌తో 26వ స్థానంలో పతకాల పట్టికలో వెనుకంజ వేసింది. ఇందుకు ప్రధాన కారణం క్రీడాకారులను సన్నద్ధం చేయడంలో శాట్ వద్ద సరైన ప్రణాళిక లేకపోవడమే. కోచ్‌లు, ప్రభుత్వ స్పోర్ట్స్ అకాడమీల పనితీరును పరిశీలించే వారు లేకపోవడం, స్పోర్ట్స్ స్కూళ్ల నిర్వహణ కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో ఇతర రాష్ట్రాలతో తెలంగాణ పోటీ పడలేకపోతుంది.
నామమాత్రంగా సీఎం కప్ నిర్వహణ..: తమిళనాడుతో సహా పలు రాష్ట్రాలు భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏటా సీఎం కప్‌ను నిర్వహిస్తుంటే రాష్ట్రంలో మాత్రం నామమాత్రంగా మమ అనిపించారు. రాష్ట్రంలో కిందటి ఏడాది నిర్వహించిన సీఎం కప్‌లో విజేతలుగా నిలిచిన ప్లేయర్లకు ఇప్పటికీ నగదు ప్రోత్సాహకాలు అందలేదు. సీఎం కప్‌లో సత్తా చాటిన క్రీడాకారుల సర్టిఫికెట్లు, పతకాలను విద్యా, ఉద్యోగ ప్రవేశాల్లో పట్టించుకోవడం లేదు. ఇతర రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లోని పతకాలకు, సర్టిఫికెట్లకు ఉద్యోగ, విద్యా ప్రవేశాల్లో స్పోర్ట్స్ మెరిట్ పాయింట్లు కేటాయించినట్టే సీఎం కప్‌ను కూడా ఆ జాబితాలో చేర్చాలని క్రీడాకారులు కోరుతున్నారు. శాట్‌కు పాలకమండలి లేకపోవడం వల్ల విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని తెలుస్తోంది. దిగ్గజ క్రీడాకారులతో పాటు ప్రముఖ కోచ్‌లు, క్రీడా రంగ నిపుణులకు చోటు కల్పించి వారి సూచనలు, సలహాలను, అనుభవాన్ని ఉపయోగించుకుంటే రాష్ట్ర క్రీడారంగాన్ని అభివృద్ధి పథంలో నడిపించవచ్చునని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
(ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి-హైదరాబాద్)
సరిపడా కోచ్‌లేరి?
స్పోర్ట్స్ అథారిటీ ఉనికికి, మనుగడకు మూల స్తంభమైన కోచ్‌లకు మాత్రం శాట్‌లో ప్రాధాన్యత లేకుండా పోయింది. కనీస యంత్రాంగం లేక శాట్ కొట్టుమిట్టాడుతోంది. ప్రస్తుతమున్న ఆరుగురు రెగ్యులర్ కోచ్‌ల్లో ఐదుగురు మరో రెండేళ్లలో పదవీ విరమణ చేయనున్నారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న మరో 130 మంది కోచ్‌లతోనే శాట్ నెట్టుకొస్తోంది. ఇందులో జంట నగరాల్లోనే సుమారు 60 మంది కోచ్‌లు విధులు నిర్వహిస్తున్నారు. ఈ లెక్కన కనీసం నియోజకవర్గానికి ఒక్క కోచ్ కూడా లేని దుస్థితిలో శాట్ ఉంది. 33 జిల్లాలకు శాట్ నుంచి జిల్లా క్రీడాధికారులను కూడా నియమించుకోలేక ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులకు అదనపు బాధ్యతలను ఇస్తూ తూతూమంత్రంగా నడిపిస్తోంది. నిష్ణాతులైన ఎన్‌ఐఎ్‌స కోచ్‌లు లేక రాష్ట్రంలో క్రీడాకారులకు సరైన శిక్షణ అందడం లేదు. శాట్‌లో మూడు దశాబ్దాలకు పైగా సేవలందిస్తున్న కాంట్రాక్టు కోచ్‌ల క్రమబద్ధీకరణతో పాటు కనీసం 500ల మంది కొత్త కోచ్‌లను విధుల్లోకి తీసుకుంటే తప్ప శాట్ గాడిన పడదని తెలుస్తోంది.
ఇవీ చదవండి:
కోహ్లీ రిటైర్‌మెంట్.. అనుష్క ఎమోషనల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి